తెలుగుభాషా సంస్కృతులకు వికాసానికి తెలంగాణా ఆంధ్రోద్యమం చేసిన కృషి చారిత్రకమైనది. శ్లాఘనీయమైనది. ‘రెండు నూర్ల పాతిక సంవత్సరాల ఆసఫ్జాహీ పరిపాలనా ఫలితంగా హైదరాబాదు రాష్ట్రంలో ఆంధ్రుడు తౌరక్యాంధ్రుడైనాడు’ (దేవులపల్లి రామానుజరావు, తెలంగాణాలో జాతీయోద్యమాలు). తెలుగు ప్రజలు మాతృభాషలో కాకుండా అరబ్బీ, పారసీ, ఉర్దూ భాషలలో చదువు నేర్చుకోవలసిన దుస్థితి ఏర్పడింది. తెలంగాణా భాష, సంస్కృతి మరుగునపడుతున్న ఈ కాలంలోనే తెలుగు వారి సాంస్కృతిక జీవితంపై కారుమేఘాలు కమ్మాయి.
– డా।। బన్న అయిలయ్య
స్వాతంత్య్రానికి పూర్వం భారత దేశంలో ఐదు వందలకు పైగా సంస్థానాలుండేవి. ఈ సంస్థానాలన్నింటిలో హైదరాబాదు సంస్థానం పెద్దది. హైదరాబాదు సంస్థానాన్ని నిజామ్ నవాబు పరిపాలిస్తుండేవాడు. హైదరాబాదు సంస్థానం ఒక సమష్టి కుటుంబంగా ఉండేది. భాషాపరంగా చూస్తే ఈ సంస్థానంలో తెలుగు, మరాఠి, కన్నడం,ఉర్దూ భాషలు మాట్లాడే ప్రజలు జీవిస్తుండేవారు. తెలుగు భాష మాట్లాడే ప్రజలు 90% కాగా, మిగిలిన మూడు భాషలు మాట్లాడే ప్రజలు 10% ఉండేవారు. ఈ పది శాతంలో 3% మాత్రమే ఉర్దూ మాతృభాషగా కలిగిన వారు ఉండేవారు. వివిధ భాషలు మాట్లాడే ప్రజలు ఒక సంస్థానంలో సహవాసం చేస్తూ, ఒకరి భాషను మరొకరు నేర్చుకోవటమే కాక నైపుణ్యం సంపాదించుకునే వారు. ఇతర భాషలు విజ్ఞానం కోసం నేర్చుకున్నా, మాతృభాషపై మమకారాన్ని వొదులుకోకుండా భాషాభివృద్ధికి దోహదపడ్డారు.
హైదరాబాదు సంస్థానాన్ని చిట్టచివరిగా నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ పరిపాలించాడు. ఇతని పాలనలో మధ్యయుగాల ఫ్యూడల్ సంస్కృతిని తలపింపజేసే పరిస్థితులుండేవి. దీనికి తోడు భాషా దురభిమానం కూడా పెరిగింది. నవాబు తన పూర్వుల కంటే మిన్నగా హైదరాబాదు సంస్థాన (తెలంగాణ) ప్రజలని బానిసలుగా భావించాడు. తన కనుసన్నలలో పరిపాలనా యంత్రాంగాన్ని ఉంచుకున్నాడు. ఇతర ప్రాంతాల్లోని మార్పులను ఏమాత్రం హైదరాబాదు సంస్థానంపై పడకుండా జాగ్రత్త పడేవాడు. సంస్థానంలో వెట్టిచాకిరి, అధికపన్నుల వసూళ్ళు, మత స్వాతంత్య్రం లేకపోవడం, జాగీరు పాలన, ప్రభుత్వ ఉద్యోగుల్లో అదుపులేని దోపిడి కొనసాగేది. ఇలాంటి అవినీతి పాలనతో హైదరాబాదు సంస్థానాన్ని ఒక ద్వీపంగా మార్చాడు. వీటన్నిటిని రూపుమాపి నిజామ్ ను గద్దె దింపడం కోసం ఒక గొప్ప ఉద్యమమే ఇక్కడ రావటం జరిగింది. ఇదంతా ఒకెత్తు అయితే, మాతృభాషా సంస్కృతుల వికాసం కోసం చేసిన ఉద్యమం మరొకెత్తు.
