దేశంలో అత్యధిక డోసులు వేసిన రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్‌ది మొదటి స్థానం
న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 12 ఏండ్లకు పైబడిన వారందరితో కలిపి 6,20,49,278 కోవిడ్ టీకా డోసులు వేసినట్లు కేంద్రం ప్రకటించింది. 18 ఏండ్లు పైబడిన విభాగంలో 2,94,16,649 మందికి ఫస్ట్ డోస్ అందగా, 2,78,96,172 మంది సెకండ్ డోస్ వేయించుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అన్ని రాష్ట్రాలకి సంబంధించిన ఈ వివరాలు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసింది. ఇందులో దేశవ్యాప్తంగా 18 నుంచి 15 ఏండ్ల మధ్య వారిలో 16,68,626 మందికి ఫస్ట్ డోస్ పడగా, 13,76,859 మందికి సెకండ్ డోస్ పడింది.
అలాగే, 12 నుంచి 14 ఏండ్ల పిల్లల్లో 9,37,997 మందికి ఫస్ట్ డోస్ వేయగా, 1,24,650 మందికి సెకండ్ డోస్ వేసినట్లు ప్రకటించింది.18 నుంచి 59 ఏండ్ల మధ్యలో 15,069 మందికి ప్రికాషన్ డోస్ అందించినట్లు కేంద్రం వెల్లడించింది. 60 ఏండ్లు పైబడిన వారు, హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్‌లో 6,13,256 మందికి కోవిడ్ ప్రికాషన్ డోసులు అందించినట్లు తెలిపింది. కాగా శుక్రవారం ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 1.87 కోట్ల డోసులు వేసినట్లు కేంద్రం ప్రకటించింది. దేశంలో అత్యధిక కోవిడ్ డోసులు వేసిన రాష్ట్రాల్లో యూపి ఫస్ట్ ప్లేస్‌లో ఉంది.
యూపిలో ఇప్పటి వరకు 30.97 కోట్ల టీకా డోసులు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి అందించింది. తర్వాత స్థానంలో మహారాష్ట్ర 16.34 కోట్లు, వెస్ట్ బెంగాల్ 13.69 కోట్లు, బిహార్ 12.76 కోట్లు, మధ్య ప్రదేశ్ 11.71 కోట్ల డోసులు ఇచ్చింది. అలాగే, దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడుతో పాటూ, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలు 10 కోట్లకు పైగా డోసులు వేసాయి. పక్క రాష్ట్రమైన ఏపిలో 9.27 కోట్లు డోసులు వేసినట్లు కేంద్రం తెలిపింది.