- అంతా తానే అనుకునే కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలి
- నిరుద్యోగుల గోస రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్
- బాధ్యతారాహిత్య పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు
పాల్గొన్న బిఎస్‌పి నేత ఆర్‌ఎస్ ప్రవీణ్, టిజెఎస్ అధ్యక్షుడు ప్రొ।। కోదండరామ్, ప్రొ।। హరగోపాల్ తదితరులు
ఖైరతాబాద్, ప్రజాతంత్ర, మార్చి 21 : రాష్ట్రంలో ఇటీవల జరిగిన టీఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ పెద్ద కుంభకోణమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. సిట్ కేవలం ప్రభుత్వం చెప్పేది వింటుందని, అందుకే పేపర్ లీక్ కేసును సిట్‌తో కాకుండా సీబీఐచే దర్యాప్తు చేయాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ‘టీఎస్‌పిఎస్‌సి పేపర్ల లీకేజీ-ప్రభుత్వ వైఫల్యం-నిరుద్యోగుల గోస’ అనే అంశంపై మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో యువజన సమితి(వైజెఎస్), విద్యార్థి జనసమితి(విజెఎస్) ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం యువజన సమితి రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సలీం పాషా అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పాల్గొని మాట్లాడుతూ…ప్రశ్నించే ఛానళ్లను సైతం బ్యాన్ చేస్తామని బీఆర్‌ఎస్ మంత్రులు బెదిరిస్తున్నారని, ఇలాంటి సమస్యలన్నింటిపై కలిసి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.
ప్రతి ఒక్కరూ ప్రత్యేక కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పోరాడాలని ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌కు వేల కోట్ల రూపాయలు ఉన్నాయని, ప్రత్యేక విమానాల్లో వెళ్లి కవితను కాపాడే దమ్ము వారికి ఉందని ఆరోపించారు. తెలంగాణ కొందిరి చేతుల్లో పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ…నీళ్లు, నిధులు నియామకాలు అనే నినాదంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గద్దెనెక్కిన కేసీఆర్ నీళ్ళ విషయంలో కమీషన్ల కోసం కాలేశ్వరాన్ని ముంచారని, నిధులను సొంత ఆస్తుల కోసం అప్పుల పాలు చేశారన్నారు. ఇక నియామకాల విషయంలో పైసల కోసం పేపర్లు అమ్ముకున్నారని ఆరోపించారు. ఏది సక్రమంగా చేయకుండా ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. నాడు నేరెళ్ల బాధితులతో వ్యవహరించినట్లుగానే నేడు పేపర్ లీకేజీ బాధితులను చూస్తుందని మండిపడ్డారు.
ప్రభుత్వ బాధ్యతారహిత్యమైన పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని కోదండరామ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. త్వరలోనే అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపి ఐక్య పోరాటాలకు కార్యచరణ రూపొందిస్తామన్నారు. టిఎస్‌పిఎస్‌సి చైర్మన్ దగ్గర ఉండే కంప్యూటర్ పాస్‌వర్డ్‌లు ఇతరులకు ఎలా లీక్ అయితాయని ఆయన ప్రశ్నించారు. అనుమానం ఉందని ప్రశ్నించిన రేవంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తున్నామని, వెంటనే వాపస్ తీసుకోవాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం సిబిఐచే ఎంక్వయిరీ చేయిస్తే లీకేజి వ్యవహారంలో తమ అందరి దగ్గర ఉన్న సమాచారం అందజేస్తామని అన్నారు. ఈ ఘటనకు సీఎం కేసీఆర్ నైతిక బాధ్యత వహించి అభ్యర్థులకు నష్టపరిహారం అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. బలమైన హస్తం లేనిదే జరుగదని, వెంటనే టీఎస్పిఎస్సి చైర్మన్, సెక్రటరీ రాజీనామా చేయాలన్నారు. టిఎస్‌పిఎస్‌సి పనితీరుపై సిట్టింగ్ హైకోర్టు జడ్జిచే విచారణ జరిపించి, జరిగిన లోపాలన్నింటినీ వెలుగులోకి తేవాలన్నారు.
ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన కేసీఆర్ తెలంగాణ మోడల్ అంటూ 30 లక్షల విద్యార్థుల జీవితాలకు సంబంధించిన విషయంపై నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్నారు. చరిత్రలో లాల్ బహదూర్ శాస్త్రి, ఎన్ జనార్ధన్ లాంటి వాళ్లు తమ పదవులకు రాజీనామా చేసిన కొన్ని సంఘటనలను హరగోపాల్ ఈ సందర్భంగా ఉదహరించారు. రాష్ట్రంలో మంత్రులకు ఐఏఎస్‌లకు తావివ్వకుండా అన్ని తానే అయి సీఎం వ్యవహరిస్తున్నారని అన్నారు. మంచి జరిగితే తమకు…వైఫల్యం జరిగితే ఇతరులకు సీఎం కేసీఆర్ ఆపాదిస్తారని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రశేర్ రావు తానొక్కడే తెలంగాణ రాష్ట్రం తెచ్చానని అనడం చరిత్ర అర్థం కాకపోవడం, చరిత్రను అంచనా వేయడం తెలియకపోవడం, చరిత్రలో ఆయన స్థానం ఏంటో తెలుసుకోకపోవడం తెలంగాణ విషాదం అన్నారు.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి మాట్లాడుతూ…ఇలాంటి పేపర్ లీకేజీలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లు రవి మాట్లాడుతూ…తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం గాడి తప్పిందని అన్నారు. రాష్ట్రంలో ప్రజలందరికీ బంగారు భవిష్యత్తు ఇస్తామన్న కెసిఆర్ నేడు విద్యార్థులకు భవిష్యత్తు లేకుండా చేశాడని అన్నారు. రాజకీయ పునరేకీకరణ జరగాలని, ప్రభుత్వాన్ని గాడిలో పెట్టే బాధ్యత మేధావులు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నా సీఎం కేసీఆర్‌కు చలనం లేదన్నారు. ఈ సమావేశంలో టిజెఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ పిఎల్.విశ్వేశ్వరరావు, యువజన సమితి, విద్యార్థి జనసమితి నేతలు పెద్దెత్తున పాల్గొన్నారు.