Take a fresh look at your lifestyle.

తెలుగే నా శ్వాస

పల్లవి:
తెలుగే నా శ్వాస
అను క్షణం వెలుగే
నా ధ్యాస
మనసంత తెలుగే
ఘనతంత తెలుగే
పలుకంటె తెలుగే
కులుకంటె మనదే
తెలుగే నా శ్వాస
అను క్షణం వెలుగే
నా ధ్యాస

చరణం:1
మాటల్లో మకరందాన్నే  మధురంగా కూర్చేవు
పాటల్లో పరిమళాన్నే పరిచయమే చేశేవు
ఆటల్లో ఆహ్లాదాన్నే అణువణువు నింపేవు
తోటల్లో పువ్వులనే   నవ్వులుగా మార్చావు
బాటల్లో  నేస్తమల్లే నా మదిలో వెలిశావు
కోటలో పాగా వేసి రాయల హృది గెలిచావు

చరణం:2
ముద్దబంతి పువ్వుల్లో
ముద్దులొలుకుతున్నావుసందె పొద్దు కాంతుల్లో
సరికొత్తగ ఉన్నావు
చుక్కల్లో జాబిల్లివై సింగార మొలికేవు
ముగ్గుల్లో ముత్యమై
మురిపాలు చిందేవు
కొమ్మల్లో కోయిలవై సరిగమలే పాడేవు
గుమ్మంలో గులాబివై
స్వాగతమే పలికేవు

చరణం:3
రామప్ప శిల్పమై
రమ్యంగా వెలిశావు
అజంతా భాషయై అందరి మది దోచావు
అన్నమయ్య కీర్తనై సరాగాలు చిలికావు
త్యాగరాజ కీర్తనై మధుర భక్తి తేల్చేవు
రామదాసు కీర్తనై రాముని ఎద నిలిచావు
క్షేత్రయ్య పదానివై సిరి మువ్వగ మ్రోగావు

చరణం:4
ఘంటసాల గళంలో
ఘనంగా సాగేవు
రామకృష్ణ గానంలో హాయి ఊయలూగావు
సుశీలమ్మ స్వరంలో సురగంగై దూకావు
జానకమ్మ కంఠంలో కమ్మదనమే పంచావు
బాలు అధరాలపై అమరగాన మయ్యావు
చిత్ర అమృత ధారల్లో జలపాత మయ్యావు

– గుండాల నరేంద్ర బాబు,  తెలుగు పరిశోధకులు, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం,
తిరుపతి, 9493235992

Leave a Reply