తెలంగాణ పార్టీకి సహజ కష్టాలు..!

స్వరాష్ట్ర సాధనలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్‌ తో కేసీఆర్‌ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తెలంగాణ గడ్డలో ఒక చారిత్రాత్మక పాత్రను పోషించింది. రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమికతో పాటు ఒక వెలుగు వెలిగిన పార్టీలో అనుచిత వ్యూహాలు వికటించి తార్కికమైన ముగింపును ఏరి, కోరి తెచ్చుకొందనే  బావన అందరిలోనెలకొంది.తెలంగాణ కోసం పుట్టిన పార్టీకి 23 సంవత్సరాల చరిత్రలో  జరిగిన పరాభవం మొట్ట మొదటిది కాదు.కానీ, అవినీతి, అక్రమాలు తీస్తున్నకొద్దీ నమ్ముకున్న క్యేడర్‌ కకావికలం అయ్యింది.ఇన్నాళ్లు స్వంత పార్టీలో ఆగడాలు తట్టుకోక అదనుకోసం ముర్తుల రూపంలో వేచిచూసిన శత్రువులు కోవర్టుల ప్రోత్సాహంతో దెబ్బ మీద దెబ్బ కొట్టుతున్నారు. ఆపరేషన్‌ ఆకర్ష్‌ పేరుతో కేసీఆర్‌ తో ఉన్న వర్గాలను అక్కున చేర్చుకునేందుకు అటు కాంగ్రెస్‌,ఇటు బీజేపీ పోటాపోటీగా గేట్లు బార్లా తెరచింది.
అవకాశవాద నాయకులు వెనుదిరిగి కాంగ్రెస్‌ లో చేరి బలమైన పునాదులు వేసుకుంటున్నారు. అసెంబ్లీ పర్వం ముగిసిన మూడు మసాల కాలంలో నాయకుల తీరు చూస్తుంటే బీఆర్‌ఎస్‌ ఏదో అంటరానిదిగా చిత్రీకరించడం క్యేడర్‌ జీర్ణించుకోవడం లేదు.ఈ పరాభవకరమైన స్థితికి బంగారు తెలంగాణ బ్యాచ్‌ అనే ప్రచారం ఉంది.
మొన్నటి వరకు అంట కాగిన పార్టీలు పొత్తుమాట కాదుకదా అసలు వాసన కూడా పట్టడం లేదు.దశాబ్ద కాలంగా వివిధ హోదాల్లో పదవులను అనుభవించిన పాలకులు, రాజకీయ నాయకులు కూడా ఆస్తి, పాస్తులు కాపాడుకోవడానికి ఈ పార్టీ ‘అక్రమ సంబంధం’ అన్నట్లుగా  పరుగులు పెడుతున్నారు.ఉద్యమ నేత కుటుంబం రోజుకొక ఆరోపణతో అతలాకుతలం కావడం,పార్టీలో మనుగడలేదని భావించిన సిట్టింగ్‌ ఎంపీలు,ఎమ్మెల్యేలు గేట్లు తెరచిన కాంగ్రెస్‌ వైపు మళ్లటంతో పెను మార్పు మొదలైంది.అధికారంతో అంటకాగిన నాయకులు పోటీజి జంకి పారిపోవడం చూస్తుంటే  బీఆర్‌ఎస్‌ రాజకీయ మరణ క్రతువు ముగిసింది. పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా కవిత అరెస్టు కేసీఆర్‌ కుటుంబం ఒంటరి అయ్యింది.
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్నంతకాలం కేసీఆర్‌ కుటుంబం ప్రభుత్వ వ్యవహారాల్లో తనయుడు కేటీఆర్‌, అల్లుడు హరీశ్‌,తనయ కవిత  పెత్తనం చలాయించారు. తెలంగాణ వచ్చేదా? సచ్చేదా? అనే రీతిలో ఉద్యోగరీత్యా కేటీఆర్‌, కవిత అమెరికాలో స్థిరపడి, ఉర్రుతలూగుతున్న ఉద్యమ సమయంలో తెలంగాణకు వచ్చి నాన్నకు అండగా నిలిస్తే అందరు సంతోషపడ్డారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వ భవిష్యత్‌ ను తామే నిర్ణయిస్తున్నట్టుగా వ్యవహరించినా కేసీఆర్‌ కొరకు భరించారు. పదేండ్లలో వారి పొగరు బోతుతనం, మేధో అహంకారం కొట్టొచ్చినట్టు కన్పించేది. అదనుకోసం చూసిన  ప్రకృతి కూడా సహకరించక లేదు.అధికార మార్పిడి తప్పలేదు. లిక్కర్‌ స్కాం లో పీకల దాకా కూరుకుపోయిందని తెల్సి కవితను అసెంబ్లీ ఎన్నికల ముందు అరెస్టు చేయక పోవడం కేసీఆర్‌,బీజేపీ ఒక్కటనే భావం ప్రజల్లో తెచ్చింది.అందుకే అధికారం కోల్పోవాల్సి వచ్చింది. దాని ఫలితంగానే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధోగతి పాలయ్యింది.