దిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో కవిత అరెస్ట్‌

కవిత ఫోన్లు, పీఏ ఫోన్లను ఈడీ స్వాధీనం
విమానంలో దిల్లీకి తరలింపు
అరెస్ట్‌పై ఈడీ అధికారులతో కేటీఆర్‌ వాగ్వాదం…
అరెస్ట్‌ సరికాదని ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ను ప్రశ్నించిన కేటీఆర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 15 : భారాస ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో శుక్రవారం మధ్యా హ్నం నుంచి బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో జాయింట్‌ డైరెక్టర్‌ నేతృత్వంలోని 8 మంది అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల అనంతరం అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. ఏ ప్రాతిపదికన అరెస్టు చేస్తారంటూ ఈడీ అధికారులను కవిత ప్రశ్నించినట్లు తెలుస్తుంది. కవిత నివాసం వద్దకు భారాస కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర ప్రభుత్వం, ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కవితను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పలేదని భారాస లీగల్‌సెల్‌ ప్రధాన కార్యదర్శి సోమభరత్‌ తెలిపారు. సుప్రీమ్‌ కోర్టులో కేసు పెండిరగ్‌లో ఉండగా, ఎన్నికల ముందు అరెస్టులు ఏంటని ప్రశ్నించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. అరెస్టు విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ రావుతో పాటు పలువురు భారాస నేతలు కవిత నివాసం వద్దకు చేరుకున్నారు. దిల్లీ లిక్కర్‌ కేసులో కవితను అరెస్ట్‌కు ముందు ఈడీ అధికారులు.. ఆమెకు అరెస్ట్‌ వారంట్‌తో పాటు సెర్చ్‌ వారెంట్‌ ఇచ్చారు. దీనికి సంబంధించి కవితతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు నోటీసులిచ్చినట్టు తెలిసింది. అనంతరం ఈడీ అధికారులు కవితను విమానంలో దిల్లీ తరలించారు.
కవిత అరెస్ట్‌పై ఈడీ అధికారులతో కేటీఆర్‌ వాగ్వాదం…అరెస్ట్‌ సరికాదని ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ను ప్రశ్నించిన కేటీఆర్‌
దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌ పై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత ఇంట్లోకి వెళ్లిన హరీష్‌ రావు, కేటీఆర్‌ అధికారులతో వాదనకు దిగారు. ట్రాన్సిట్‌ వారెంట్‌ లేకుండా ఎలా అరెస్ట్‌ చేస్తారంటూ..ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ను కేటీఆర్‌ ప్రశ్నించారు. అరెస్టు చేయమంటూ సుప్రీమ్‌ కోర్టుకు తెలిపి ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారంటూ నిలదీశారు. అధికారులు కోర్టుల ద్వారా ఇబ్బందులు ఎదుర్కునాల్సి వొస్తుందని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *