స్త్రీలపై తక్షణ న్యాయం పేరుతో చట్ట విరుద్ధమైన ఎన్కౌంటర్‌ లను బలపరిచే మీడియా, సమాజం, అన్ని సంఘటనలనూ ఒకే విధంగా చూడదు అని పదే పదే నిరూపణ అవుతూ వుంటుంది. స్త్రీలపై హింసను రిపోర్ట్‌ చేయటంలో కులం, మతం, జెండర్‌ అన్నీ ఆధిపత్య అంశాల ప్రభావంతోనే నిర్ణయించబడతాయి. తాజాగా ఇప్పుడు హైదరాబాద్‌ శివారు లోని అబ్దుల్లాపురమేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జెన్నరం కాలనీలో 2024 జనవరి16వ తేదీ న ‘భార్య తల నరికిన భర్త’ క్రూరమైన చర్యను మీడియా అలవోకగా తిప్పి చనిపోయిన మహిళ ‘పుష్ప’ వ్యక్తిత్వాన్నే హననం చేసింది. ఇక్కడ ఒక వ్యక్తిని తల నరికి చంపటం అనే చర్య కన్నా చనిపోయిన వ్యక్తి జీవితం మీద అవాస్తవాలని ప్రచారం చేయటంలోనే ‘కొన్ని ఛానళ్ళు’ దృష్టి ఎక్కువ కేంద్రీకరించాయి. ఏదైనా సంఘటన జరిగీ జరగక ముందే ప్రెస్‌ మీట్లు పెట్టేసి ప్రజలకు నిజాలను వెల్లడిస్తున్నామని చెప్పే పోలీసు వ్యవస్థ ఒక పేద దళిత యువతి అత్యంత కూరమైన హింసకు గురి అయి చనిపోతే, సరైన సమాచార సేకరణ చేయటానికి కూడా ఎందుకు ప్రయత్నించలేదు? పైగా చంపింది మొగుడే కాబట్టి ‘ఏదో బలమైన కారణమే వుంటుంది’ అనే పితృస్వామ్యభావన నరనరాల్లో జీర్ణించుకున్న స్వభావం పనిచేస్తూ వుంటుంది. నిజమే, ఆమె పేరు వెనుక ఆధిపత్య కులతోకలు లేవు. ఆమేమీ సెలిబ్రిటీ కాదు. కేవలం ఒక పేద దళిత నిస్సహాయ మహిళ. కొన్ని సంఘటనల్లో విపరీతమైన హడావుడి చేసే ‘కొన్ని రాజకీయ పార్టీలు’ ఈ విషయంలో తొంగికూడా చూసినట్లు లేదు. మళ్లీ అన్నిరకాల జుగుప్సాకరమైన ట్రోలింగ్‌ లకి గురయ్యే మహిళా సంఘాల కార్యకర్తలే అసలు నిజాన్ని బయటకు తెచ్చే భారాన్ని కూడా మోయాలి.
భార్యను భర్త నరికి చంపితే అది క్రూరమైన కుటుంబ హింసగా మీడియాకు కనపడక పోవటమే అత్యంత విషాదం. ‘అడ్డంగా దొరికిపోయిన భార్య, ఆమె ప్రవర్తన తో విసిగిపోయిన భర్త’ ‘ఆమెకు అతను మూడో భర్త, అతనికి ఆమె మొదటి భార్య’ ‘అతని కంటే ఆమె వయసులో పెద్దది, మోసం చేసిన భార్య’ .. ఇవీ ఎలెక్ట్రానిక్‌ మీడియాలో ఆ సంఘటనకు పెట్టిన శీర్షికలు!? ఎక్కడి నుంచీ ఈ సమాచారం తీసుకున్నారు? ఎవరు ఇచ్చారు? చనిపోయిన వ్యక్తి తిరిగివచ్చి ప్రశ్నించదనే ధైర్యమేనా? మీడియా వ్యూస్‌ కోసం, రేటింగ్‌ కోసం ఇంత దిగజారాల్సిన అవసరం వుందా? పోనీ, వాళ్లు పెట్టిన శీర్షికలు వాళ్ల పరిశోధనలో తెలిసినవే అనుకుందాం. అయినా గానీ చంపటం ఎలా సమంజసం అవుతుంది? అలా చంపటం సమంజసమే అనేవిధంగా శీర్షికలు ఎలా పెడతారు? జరిగింది నేరం కదా? ఆ మాత్రం ఆలోచన వుండదా?