బీఆర్‌ఎస్‌ తో బీజేపీ కి అవగాహన లేదని తెలంగాణ ప్రజలను నమ్మడం కోసం లిక్కర్‌ కేసు తోడినట్టుగా ప్రచారం జరుగుతున్నది. కవితను అరెస్టు చేసి కటకటాలకు పంపడంతో ఉద్యమ స్ఫూర్తి పతనావస్థలో ఉరేగుతున్నది.ఎంపీ గా ఓడిపోయినా కేసీఆర్‌ తనయ కవితకు ఎమ్మెల్సీ ఇవ్వడం పాపమైంది.ఎవ్వడు తవ్వుకున్న బావిలో వాడే పడుతాడని కేసీఆర్‌ కు ఇప్పటికైనా అర్థం అయ్యిఉండాలి, అందుకే చరిత్ర పునరావృతమయ్యింది. ఎన్నికల ఘట్టం సమీపిస్తున్న కొద్దీ ఎవరి పాపాలను వారు త్రవ్వుకొనడం సహజం.గతంలో కేసీఆర్‌ నడిచిన దారిలోనే ఇప్పుడు రేవంత్‌ నడుస్తున్నా.. అసలు సినిమా ముందున్నదనే భావన అందరిలో ఏర్పడిరది.దీనికి తోడు ఓటుకు నోటు కేసులో కక్షగట్టి రేవంత్‌ రెడ్డిని జైలు పాలు చేసిన పాపాలు పండుతున్నాయి. రేవంత్‌ సర్కార్‌ క్షమించే అవకాశాలు ఏమాత్రం కనబడడం లేదు.ఇదే అదనుగా రేవంత్‌ కేసీఆర్‌ పై అప్రకటిత యుద్ధం ప్రకటించారంటే అతిశయోక్తికాదు.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సబ్బండ వర్ణాలు,పాతిక లక్షల సైన్యాన్ని వదిలి, రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొదటి దఫా 63 సీట్లు కట్టబెట్టినా, అధికారానికి ధోకా  లేకపోయినా ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా పునరేకీకరణ పేరుతో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలని, అక్రమ కలయికలను స్వాగతించారు.రెండవ సారి 88 సీట్లను ఇచ్చి అగ్రభాగాన నిల్పినా ఒక పార్టీ టికెట్‌ మీద గెలిచి,మరో పార్టీలో చేరడం సమంజసమేనని, పనికట్టుకొని కాంగ్రెస్‌ ఎల్పీని విలీనం చేసుకుని పెద్ద తప్పుచేసారు. తెలంగాణలో ఏ పార్టీ బతుకకూడదనే ఆయన ఉద్ద్యేశం.దశాబ్ద కాలంగా అగుపడని అధికారదాహన్నీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారనీ, కలలోనైనా ఊహించలేదు. చాపకింది నీరులా ప్రజలు మార్పుకోరుకున్న తర్వాత గౌరవించకుండా కాంగ్రెస్‌  ప్రభుత్వం బతికి బట్టకట్టదని, అస్థిరపర్చే కుట్రకు తెరలేపడంతో రేవంత్‌ రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వడం మొదలెట్టారు.కేసీఆర్‌ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలను ఎండగట్టడంతో పాటు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఇక పార్లమెంట్‌ ఎన్నికల్లో 100రోజుల పరిపాలనకు రెఫరెండంగా భావించాలని డిప్లమేటిక్‌ గా పిలుపునిచ్చారు.నియంతగా మారి ముష్టి మూడు వందల కోట్ల ప్రాజెక్టులో చంద్రబాబు లాంటి నేతను జైలులో పెట్టితే చంకలు గుద్దుకున్నారు. బాబు అభిమానులకు తెలంగాణలో నిరసన చెప్పడానికి కూడా అనుమతివ్వకుండా పైశాచిక ఆనందం పొందినారు. ఏ బిడ్డా ఇది కేసీఆర్‌ అడ్డా అన్న దురహంకార, రాక్షసానందం ఆరు నెలలు కూడా నిలువలేదు. ఆప్‌ ఉదంతం చూస్తుంటే కవితకు బెల్‌ వచ్చే పరిస్థితి కన్పించడం లేదు. దశాబ్దకాలంగా ఏకపక్ష రాజకీయ వ్యవస్థను నిర్మించి,రెండు పర్యాయయాలు సీఎంగా పనిచేసిన అపర చాణక్యుడు కేసీఆర్‌ జాతీయ పార్టీ పెట్టి రెంటన చెడిన రేవడిలా కాంగ్రెస్‌,బీజేపీ లకు ప్రధాన శత్రువుగా మిగిలినారు.ఇదొక అనివార్యమైన సహజ కష్టమన్నది తెలంగాణ ప్రజలకు అర్థమవుతున్న విషయమే.తానే తెలివైనవాడిననే అహంకారం ఎంతటి మేధావినైనా కాపాడలేదనడానికి కేసీఆర్‌ ఉదంతమే ఉదాహరణ.

-డా. సంగనిమల్లేశ్వర్‌
విభాగాధిపతి, జర్నలిజం శాఖ,
కాకతీయ విశ్వవిద్యాలయం,
వరంగల్‌,
సెల్‌ : 9866255355

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *