- నూకలు తినమనడం తెలంగాణ ప్రజలను అవమానించడమే
- వడ్లు కొనమంటే….నూకలు తినమని ఎద్దేవా చేస్తున్నారు
- దిల్లీ ప్రభుత్వాన్ని గద్దె దించింతేనే ధరలు తగ్గుతాయ్
- పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్‌పై పెంచిన ధరలను తగ్గించి బిజెపి నేతలు మాట్లాడాలి
- రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లక్షా 30 వేల పోస్టులను భర్తీ చేసింది
- మళ్లీ 90 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు
- గజ్వేల్ సభలో మంత్రి హరీష్‌రావు
సిద్ధిపేట, మార్చి 27(ప్రజాతంత్ర బ్యూరో) : వడ్లు కొనమంటే నూకలు తినమని తెలంగాణ ప్రజలను కేంద్రంలోని బిజెపి పార్టీ ప్రభుత్వం అవమానిస్తున్నది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మనల్ని నూకలు తినమనడం అంటే యావత్ తెలంగాణ ప్రజలను అవమాన పరచడమేనని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. తెలంగాణ ప్రజలను అవమానపరుస్తున్న కేంద్రంలోని బిజెపి పార్టీ సర్కార్‌కు తగు గుణం పాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని శ్రీగిరిపల్లిలో ఫంక్షన్ హాల్ డైనింగ్ హాల్‌కు శంకుస్థాపన, రైతు వేదిక ప్రారంభోత్సవం, అంగన్‌వాడి బిల్డింగ్ ప్రారంభోత్సవం, సీనియర్ సిటిజన్ సర్వీస్ సెంటర్ ప్రారంభోత్సవం, ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ను మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు.
అనంతరం గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని ప్రజ్ఞాపూర్‌లో ఎస్సీ కమ్యూనిటీ హాల్, రజక భవనం శంకుస్థాపన, గజ్వేల్ ప్రభుత్వ దవాఖాలనో పీడియాట్రిక్ కేర్ యూనిట్ సెంటర్ 30 బెడ్స్, ఐసియు 12 బెడ్స్, డయాలసిస్ 3 మెషిన్స్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి తన్నీరు హరీష్‌రావు మాట్లాడుతూ…పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగి ప్రజలకు మోయలేని భారంగా పరిణమించాయనీ, ఈ మోయలేని ఆర్థిక భారం తగ్గాలంటే దిల్లీ ప్రభుత్వాన్ని గద్దె దించింతేనే ధరలు తగ్గుతాయన్నారు. నూకలు తినమని అవమాన పరిచిన ఢిల్లీ ప్రభుత్వానికి నూకలు చెల్లెలా రాబోయే ఎన్నికల్లో ప్రజలు చెంప పెట్టు లాంటి తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు. పెట్రోల్ డీజిల్, వంట గ్యాస్‌పై పెంచిన ధరలను చేతనైతే తగ్గించి మాట్లాడాలనీ బిజెపి నాయకులకు హితవు పలికారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే లక్షా 30 వేల పోస్టులను భర్తీ చేసింది. మళ్లీ 90 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనుందని ఆయన పేర్కొన్నారు. రక్షణ శాఖతో సహా దేశంలోని కేంద్ర ప్రభుత్వ శాఖలలో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. దమ్ముంటే వెంటనే 15 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని బిజెపి స్టేట్ చీఫ్ బండి సంజయ్‌కు మంత్రి సవాల్ విసిరారు.
దేశంలోనే వైద్య ఆరోగ్య రంగంపై అత్యధిక డబ్బులు వెచ్చిస్తున్న రాష్ట్రం తెలంగాణనేనని అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో తెలంగాణ ప్రభుత్వ తలసరి వైద్య ఖర్చు రూ. 3,092కు చేరుకుందన్నారు. అలాగే ప్రభుత్వ దవాఖాలను ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటళ్లకు ధీటుగా తీర్చిదిద్దామన్నారు. ప్రభుత్వ జిల్లా దవాఖాన గజ్వేల్‌లో రూ. ఒక కోటి 60 లక్షల రూపాయలతో 40 పడకల పిల్లల ప్రత్యేక ఐసియును ప్రారంభించుకున్నామని మంత్రి తెలిపారు. డయాలసిస్ మిషన్ల సంఖ్యను 4 నుంచి 5కి పెంచుకున్నామన్నారు. ఖరీదైన డయాలసిస్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ ఏర్పాటు చేశామన్నారు. త్వరలో దుబ్బాకలోనూ డయాలసిస్ సెంటర్ ప్రారంభిస్తామని తెలిపారు. గజ్వేల్‌కు ఇటీవలే కొత్త పార్థీవ దేహాల వాహనంను అందించామన్నారు. పేషంట్లు అటెండెంట్ల కోసం రూ.17 లక్షల రూపాయలతో అన్ని వసతులతో అటెండెన్స్ షెడ్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రూ.6.4 లక్షలతో ఫ్రీజర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాయకల్ప అవార్డ్ కోసం దవాఖానాను సందర్శించిన దిల్లీ బృందం దవాఖానలో రోగులకు అందుతున్న వైద్య సేవలు చూసి అభినందించిందడం మనందరికీ గర్వకారణమన్నారు. తెలంగాణలో రూ.32 కోట్లతో 62 మార్చురీలను అధునీకరిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే రూ.28 లక్షల 48 వేల రూపాయలతో గజ్వేల్ మార్చురీనీ ఆధునీకరిస్తున్నామని చెప్పారు. జిల్లాలో సహజ ప్రసవాల శాతం మరింతగా పెరగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు స్పష్టం చేశారు. దేశంలో కల్యాణ లక్ష్మి కింద ఆడబిడ్డలకు ఆర్థిక సహాయం అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తెలిపారు. అన్నింటిపై ధరలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తున్నది కేంద్ర ప్రభుత్వం అని చెప్పారు.
సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలకు సిఎం కేసిఆర్ పంచితే….కేంద్ర ప్రభుత్వం రేట్లు పెంచి పేద ప్రజల డబ్బులు లాక్కుంటుందనీ చెప్పారు. కార్పొరేట్ హాస్పిటళ్లకు ధీటుగా అన్ని రకాల వైద్య సేవలు ప్రభుత్వ హాస్పిటళ్లలో అందిస్తున్నామని తెలిపారు గరీబోల్లు ప్రైవేట్ హాస్పిటళ్లకు వెళ్లి డబ్బులు నష్టపోవద్దన్నారు. ముస్లిం మైనారిటీలభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గజ్వేల్‌లో కట్టిన షాదీఖానా దేశానికే నమూనాగా ఉందన్నారు. మైనారిటీల విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. దేశంలోని 28 రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా ముస్లిం మైనారిటీలకు నాణ్యమైన విద్య అందించేందుకు పెద్ద ఎత్తున గురుకులాలు ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ ఛైర్‌పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్‌మెంటు కార్పొరేషన్ ఛైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, డిసిసిబి ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, గ్రంధాలయ సంస్థ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, గడా ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.