చిన్నప్పుడు ఆమెతో కలిసి చదువుకున్న తోటి ఆడపిల్లలు ఈ మీడియా అరాచకత్వం మీదా, చనిపోయిన తమ స్నేహితురాలి మీద జల్లుతున్న అసత్యాల పట్లా అత్యంత ఆగ్రహంగా వున్నారు. వారంతా కూడా స్వంత కుటుంబాల్లో ఆడపిల్లల పట్ల ఉండే వివక్ష వల్ల నిరాదరణకు గురయిన పేదవారు. ఒక స్వచ్చంధ సంస్థ నడిపిన బాలలగృహంలో వుండి కలిసి చదువుకున్నవారు. కష్టపడి జీవితాన్ని నిర్మించుకుంటున్నవారు. తమ చిన్నప్పటి స్నేహాన్ని నిలుపుకుని ఒకరికొకరు ఆలంబనగా వుంటున్నవారు. చనిపోయిన పుష్ప 7వ తరగతి వరకు చదువుకుంది. ముగ్గురు ఆడపిల్లలు ఉన్న తలిదండ్రులకు తాను భారం కాకూడదని చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటూ నిజాయితీగా బతకటం జీవన ధ్యేయంగా మలుచుకుంది. బంగారు నగల దుకాణం లో సేల్స్‌ గర్ల్‌ గాను, వంట మనిషిగాను పనులు చేసి స్వయంకృషిని నమ్ముకుంది. ఆ క్రమంలోనే, ప్రేమించానని వచ్చిన వానితో పెండ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లల్లకు తల్లయింది. ప్రేమించానని చెప్పి నమ్మించి పెళ్లి చేసుకున్నవాడు, ప్రతీక్షణం అనుమానంతో హింస చూపించినా తన కుటుంబం, తన పిల్లలు అనుకుంటూ భరించింది. కూతురు కష్టాల్లో వుందని తెలిసినా గానీ ‘‘నువ్వు ఇష్టపడి చేసుకున్నావు కాబట్టి అనుభవించు’’ అని కన్నవాళ్లు పట్టించుకోలేదు. తన సంసారం లోని కష్టాన్ని తన చిన్నప్పటి దోస్తులకు అనేకమార్లు చెప్పుకుని బాధపడేది. బాధ్యత లేని భర్త ఇంటిపట్టున లేకుండా నెలల తరబడి కనబడకుండా వెళ్లిపోయి, మళ్లీ తనకు అవసరమయినప్పుడు ఇంటికొచ్చి, పుష్ప కష్టపడి సంపాదించిన చిన్న పాటి సొమ్మును కూడా కొట్టిలాక్కొని పోయేవాడు. ఈ హింసను భరించలేక ఒకటి రెండు సార్లు పోలీసు స్టేషన్‌ ను ఆశ్రయించి కుటుంబ హింస కేసుని పెట్టినా గానీ ఫలితం లేకపోయింది. ఆ హింసాయుత పరిస్థితులలో నుంచీ పిల్లలను తప్పించి హాస్టల్‌ లో వేసి చదివించాలని చూసింది. కుటుంబ పోషణకు మాత్రం బాధ్యత తీసుకొని భర్త, పిల్లలను హాస్టల్‌ లో వేయటానికి వొప్పుకోకపోగా అడ్డుపడ్డాడు. అతని హింసను భరించలేక దూరంగ వుండి బతికే ప్రయత్నం చేసింది కానీ ప్రతిసారీ మోసపూరితంగా లాక్కుపోయేవాడు. భర్త పని చేయడు, బాధ్యత లేదు, మంచి వాడు కాదు అని అర్థమవుతున్నాగానీ, కేవలం ‘‘పిల్లలకి తండ్రి కోసం, సమాజంలో భర్త లేని స్త్రీకి గౌరవం వుండదు అనే భావనతో ఆ హింసను పదే పదే ఆమోదించడమే ఆమె పాలిట మృత్యువు అయింది. ఆ చిన్ననాటి స్నేహితుల వల్లనే ఈరోజు అసలు వాస్తవం వెలుగు చూస్తోంది. లేకపోతే పుష్ప ఏ కుటుంబం కోసం నిశ్శబ్దంగా హింసను భరించిందో అది మాత్రం బయటకు రాకుండా తన వ్యక్తిత్వానికి విరుద్ధమైన నిందతో మిగిలిపోయివుండేది.

పుష్ప ఎదుర్కొన్న కుటుంబ హింస ఒక ముఖ్యమైన అంశం అయితే, ఆమె జీవితాన్ని అత్యంత అవమానకరంగా రిపోర్ట్‌ చేయటం అంటే కుటుంబ హింస బాధితుల మీద బండలు వేయటమే! భర్త చేతిలో పుష్ప జీవితమంతా హింస పడి అతని దుర్మార్గానికి శారీరకంగా హత్యకి గురైతే, మీడియా, పోలీసు వ్యవస్థా కలిసి పదే పదే ఆమెని మళ్లీ హత్య చేశారు. ఈ నేరాలకు సమాధానం వుంటుందా?

కుటుంబ హింసతో పోరాడటానికి వ్యవస్థాపరమైన మద్ధతు స్త్రీలకు అందాలంటే దాని మీద ప్రభుత్వాలు ఎంతో బాధ్యతతో ఆచారణాత్మకమైన విధానాలను రూపొందించ టమే కాకుండా అమలు కోసం బాహుముఖాలుగా కృషి చేయాల్సి వుంటుంది. కౌన్సిలింగ్‌ సెంటర్‌ల నుండీ, మీడియా, పోలీసు స్టేషన్లు, న్యాయస్థానాల వరకూ కూడా ‘సహానుభూతి’ తో వ్యవహరించే వ్యవస్థల రూపకల్పన అత్యంత ముఖ్యం. అవి నోటి మాటలతోనో, ఒక్కరోజులోనో అయ్యే పనికాదు. నిర్మాణాత్మకమైన పని అనేక వ్యవస్థల సమన్వయంతో జరగాలి. ఏ ప్రభుత్వమయినా పథకాల మీదే కాకుండా ఇలాంటి నిర్మాణాత్మకమైన పనికి ముందుకు వస్తుందా? తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆవైపుగా దృష్టి సారిస్తారని ఆశించవచ్చా???
-కె.సజయ, 

సామాజికవిశ్లేషకులు,
స్వతంత్ర జర్నలిస్ట్‌  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page