దేశ రక్షణకు సుశిక్షితులైన సైనికులు ఎంత అవసరమో, దేశ భద్రత విషయంలో వారు వినియోగించే నాణ్యమైన అత్యాధునిక ఆయుధాలు, మందుగుండు సామాగ్రీ, యుద్ధ పరికరాలు లాంటివి కూడా అతి ముఖ్యమైనవే అని గమనించాలి. ఆయుధ సామాగ్రిని ఉత్పత్తి చేసే గురుతర బాధ్యతలను ప్రతిష్టాత్మక దేశ ‘ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు’ చేబడుతున్నది. దాదాపు గత రెండున్నర శతాబ్దాలుగా, సగర్వంగా నూతనోత్సాహంతో ముందుకు సాగుతున్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల పాత్ర దేశ రక్షణరంగంలో అమోఘమైన పాత్రను నిర్వహిస్తున్నాయి. 1775లో స్థాపించబడిన ‘భారత ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు’ కేంద్ర కార్యాలయమైన ‘ఆయుధ భవన్’ కలకత్తాలో ఉన్నది. ఈ బోర్డు పరిధిలోకి దేశవ్యాప్తంగా విస్తరించబడిన 41 ఆర్డినెన్స్ ఫాక్టరీలు, 9 శిక్షణ సంస్థలు, 3 ప్రాంతీయ మార్కెటింగ్ కేంద్రాలు, 5 ప్రాంతీయ భద్రత నియంత్రణ కేంద్రాలు విశిష్ట సేవలు అందిస్తున్నాయి.
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల ఘన చరిత్ర: 18 మార్చి 1802 రోజున కలకత్తా సమీపాన ‘కోసిపోర్’ వద్ద ప్రారంభమైన భారత రక్షణ పరికరాల తయారీ కేంద్రం ప్రపంచంలోనే 37వ, ఆసియాలో 2వ, దేశంలో అతి పెద్ద పురాతన ఘన చరిత్రగల ప్రభుత్వరంగ పరిశ్రమలుగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు నిలుస్తున్నాయి. వీటి ద్వారా అతి ముఖ్యమైన రక్షణరంగ పరికరాలు (ఆయుధాలు, విడిభాగాలు, రసాయనాలు, ఆర్టిల్లరీ, అమ్యునిషన్, రక్షణ పరికరాలు లాంటి) తయారు చేయబడుతున్నాయి. రక్షణశాఖలోని త్రివిధ దళాలైన ఆర్మీ, నావీ, వాయు సేనలకు అవసరమైన నాణ్యమైన మందుగుండు సామాగ్రి, ఆయుధ పరికరాలను తయారు చేసి సకాలంలో సరఫరా చేయడం జరుగుతుంది.
త్రివిధ దళాలకు వెన్నెముక: దేశ భద్రతలో త్రివిధ దళాలతో పాటు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు అందిస్తున్న సేవలను గుర్తు చేసుకునే సందర్భంగా ప్రతి ఏటా 18 మార్చిన ‘ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ డే లేదా ఆయుధ సామాగ్రి ఉత్రత్తి పరిశ్రమ దినం’ పాటించుట జరుగుతోంది. త్రివిధదళాలకు వెన్నెముకగా నిలిచిన నాలుగో బలగంగానే కాకుండా సాయుధ దళాలకు బలాన్ని చేకూర్చే ఆయుధ కేంద్రాలుగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దేశ రక్షణ మంత్రిత్వశాఖలోని రక్షణ ఉత్పత్తుల విభాగం పరిధిలో పని చేసే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల ద్వారా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, ఆయుధ విడిభాగాలు, రసాయనాలు, విస్పొటన పదార్థాలు, పారాచూట్లు, తోలు/వస్త్ర ఉత్పత్తులు, ఆయుధ పరిశోధనలు, పరీక్షల నిర్వహణ, అభివృద్ధి, మార్కెటింగ్, గ్రెనేడ్లు, మైన్స్, మెసైల్స్, రాకెట్ లాంచర్స్, మిలిటరీ వాహనాలు, ఎయిర్క్రాఫ్ట్ ఆయుధాలు, లాజిస్టిక్స్ లాంటి అనేక నాణ్యమైన భూతల, గగన, సముద్ర తల వ్యవస్థలకు సంబంధించిన ఉత్పత్తులను తయారు చేస్తున్నది. దేశ త్రివిధ దళాలకే కాకుండా 30కి పైగా దేశాలకు రక్షణ పరికరాలను ఎగుమతి చేస్తున్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సేవలు వెలకట్టలేనివి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నడుస్తున్న ప్రభుత్వ రక్షణశాఖ సంస్థగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు అనాదిగా ఖ్యాతి గాంచింది.
త్రివిధ దళాలకు నాలుగో అంగం: 18 మార్చి రోజున జరిగే ‘ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ డే’ వేదికగా బోర్డు ఉత్పత్తి చేసిన ఆయుధాలు, రక్షణ పరికరాలు, ఆర్టిల్లరీ, రైఫిల్స్, గన్స్, పారాచూట్లు లాంటివి ప్రదర్శించడంతో పాటుగా కవాతుల నిర్వహణ, ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ఆయుధ శ్రీ, ఆయుధ దేవి, ఆయుధ భూషన్, ఆయుధ రత్న లాంటి ఆవార్డులు కూడా అందిస్తారు. అసాధారణ సేవలు అందిస్తున్న ‘సాయుధ దళాల వెనుక బలీయశక్తి (ఫోర్స్ బిహైండ్ ఆర్ముడ్ ఫోర్సెస్)’గా పేరు గడిరచిన ఆయుధ సామాగ్రి ఉత్పత్తి కేంద్రాలైన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు దేశ రక్షణ రంగాలకే వెన్నెముకలుగా నిలుస్తున్నాయని మరువరాదు. ‘ఫోర్త్ ఆర్మ్ ఆఫ్ డిఫెన్స్’గా పేరుగాంచిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు పరిధిలో 80,000లకు పైగా ఉద్యోగులు అవిశ్రాంత సేవలు అందిస్తున్నారు. దేశ రక్షణలో తెర వెనుక నిలిచి విశేష సేవలు అందిస్తున్న ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల కృషికి దేశ ప్రజలు గర్వపడుతూ, ఆయుధ నిర్మాతలను కృతజ్ఞతలను తెలియజేద్దాం.
-డా. బుర్ర మధుసూదన్ రెడ్డి
కరీంనగర్, 9949700037





