- నిర్దారణకు ఎన్‌సిడిసికి నమూనాలు
- అధికారికంగా ధృవీకరించిన ఆరోగ్య శాఖ
న్యూ దిల్లీ, ఏప్రిల్ 9 : దేశంలో కొరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా అదుపులోకి వొస్తున్న సమయంలో కొత్త వేరియంట్ ‘ఎక్స్ఈ’ కలకలం సృష్టిస్తుంది. ఇటీవల ముంబయిలో ఈ రకం కేసు బయటపడినట్లు వార్తలు వొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా గుజరాత్‌లోనూ తొలి ఒమిక్రాన్ ‘ఎక్స్ఈ’ కేసు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారిక వర్గాల సమాచారం. ఒమిక్రాన్ కంటే అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న కొరోనా ఎక్స్ఈ వేరియంట్ గుజరాత్‌లో వెలుగుచూసింది. వడోదరకు చెందిన 60 ఏండ్ల వృద్ధుడిలో ఈ సరికొత్త వేరియంట్‌ను గుర్తించారు.
ప్రస్తుతం అతడు ఆరోగ్యంగా ఉన్నాడని అధికార వర్గాలు సమాచారం అందించాయి. అతనికి మార్చి 13న కొరోనా పాజిటివ్ వొచ్చిందని, వారం రోజుల్లోనే అతడు కోలుకున్నాడని చెప్పారు. ఇప్పుడు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నాడని వెల్లడించారు. అయితే అది కచ్చితంగా ఎక్స్ఈ వేరియంటేనా కాదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు.ఎక్స్ఈ వేరియంట్ సోకినట్లుగా భావిస్తున్న వ్యక్తి నమూనాలను నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ)కు పంపినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇది ఒమిక్రాన్ కంటే వేంగంగా వ్యాప్తి చెందుతున్నదని డబ్ల్యూటీఓ తెలిపింది. కాగా, దేశంలో తొలి ఎక్స్ఈ కేసు ముంబైలో గుర్తించారు. ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి వొచ్చిన ఓ మహిళలో ఈ వేరియంట్‌ను గుర్తించారు.
అయితే ఈ వార్తలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ప్రస్తుతమున్న ఆధారాలను బట్టి అది కచ్చితంగా ఎక్స్ఈ వేరియంటేనని చెప్పలేమని తెలిపింది. మహిళ నమూనాల్లో ఉన్న మ్యుటెంట్ జెనెటిక్ మేకప్.. ఎక్స్ఈ మ్యుటెంట్‌తో సరిపోలడం లేదని ఇన్సాకాగ్ పరిశోధనలో తెలిసిందని కేంద్రం వెల్లడించింది. అయితే గుజరాత్‌లో వెలుగు చూసిన వేరియంట్ ఎక్స్ఈ రకమేనా కాదా అన్నది అధ్యయనం చేయాల్సి ఉంది.