నమ్మిన సిద్ధాంతం కోసం చావుకైనా వెనుకాడం
గొల్లకొండ కోటపై కాషాయ జెండా ఎగిరే రోజు దగ్గర్లో ఉంది
టీఆర్‌ఎస్‌ను గద్దె దింపడానికి ఆఖరి పోరాటానికి కార్యకర్తలు సిద్ధం కావాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
బీజేపీ కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం
ప్రజాతంత్ర , హైదరాబాద్ : తెలంగాణలో టీఆర్‌ఎస్ అవినీతి, అరాచక, కుటుంబ పాలనను అంతమొందిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇదే ఆఖరి పోరాటమనీ, గడపగడపకూ వెళ్లి టీఆర్‌ఎస్ అరాచకాలపై ప్రచారం చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ బీజేపీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ అనీ, నమ్మిన సిద్ధాంతం కోసం చావుకైనా వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. కేవలం రెండు సీట్ల నుంచి దేశాన్ని స్థిరంగా పాలించే స్థాయికి బీజేపీ ఎదిగిందనీ, అయితే, ఏనాడూ అధికారం కోసం పాకులాడలేదని చెప్పారు. ఒకే ఒక్క ఎంపీని తమ వైపు తిప్పుకుంటే వాజ్‌పేయి హయాంలో ప్రభుత్వం నిలబడి ఉండేదనీ, కానీ, సిద్ధాంతం కోసం కట్టుబడి కేవలం 13 రోజులకే అధికారాన్ని కోల్పోయాలని గుర్తు చేశారు.
కేసీఆర్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారనీ, వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకు రావడానికి ఇప్పటికే నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. కార్యకర్తల త్యాగాలతో ప్రజల ఆశీస్సులతో తెలంగాణలో వచ్చే ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమనీ, గొల్లకొండ కోటపై కాషాయ జెండా ఎగరవేసి తీరతామని స్పష్టం చేశారు. కరెంటు, ఆర్టీసీ చార్జీలు పెంచిన కేసీఆర్ ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ల పేరుతో ప్రజలను మరోమారు యువకులు, నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పేదల కోసం రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్నదే బీజేపీ లక్ష్యమనీ, కార్యకర్తల బలిదానాలు, త్యాగాల ఫలితంగా తెలంగాణలో బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం అనే అభిప్రాయం ప్రజలలో నెలకొందని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంపైకి సెంటిమెంట్ పేరుతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు సాగబోవని ఈసందర్భంగా బండి సంజయ్ స్పష్టం చేశారు.