తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలకు గుర్తింపు

పివికి భారతరత్న రావడం గర్వకారణం
సిఎం రేవంత్‌, డిప్యూటి సిఎం భట్టిల హర్షం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9 : తెలుగు జాతి కీర్తి ప్రతిష్ఠలను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన మన తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని ఆర్థిక మేథావి, బహుభాషా కోవిడుదు పీవీ నర్సింహా రావుకు భారతరత్న దక్కడం గర్వించదగిన విషయమని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ బిడ్డలుగా మనందరి గుండెల్లో ఆనందం ఉప్పొంగే క్షణమిదని అన్నారు. పీవీతో పాటు మాజీ ప్రధాని చరణ్‌ సింగ్‌, ఎల్‌కే అద్వానీ, కర్పూరీ టాకూర్‌, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త  ఎంఎస్‌ స్వామినాథన్‌లకు భారతరత్న ప్రకటించడం సంతోషకరమన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న ప్రకటించడంపై సీఎం రేవంత్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పీవీకి భారతరత్న ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణలు తెచ్చి ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని కొనియాడారు. పీవీ నరసింహారావు కుటుంబానికి తెలంగాణ ప్రజల తరపున రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

పీవీకి భారత రత్న దక్కడం పట్ల డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. కుప్పకూలబోతున్న భారత్‌ ఆర్థిక వ్యవస్థను తన ఆర్థిక సంస్కరణలు, ప్రపంచీకరణ ద్వారా ప్రపంచంలోనే ఆర్థికంగా బలమైన దేశంగా భారత్‌ను రూపొందించడంలో స్వర్గీయ పీవీ నరసింహారావు తన చివరి శ్వాస వరకు శ్రమించారని కొనియాడారు. ఆయన చేసిన ఆర్థిక సంస్కరల పునాదుల ఫలితంగానే ఇవాళ భారత్‌ దేశం ప్రపంచంలోనే ఆర్థికంగా నాలుగవ బలమైన దేశంగా రూపుదిద్దుకుందన్నారు. గొప్ప రాజనీతిజ్ణుడు, బహుభాషా కోవిదుదు తెలంగాణ రాష్టానికి చెందిన పీవీకి భారత రత్న దక్కడం.. కాంగ్రెస్‌ పార్టీకి, రాష్ట్రానికి గర్వకారణంగా భావిస్తున్నామన్నారు. మా పోరాటాన్ని సుదీర్థక కాలం తర్వాత గుర్తించిన కేంద్ర ప్రభుత్వానికి భట్టి ధన్యవాదాలు తెలిపారు. నేడు దేశం బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిందంటే అందుకు పీవీ వేసిన పునాదులే కారణమని ఆయన సేవలను గుర్తుచేసుకుంటూ మంత్రి పొంగులేటి హర్షం వ్యక్తం చేశారు. పివి నరసింహారావుకు భారతరత్న అవార్డు దక్కడం యావత్‌ తెలంగాణ జాతికి గర్వకారణమని మంత్రి కొండా సురేఖ అన్నారు. పివి లాంటి అపర చాణక్యుడు మరొకరు లేరని కీర్తించారు. పివి ఆశయాల సాధనకు తెలంగాణ ప్రజాప్రభుత్వం అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నదని సురేఖ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *