డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు
జలవిహార్ వద్ద ర్యాలీని ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 25: రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరి స్తోందని తెలంగాణ డిప్యూ టీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ విషయంపై ఏ స్థాయిలో అయినా నిర్ణయాలు తీసుకునేం దుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులో జలవిహార్ వద్ద డ్రగ్స్ నిర్మూలన ర్యాలీని ఆయన ప్రారంభిం చారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు.
డ్రగ్స్ వినియోగం విషప్రయోగం లాంటిది.. ఇది అత్యంత ప్రమాదకరం. కుటుంబ వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తుందని అన్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న సంఘ విద్రోహశక్తుల చేతిలో యువత జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. తెలిసీ తెలియని వయసులో వాటి బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరు కావాలనే తమ అక్రమ సంపాదన కోసం యువతకు డ్రగ్స్ అంటగడుతున్నారు.
దేశాన్ని బలహీనపరిచేందుకు దేశద్రోహులు చేస్తున్న ప్రయత్నంగానూ దీన్ని చూడొచ్చని అన్నారు. రాష్టాన్న్రి కాపాడుకునే బాధ్యత మనపైనే ఉంది. డ్రగ్స్ నిర్మూలనకు నార్కోటిక్ బ్యూరోకు ఎంత బడ్జెట్ అయినా కేటాయిస్తాం. వాటి వినియోగం, రవాణా లేకుండా చేయాల్సిన బాధ్యత ఆ అధికారులదే. పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగమే కాకుండా ప్రజల నుంచి కూడా సహకారం అందాలి. డ్రగ్స్ సరఫరా చేసేవారు ఎక్కడున్నా అరెస్ట్ చేసే శక్తి సామర్థ్యాలు పోలీసు వ్యవస్థకు ఉన్నాయి.
పోలీసులకు సమాచారం ఇచ్చే వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని సూచించారు. అన్ని గ్రామాల్లో డ్రగ్స్ నిర్మూలన కమిటీలు వేయాలి. కొత్త వ్యక్తులపై ఎల్లప్పుడూ నిఘా ఉంచాలి. తాత్కాలిక సంతోషాలకు విద్యార్థులు బలి కావొద్దు. వారు అడ్డదారులు తొక్కితే కుటుంబంతో పాటు సమాజం మొత్తం బాధపడాల్సి ఉంటుందని భట్టి విక్రమార్క అన్నారు. కార్యక్రమంలో సిఎస్ శాంతికుమారి, పలువురు పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.