కొన్ని పార్టీలకు అంబేడ్కర్ ఒక నినాదం..కానీ మాకు విధానం
అంబేడ్కర్ రాజ్యాంగంతోనే తెలంగాణ రాష్ట్రం సాకారం
రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు
సిరిసిల్ల, ఏప్రిల్ 14(ప్రజాతంత్ర ప్రతినిధి) : దళిత, అణగారిన, పేద వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ అని రాష్ట్ర ఐటి, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. సిరిసిల్ల పట్టణంలో ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ ఏర్పాటు చేసిన సభలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. అంతకు ముందు పట్టణంలోని బిఆర్ అంబేడ్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళి అర్పించారు. అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాకారం అయిందని, అంబేడ్కర్ విధానమే తాము అనుసరిస్తున్నామని, కొన్ని పార్టీలకు అంబేడ్కర్ ఒక నినాదమని, తమకు మాత్రం ఒక మార్గదర్శకుడని వ్యాఖ్యానించారు. అంబేడ్కర్ తత్వాన్ని ఆకళింపు చేసుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ దళిత బంధు పథకాన్ని అమలు చేయిస్తున్నారని, ఈ దళిత బంధు పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. దళిత బంధు కోసం ప్రస్తుత బడ్జెట్‌లో రూ 17వేల 8 వందల కోట్లు కేటాయించామని, దీని ద్వారా రాష్ట్రలోని 2 లక్షల దళితులకు లబ్ది చేకూరుతుందని అన్నారు. ఒక పథకం కోసం దేశంలో ఇంత పెద్ద మొత్తం కేటాయించడం దేశ చరిత్రలో మొదటి సారి అని కెటిఆర్ అన్నారు. దళిత బంధును ఒక పథకంగా కాకుండా ఒక ఉద్యమంగా కెసిఆర్ అమలు చేయిస్తున్నట్లు చెప్పారు. మిషన్ భగీరథ, దళిత బంధు పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టిందని ఆరోపించారు. విద్య, ఉద్యోగాలలోనే గాకుండా ప్రభుత్వం ఇచ్చే లైసెన్సులు, కాంట్రాక్టుల్లో సైతం దళితులకు రిజర్వేషన్ కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణయేనని అన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ కింద అత్యధిక నిధులను సైతం తాము కేటాయిస్తున్నామని అన్నారు. ఎస్సీ విద్యార్థినిలకోసం 50 రెసిడెన్సియల్ కళాశాలలను ఏర్పాటు చేశామని, ఒక్కొక్క విద్యార్థికి కనీసం 1.2లక్షలు వెచ్చిస్తున్నామని, విదేశాల్లో విద్యనభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం అంబేడ్కర్ ఓవర్సీస్ నిధి కింద రూ 20 లక్షల గ్రాంట్‌ను ఇస్తుందని అన్నారు.
119 లబ్దిదారులకు దళిత బంధు చెక్కుల పంపిణి
సిరిసిల్ల బైపాస్ రోడ్లులో రూ 2 కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ భవనాన్ని మంత్రి కెటిఆర్ ప్రారంభించిన అనంతరం జరిగిన సమావేశంలో 119 లబ్దిదారులకు దళితబంధు చెక్కులను పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..75సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధిని తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం చేస్తుందని వ్యాఖ్యానించారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటికి శాశ్వత పరిష్కారం చూపామని, వ్యవసాయానికి 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నామని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జిల్లాల్లో నిర్మించిన జలాశయాల ద్వారా 6 మీటర్ల మేర భూగర్భ జలమట్టం పెరిగిందని, 7 సంవత్సారాల్లో తాము ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టి దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరి మెప్పును పొందుతున్నామని వ్యాఖ్యానించారు. రైతు బంధు, ఒంటరి మహిళలకు, బీడి కార్మికులకు, వృద్ధులకు, పెన్షన్లను అమలు చేస్తున్నామని అన్నారు. అట్టడుగు వర్గాలకు ఎన్నో అవకాశాలు కల్పించడానికి తాము కృషి చేస్తున్నామని, లోకంలో ఉన్నది ఉన్నోడు, లేనోడు అనే రెండు కులాలు మాత్రమేని అన్నారు. దళిత బంధు సాహసోపేతమైన నిర్ణయమని, ఈ పథకం లబ్దిదారులు లాభదాయకమైన యూనిట్లను ఎంపిక చేసుకుని అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి అన్నారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.