తిరుమల, మార్చి 14 : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 5 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగు తుందని టీటీడీ అధికారులు తెలిపారు. సోమవారం స్వామివారిని 68,365 మంది భక్తులు దర్శించుకోగా 27,818 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 5.65 కోట్లు వచ్చిందని తెలిపారు.
తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులవారి 520వ వర్ధంతిని మార్చి 18న సాయంత్రం తిరుమలలో ఘనంగా జరుపనున్నారు. ఇందులో భాగంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఊరేగింపుగా శ్రీవారి ఆలయం నుంచి బయలు దేరి సాయంత్రం 6 గంటలకు నారాయణగిరి ఉద్యానవనాలకు వేంచేపు చేస్తారని తెలిపారు. అనంతరం ప్రముఖ కళాకారులతో ద్వాదశి సంకీర్తనలు, సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానం నిర్వహిస్తారని వివరించారు.