- మారుమూల జిల్లాకు సైతం మెడికల్ కాలేజీలు
- తి లక్ష జనాభాకు 19 ఎంబిబిఎస్ సీట్లు, 7 పీజీ సీట్లు
- ఈ ఏడాది 9 మెడికల్ కాలేజీలతో గణనీయంగా పెరుగనున్న సీట్ల సంఖ్య
- కేంద్రం ఒక్క కాలేజీ ఇవ్వకున్నా, సొంత నిధులతో స్వరాష్ట్రంలో 21 మెడికల్ కాలేజీలు
- కొత్తగా ఏర్పాటు చేయబోయే 9 మెడికల్ కాలేజీల పై మంత్రి హరీష్ రావు సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28 : ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశం రాష్ట్రంలో వైద్య విద్య విప్లవం దిశగా అడుగులు వేస్తున్నామని ఆర్థిక వైద్యారోగ్య మంత్రి హరీష్ రావు అన్నారు. మారుముల జిల్లాల్లో సైతం మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కి దక్కుతుందని చెప్పారు. మెడికల్ కాలేజీల వారీగా పనుల పురోగతిపై జూమ్ ద్వారా మంగళవారం మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జూలై నాటికి తరగతులు ప్రారంభించేందుకు సిద్ధం కావాలన్నారు. అవసరమైన అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు భర్తీ పక్రియ త్వరగా పూర్తి చేయాలన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల సహకారంతో స్థానికంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకుంటూ, మెడికల్ కాలేజీల్లో అకాడమిక్ ఇయర్ ప్రారంభించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ…2014కు ముందు రాష్ట్రంలో 5 మెడికల్ కాలేజీలు ఉంటే, ఈ ఏడాదితో ఆ సంఖ్య 26కు చేరబోతున్నట్లు చెప్పారు. 2014 లో ఎంబీబీఎస్ సీట్లు 850 ఉంటే ఇప్పుడు 2790 ఉన్నట్లు చెప్పారు. మూడు రెట్ల కంటే ఎక్కువ పెరిగిందన్నారు. ఈ ఏడాది 9 మెడికల్ కాలేజీలు వొస్తే ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్నారు. మెడికల్ సీట్ల విషయంలో దేశంలో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందని గుర్తు చేశారు. ప్రతి లక్ష జనాభాకు 19 ఎంబీబీస్ సీట్లు, 7 పీజీ సీట్లతో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటులో చూస్తే, 2014 నుంచి ఇప్పటి వరకు దేశంలో ఎంబీబీస్ సీట్ల సంఖ్య 71శాతం పెరిగితే, తెలంగాణలో 240 శాతం పెరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో గతేడాది ఒకేసారి 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించి రికార్డు కొట్టగా, ఈ ఏడాది జనగాం, వికారాబాద్, ఖమ్మం, కామారెడ్డి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నట్లు చెప్పారు. పనులు వేగంగా జరిగేందుకు సంబంధిత జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు చొరవ చూపాలన్నారు.
జిల్లా కలెక్టర్లు, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఇంజినీర్లు నిత్య సమీక్షలు చేసుకుంటూ పనులు చేయాలన్నారు. ఈ మెడికల్ కాలేజీలకు అవసరమైన ఫర్నీచర్, ఎక్విప్మెంట్ సరఫరా పనులను వేగవంతం చేయాలన్నారు. జూలై నుంచి తరగతులు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది కాబట్టి, విద్యార్థులకు అన్ని సదుపాయాలతో కూడిన హాస్టల్స్ వసతి విద్యార్థులు, విద్యార్థినులకు వేర్వేరుగా ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమంత్రి గొప్ప ఆలోచనతో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారని, ఈ ఏడాది 9 మెడికల్ కాలేజీలు తరగతులు ప్రారంభించే లక్ష్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా అన్ని చర్యలు పూర్తి అయ్యేలా కృషి చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు.
కేంద్ర ప్రభుత్వం 157 మెడికల్ కాలేజీలు ఇస్తే, తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకుండా వివక్ష చూపిందని, తెలంగాణ ప్రజలకు వైద్యంతో పాటు, వైద్య విద్యను చేరువ చేసేందుకు సొంత నిధులతో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ మీద ప్రేమ, తెలంగాణ అభివృద్ధి మీద ఆకాంక్ష ఉంది కాబట్టి, సీఎం కేసీఆర్ చేసి చూపిస్తున్నట్లు చెప్పారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, ఒక నర్సింగ్ కాలేజీ విధానం ప్రకటించి దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచింది అన్నారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో తెలంగాణ రాష్ట్రం మెడికల్ కాలేజీలకు, వైద్య విద్యకు హబ్ గా మారుతున్నదన్నారు. కేంద్ర వివక్ష చూపితే సీఎం కేసీఆర్ మాత్రం రాష్ట్రంలో వైద్య విద్య విప్లవానికి నాంది పలికారన్నారు.ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు సత్యవతి రాథోడ్, అజయ్ కుమార్, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, హెల్త్ సెక్రెటరీ రిజ్వి, తొమ్మిది జిల్లాల కలెక్టర్లు, స్థానిక ఎమ్మెల్యేలు, వైద్యాధికారులు, టి ఎస్ ఎం ఎస్ ఐ డి సి ఇంజినీర్లు పాల్గొన్నారు.