నిజామ్ మాతృభాష ఉర్దూ. ‘‘సంస్థానంలో రాజభాషగా ఉర్దూను నిజామ్ ప్రకటించాడు. నిజానికి హైదరాబాదు సంస్థానంలో అత్యధిక ప్రజల మాతృభాష తెలుగు. అల్పసంఖ్యాకుల భాష రాజభాషగా ఉండడం వలన హైదరాబాదు సంస్థానం ఉర్దూ మయమైంది. తెలుగు భాషకు ప్రభుత్వం నుండి ఆదరణ లభించకపోగా, దాని అభివృద్ధికి ప్రతిబంధకాలని నిజామ్ కల్పించేవాడు. తెలుగు భాషా సంస్కృతులు భవిష్యత్తులో నశించిపోతాయని గుర్తించిన మహానుభావులు దాని రక్షణకోసం, అభివృద్ధి కోసం అనేక విధాలుగా పాటు బడ్డారు. తెలుగు స్కూళ్ళు, గ్రంథాలయాలు స్థాపించుకోవటానికి ప్రభుత్వ అనుమతి కావల్సి వచ్చేది. అందుకే నిజామ్ నవాబు కాలంలో తెలుగుభాషా సంస్కృతులకు అజ్ఞాత ఆరణ్య వాసాలు సంప్రాప్తించాయి. ఇక్కడి ప్రజలు మాతృభాష తెలుగును నిజామ్ పూర్తిగా తొక్కివేసే ప్రయత్నం చేసాడు. తెలుగు ప్రజలు పెళ్ళి పేరంటాలకు, పండుగ పబ్బాలకు సభలు సమావేశాలకు వెళ్ళినా తమ మాతృభాషలో సంభాషించుకోవటం అవమానంగా భావించేవారు. ఉర్దూలోనే మాట్లాడుకొని తమ గౌరవాన్ని పెంచుకున్నామనుకునేవారు. కొద్ది మంది విద్యావంతుల వేషభూషణల్లో కూడా తెలుగు సంస్కృతిని విస్మరించినట్లుగా కన్పించేది. సంస్థానంలోని ఈ పరిస్థితిని చూసిన కొందరు కవులు – ‘ఏ భాషరా? నీది ఏమి వేషమురా? ఈ భాష యీ వేషమెందుకోసమురా?’ అంటూ నాటి అన్య భాషా వ్యామోహాన్ని నిరసించారు. ఈ విధంగా తెలుగుభాషా సంస్కృతులు కొడిగడుతున్న సమయంలో వాటి నికాసం కోసం బహుముఖ ప్రయత్నాలు జరిగాయి. అవి గ్రంథాలయోద్యమం, గ్రంథమాలల, సాహిత్య సంస్థల స్థాపన ఆంధ్రోద్యమం , విద్యారంగంలో మార్పు, పత్రిక వ్యవస్థాపన మొదలైన వాటి ద్వారా తెలుగు భాషా సంస్కృతుల వికాసం జరిగిందని చెప్పాలి. ఒకవైపు నియంత నవాబును గద్దె దించడానికి రాజకీయ ఉద్యమం కొనసాగుతుండేది. మరొక వైపు ఈ ఉద్యమంతో సంబంధం ఉండీ లేనట్లుగా భాషా సాంస్కృతిక ఉద్యమం నిశ్శబ్దంగా కొనసాగుతుండేది.
హైదరాబాదు సంస్థానంలో తెలుగు భాషా సంస్కృతులను పరిరక్షించడంలోనూ, వికాసవంతం చేయడంలోను గ్రంథాలయోద్యమం ప్రధాన పాత్ర వహించింది. 20 వ శతాబ్ది ప్రారంభంలోనే నిజామ్ రాష్ట్రంలో వచ్చిన గ్రంథాలయ ఉద్యమం ఇక్కడొచ్చిన అనేక ఉద్యమాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. 1901 సం.లో శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషా నిలయాన్ని కొమర్రాజు వేంకట లక్ష్మణరావు ప్రోత్సాహంతో హైదరాబాదు నగరంలో స్థాపించడంతో తెలంగాణ మంతట చైతన్య కిరణాలు ప్రసరించాయి. నిరంతరం ఈ భాషా నిలయంలో ఏదో ఒక సాహిత్య, సాంస్కృతిక భాషా ప్రసంగం కొనసాగేది. వివిధ రకాల చర్చలు ప్రసంగాలు కొనసాగేవి. కనుక అవి అప్రయత్నంగానే భాషా వికాసానికి తోడ్పడ్డాయి. ఇతర ప్రాంతం నుండి నిజామ్ రాష్ట్రంలోకి వచ్చిన ‘ఒక విద్వాంసుడు , ఒక మేధావి, ఒక డాక్టరు, ఒక రచయిత, కనీసం ఒక పాఠకుడైనా భాషా నిలయంలోకి రాకుండా ఉండలేక పోయేవాడు. అందుకే నిజామ్ రాష్ట్రాంధ్రులకి ఈ భాషానిలయం మాతృతుల్యమైంది. నిజామ్ రాష్ట్రంలో విజ్ఞాన వీచికలు వెదజల్లిన ఈ భాషానిలయం ప్రేరణతో నగరంలో ఇతర ప్రాంతాల్లో దాదాపు 114 వరకు గ్రంథాలయాలు స్థాపించబడ్డాయంటే అతిశయోక్తికాదు. హన్మకొండలో రాజరాజ నరేంద్రాంధ్రభాషానిలయం (1904), సికింద్రాబాద్ లో ఆంధ్ర సంవర్ధినీ గ్రంథాలయం (1905), వరంగల్లులో శబ్దానుశాసన గ్రంథాలయం (1908) స్థాపించబడ్డాయి. సూర్యాపేటలో ఆంధ్ర విజ్ఞాన ప్రకాశిక గ్రంథాలయం (1917), నల్లగొండలో ఆంధ్రసరస్వతి గ్రంథాలయం (1918) నెలకొల్పబడ్డాయి.
ఇంకా భాషా కల్పవల్లి (1920), వేమన ఆంధ్ర భాషా నిలయం (1923), ఆంధ్ర విద్యార్థి సంఘగ్రంథాలయం (1925) మొదలైనవి స్థాపించబడ్డాయి. ఇవి నిజామ్ రాష్ట్రంలోని మాతృభాషను రక్షించుకోవడం కోసం, నిరక్షరాస్యత నిర్మూలన కోసం, తెలుగు సంస్కృతి వికాసం కోసం ఎంతగానో కృషి చేసాయి. ఈ గ్రంథాలయాల్లో పురాణ కాలక్షేపం, పత్రికా పఠనం, సభలూ సమావేశాలు నిత్యం జరిగేవి. గ్రామంలోని వారికి గ్రంథాలయం ఒక చైతన్య కేంద్రం. ‘ తెలుగువారి ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకోవడం కోసం, తెలుగు భాషను మలుపు తిప్పడానికి, తెలుగు సంస్కృతిని రక్షించ డానికి ఈ ఉద్యమం కొండంత అండగా నిలిచింది’ (వెలగా వెంకటప్పయ్య, నూరేళ్ళ గ్రంథాలయోద్యమం). తెలుగుభాషా సంస్కృతుల అభివృద్ధికి గ్రంథమాలల కృషిని చరిత్ర మరిచిపోదు. దేశంలోనే మొట్టమొదటి గ్రంథమాల విజ్ఞాన చంద్రికా గ్రంథమాల (1906). దీని వ్యవస్థాపకులు కొమర్రాజు గారే. ఈ గ్రంథమాల చిన్నచిన్న పుస్తకాలు, జీవిత చరిత్రలు, పదార్థ జ్ఞానం, రసాయన, జంతు, భూగర్భ, అర్థశాస్త్రం లాంటి వైజ్ఞానిక గ్రంథాలెన్నో ప్రకటించింది. చారిత్రక నవలలను కూడా ప్రచురించిన ఈ గ్రంథ మాల తెలుగు విజ్ఞాన ప్రసారానికి, సంస్కృతీ నికాసానికి చాలా దోహదం చేసింది. ఇంకా నిజామ్ రాష్ట్రంలో విజ్ఞాన ప్రచారిణీ గ్రంథమాల (ఇనుగుర్తి) 21 గ్రంథాలు ప్రచురించిందంటే భాషా సేవకు ఎంతగా అంకితమైందో అర్ధమవుతుంది. విశ్వేశ్వర గ్రంథమాల ( ఓరుగల్లు), కాకతీయ గ్రంథమాల, దేశోద్ధారక గ్రుథమాల, అణా గ్రంథ మాలలు భాషా సేవకే పుట్టినవి. ఇవి సంస్క•తీ వికాసానికి దోహదం చేస్తూ వచ్చాయి.
భాషా సాంస్కృతిక సేవకోసమే పుట్టినవి సాహిత్య సంస్థలు. ఇవి నిజామ్ రాష్ట్రంలో భాషా సంస్కృతులు నిర్జీవం కాకుండా కాపాడాయి. హైదరాబాద్ నగరంలో సాహితీ సమితిని (1939) బూర్గుల రంగనాథరావు, వెల్దుర్తి మాణిక్యరావు మొదలైన వారు స్థాపించారు. ఇది భాషా సాహిత్య వికాసానికే కాకుండా మహిళలకు రంగవల్లి పోటీలు నిర్వహించి సాంస్కృతిక వాతావరణం కు అవకాశమిచ్చాయి.
ఆంధ్రభాషా సాహిత్య సంస్కృతుల పరిరక్షణ, వికాసం ప్రధానలక్ష్యంగా కొన్ని సంస్థలు నిజామాంధ్రరాష్ట్రంలో వెలిసాయి. వాటిలో ముఖ్యమయినది ఆంధ్ర సారస్వత పరిషత్తు (1943). రాష్ట్రాంధ్రుల్లో మాతృభాషాభిమానం పెంపొందించుట, భాషాభివృద్ధికి కృషి చేయుట పరిషత్తు ప్రధాన ఉద్దేశ్యాలు. నిజామ్ రాష్ట్రంలో తెలుగు పాఠశాలలు తక్కువగా ఉన్న రోజుల్లో తెలుగు భాషా పరిరక్షణ కోసం పరితపించిన సంస్థ ఇది. వివిధ రకాల ప్రజలకు సులభంగా తెలుగు భాష ఉండునట్లు పరీక్షలు నిర్వహిం చుటకు ప్రణాళికలు తయారుచేసింది. రాత్రి పాఠశాలలు నడిపి వయోజనులకు అక్షర జ్ఞానం ప్రసాదించింది. నిజామ్ రాష్ట్రంలో మినుకు మినుకు మంటూ ఆరిపోబోతున్న తెలుగుభాషా జ్యోతిని కాపాడి ప్రకాశవంతం కావించిన సంస్థ యిది. తెలంగాణాలో పోలీసు చర్య తరువాత మాతృభాష బోధనకు పరిషత్తులో చదువుకున్న విద్యార్ధులే బోధకులైనారు. దీనివలన ఇది భాషకు చేసిన దోహదం ఎంతటిదో తెలుస్తూనే ఉంది. ఇంకా సాహితీ మేఖల (నల్లగొండ) లాంటి సంస్థలు భాషా సేవ చేసినవే.
నిజామ్ రాష్ట్రాంధ్రభాషా వికాసానికి సంస్థలే కాకుండా సంస్థానాలు చేసిన కృషి మరువలేము. గద్వాల, వనపర్తి, అమరచింత సంస్థానాల భాషా సేవ ప్రశంసనీయమైనవి. తెలుగుభాషా సంస్కృతులకు వికాసానికి తెలంగాణా ఆంధ్రోద్యమం చేసిన కృషి చారిత్రకమైనది. శ్లాఘనీయమైనది. ‘రెండు నూర్ల పాతిక సంవత్సరాల ఆసఫ్జాహీ పరిపాలనా ఫలితంగా హైదరాబాదు రాష్ట్రంలో ఆంధ్రుడు తౌరక్యాంధ్రుడైనాడు’ (దేవులపల్లి రామానుజరావు, తెలంగాణాలో జాతీయోద్యమాలు). తెలుగు ప్రజలు మాతృభాషలో కాకుండా అరబ్బీ, పారసీ, ఉర్దూ భాషలలో చదువు నేర్చుకోవలసిన దుస్థితి ఏర్పడింది. తెలంగాణా భాష, సంస్కృతి మరుగునపడుతున్న ఈ కాలంలోనే తెలుగు వారి సాంస్కృతిక జీవితంపై కారుమేఘాలు కమ్మాయి. ఆ కారు మేఘాలు ‘గస్తీ నిషాన్-53’ రూపంలో తెలంగాణా అంతటా దట్టంగా కమ్ము కున్నాయి. ఈ గస్తీ నిషాన్ ప్రకారం తెలంగాణలో సభలు సమావేశాలు జరుపుకోరాదు. పత్రికలు స్థాపించుకోకూడదు. ఒకవేళ స్థాపించినా పత్రిక పేరుకు ముందు ‘ఆంధ్ర’ అనే పదం చేర్చకూడదు. ఈ విధమైన ఆంక్షలు ప్రజల భాషా సాంస్కృతిక వికాసానికి విఘాతం కలిగించేవే. ఈ పరిస్థితులను అధిగమించడం కోసమే నిజామ్ రాష్ట్రంలో ఆంధ్రోద్యమం (1921) భాషా సాంస్కృతికోద్యమ రూపంలో వచ్చింది. రాష్ట్రంలో పదిహేను పాఠశాలలకు మించలేవు. రాష్ట్రం వెలుపల నిజామ్‌కు ‘సమస్త విద్యల పోషకుడు’ అనే పేరుంది. కాని అతడు హైదరాబాదు నగరంలోని పాఠశాలలకే డబ్బు ఖర్చు పెట్టేవాడు.
1918 సం.లో నిజామ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపించాడు. దీనిలో ఉర్దూ బోధన భాషగా ఉంది. ‘తెలుగు బోధనా భాషగా ఉన్న ఒకే ఒక్క పాఠశాలను ఆనాటి ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుబంధంగా గుర్తించడానికి నిరాకరిస్తే పూనాలోని కార్వే యూనివర్సిటీకి వెళ్ళి పరీక్షలు రాయాల్సిన దుర్గతి ఆనాటి బాల బాలికలకు కలిగింది ‘ (ఆంధ్రప్రదేశ్ దర్శిని, విశాలాంధ్ర పబ్లిషింగ్). ఈ విధంగా తెలుగు భాషా వికాసానికి ప్రభుత్వ సహాయ సహకారాలుండేవి కావు. ప్రజలు ఖాన్గీ (ప్రయివేటు) పాఠశాలలు ఏర్పాటు చేసుకున్నారు. ఆంధ్రభాషాభివర్దిని జనగాంలో, ఆంధ్ర విద్యాభివర్దిని AVV) వరంగల్లులో ప్రజలు స్థాపించుకున్న పాఠశాలలు. హైదరాబాద్‌లో ఆది హిందూ బాలిక పాఠశాల, ఆంధ్ర విద్యాలయం నెలకొల్ప బడ్డాయి. ఈ ఖాన్గీ పాఠశాలలు నిజామ్ నుండి అనేక ప్రతిబంధకాలను ఎదుర్కొంటూ ఆంధ్రభాషార్జనుల విద్యా దాహాన్ని తీర్చాయి. నిజామ్ ఈ పాఠశాలలను రద్దుచేస్తూ గస్తీ (సర్క్యులర్) జారీ చేసాడు. ప్రజలు మాతృభాషను రక్షించుకోవడానికి వీలులేకుండా నిజామ్ ఆటంకాలు కల్పించి తెలుగు భాషని ‘తెలంగీ భేడంగీ’ (ముక్కు మొగం లేని దిక్కు మాలినదని అర్ధం) గా మార్చాడు.
