– విద్యా వ్యవస్థలో సమూల మార్పులు అవసరం
– తెలంగాణ ఉమెన్స్ అండ్ ట్రాన్స్‌జెండర్స్ ఆర్గనైజేషన్ జేఏసీ
– నీట్ నిర్వహణలో కేంద్రం విఫలమైందని ఆరోపణ
– ప్రధాని మోదీ, ధర్మేంద్ర ప్రధాన్, అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్
హైదరాబాద్, జూలై 23 (ప్రజాతంత్ర బ్యూరో) : దేశంలో విద్యా వ్యవస్థ బ్రష్టుపట్టిందని, విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఉమెన్స్ అండ్ ట్రాన్స్‌జెండర్స్ ఆర్గనైజేషన్ జేఏసీ నాయకులు పేర్కొన్నారు. దేశంలో నిరుద్యోగం పెరుగుతున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. తెలంగాణ ఉమెన్స్ అండ్ ట్రాన్స్‌జెండర్స్ ఆర్గనైజేషన్ జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ఘటనకు నిరసనగా గురువారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా హాజరైన పీఓడబ్ల్యూ నాయకులు సంధ్య, సామజిక కార్యాకర్త, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు(అనువాదం) గ్రహీత కె.సజయ, ఝాన్సీ, బండారు విజయ, స్వరూప, విష్ణు తేజ, భూమిక ఆర్గనైజేషన్‌కు చెందిన జ్యోతిరావు తదితరులు పాల్గొని మాట్లాడారు. నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. బీజేపీ పదేళ్ల పాలనలో ప్రశ్నపత్రాల లీకేజీలు సాధారణమయ్యాయని విమర్శించారు. ఢిల్లీలో జరిగిన ఘటనకు కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రయోజనాల కంటే పదవులకే బీజేపీ నాయకులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును బలిపీఠం ఎక్కించారని ఆరోపించారు. నీట్ లీకేజీ కారణంగా 22 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఢిల్లీలో గత 24 రోజులుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సోనం వాంగ్‌చుక్ దీక్ష నిర్వహిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా, నిరసనకారులపై పోలీసు చర్యలకు పాల్పడటం అమానవీయమని విమర్శించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పలు కేంద్ర విశ్వవిద్యాలయాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో విద్యార్థుల నిరసనకు మద్దతుగా పలువురు ప్రముఖులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు.





