డియర్ ప్రజాస్వామ్యమా
మాట్లాడుతున్నాం మేము
నీ పీకపై కాలుపెట్టి
అరుస్తున్నాం మేము
నిన్ను తాకట్టు పెట్టి
పుట్టుకతో కొందరం బానిసలం
పుట్టాక మరి కొందరం
మా తల్లుల పురిటి నొప్పుల్లో
లోపం లేదు
మా మకిలీ బుద్ధుల్లో
మమ్మల్ని పురిగొల్పే
కంతిరి రాజ్యకాంక్షీయుల
తుప్పు అలోచనల్లో
‘మా’ ‘మేము’ ‘మాది’
‘మనది’ అన్న
స్పృహ కూడా కోల్పోయేంత
కోల్పోయాం
మా నీడలను తగలబెట్టారు వాళ్ళు
మా అంతరాత్మలను ఖూనీ చేశారు
మాలో కార్చిచ్చులు రేపి
ముక్కలుగా తెగనరికారు
ఆశకు అవసరానికి
అక్రమ సంబంధం పెట్టి
డబ్బుకు అధికారానికి కృత్రిమంగా
బహు గడ్డు జాతిని
ఉత్పత్తి చేస్తున్నారు
ఇకనైనా మేం తిరగబడకపోతే
మా జన్మనే ఒక శాపం
మా బతుకే ఒక పాపం
రాబోయే మా తమ్ముళ్ళను
చెల్లెళ్ళను
ఇంకా అగాధంలోకి నెట్టేస్తాం కదా
ఇక చాలు! మా గుంజుకున్న
మొఖాలను మాకప్పజెప్పండి
మత్తుజల్లి నిద్రపుచ్చుతున్న
మా దేహాలను మాకివ్వండి
అవి తిరగబడి
మిమ్మల్ని తొక్కెయ్యకముందే
వాటిని మర్యాదగ పంపండి
వాటితో సరికొత్త
అధ్యాయం లిఖించాలి
ఓ ప్రియమైన ప్రజాస్వామ్యమా…
ఇప్పుడు మాట్లాడుతాం మేము
గర్వంగా నిన్ను
మా భుజాలపై మోస్తూ
కూడగట్టుకొని అరుస్తాం మేము
నీ గొంతును ఖడ్గంగా మారుస్తూ
ధరిస్తాం ఎరుపు వర్ణపు వస్త్రాన్ని
గుండెల్లో పిడికిట్లో
ధైర్యం నింపుకోడానికి
మూల ములాల్లో ఉన్న
బానిసత్వాన్ని
సమూలంగా పారద్రోలడానికి
వినూత్న సూర్యుల్ని వెలికి
తీయడానికి..!!
-రవీర్