1921 సం.లో ఒక సంస్కార సభను వివిధ భాషా కుటుంబీకులు హైదరాబాదు నగరంలో ఏర్పాటు చేసుకున్నారు. ఎవరి మాతృభాషలో వారు ఉపన్యసించారు. తెలుగు మాతృభాష కలిగిన ఆలంపల్లి వెంకట రామారావు మాట్లాడుతుండగా కన్నడిగులు, మహారాష్ట్రులు వక్తను హేళన చేస్తూ వచ్చారు. ఈ సంఘటనతో తెలుగు వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతిన్నది. అదేరోజు టేకుమాళ్ళ రంగారావు ఇంట్లో ఆంధ్ర జన సంఘాన్ని ఏర్పాటు చేసికొన్నారు. ఈ సంఘం శాఖలు తెలంగాణా అంతటా ఏర్పడ్డాయి. ఇవ్వన్ని కలిపి ‘ఆంధ్రజన కేంద్ర సంఘం’ ఏర్పాటు చేయబడింది. దీని ప్రధాన ఉద్దేశ్యం మాతృభాషాభిమానం పెంపొందించడం. విద్వాంసులని గౌరవించడం, పఠన మందిరాలు ఏర్పర్చడం, గ్రంథమాలలు, పాఠశాలలు స్థాపించడం, తెలంగాణా పల్లెలు తిరిగి తాళపత్రాలను, శాసనాలు సేకరించడం, పరిశోధించడం, లఘు పుస్తకాలు, కరపత్రాలు, ఉపన్యాసాలు ప్రచురించి పంచడం. ఆంధ్ర భాషా ప్రచారాన్ని విస్తృతం చేయడం మొదలైనవి ఈ సంఘం ప్రధాన ఆశయాలు. ఆంధ్ర జన సంఘమే, ఆంధ్ర మహాసభగా, ఆంధ్ర మహాసభ ఆంధ్రోద్యమంగా పరిణామం చెందినది. ‘…. 1930 సం. వరకు అనగా మొదటి ఎనిమిది సంవత్సరాల కాలము ఆంధ్ర సంస్కృతిని, ఆంధ్ర భాషను కాపాడుటకు కృషి సల్పుటయే ఆంధ్రోద్యమం ప్రధాన ఆశయమై యుండెను.
’ (దేవులపల్లి రామానుజరావు తెలంగాణాలో జాతీయోద్యమాలు).
నిజామ్ రాష్ట్రంలో పత్రిక ఆవిర్భావమే జరుగగూడదని నిషేధాలున్నాయి. అయినా భాషా సేవకులు పత్రికలను స్థాపించారు. ప్రభుత్వం నుండి ఆటుపోటులను రుచి చూసారు కూడా. ఉన్న పత్రికలకు కనీస హక్కులు ఇవ్వటానికి నిజామ్ నిరాకరించారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా తెలుగు భాషా సంస్కృతులకు ఉచిత రీతిగా పత్రికలు సేవచేసాయి. కవులకు, కథకులకు, విమర్శకులకు, రచయితలకు, పరిశోధకులకు ప్రోత్సాహాన్నిచ్చిన పత్రికలు భాషా సంస్కృతుల వికాసానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. గోల్కొండ, తెనుగు, ప్రత్యూష, నీలగిరి, సుజాత, శోభ, భాగ్యనగర్, ఆంధ్రాభ్యుదయము, తెలుగుతల్లి, ఆంధ్రవాణి మొదలైన పత్రికల్లో ప్రచురించిన వాజ్మయము తెలుగుభాష సంస్కృతుల వికాసానికి ఎంతగానో తోడ్పడింది. ఇలా గ్రంథాలయాలు, గ్రంథమాలలు, సంఘాలు, సభలు ఏర్పాటు చేసుకున్న ప్రజల మనోదర్పణాన్ని చాటే విధంగా వాటికి ముందు ఆంధ్ర చేర్చి భాషపై వారికున్న అభిమానాన్ని చాటుకున్నారు. నిజామ్ నిరంకుశ రాజ్యం నుండి విముక్తిని కోరుకుంటూ, మాతృభాషా సంస్కృతుల వికాసాన్ని పెంపొందించుకుంటూ వెలుగు వైపుకు తెలంగాణా ప్రజలు పయనించారు. భావి తరాలకు చైతన్య కేంద్రాలుగా నిలిచారు.