Take a fresh look at your lifestyle.

టిఎస్‌పిఎస్సీ పైపర్‌ ‌లీకేజీలో కీలక అంశాలపై ఆధారాల సేకరణ

  • 40 లక్షలకు ఎఈ పేపర్‌ అమ్మకానికి పెట్టిన రాజేశ్వర్‌
  • కమిషన్‌లో నిఘా కొరవడినట్లు సిట్‌ ‌గుర్తింపు
  • విచారణలో కీలకంగా మారనున్న చైర్మన్‌ ‌జనార్ధన్‌ ‌రెడ్డి ఇవ్వనున్న సమాచారం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 3 : ‌టీఎస్‌పీఎస్సీ నిందితుల విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వొస్తున్నాయి. ఏఈ పేపర్‌ ‌లీక్‌లో కేతావత్‌ ‌రాజేశ్వర్‌ ‌కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తుంది. మూడు ఏఈ పేపర్లను రూ. 40 లక్షలకు రాజేశ్వర్‌ అమ్మినట్లు సమాచారం. రూ. 25 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్న తర్వాత మిగతా డబ్బులు..పరీక్ష ఫలితాలు వొచ్చిన తర్వాత ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. రాజేశ్వర్‌ ‌దగ్గర నుంచి పోలీసులు రూ.8.5 లక్షలు రికవరీ చేశారు. ఇక రేణుకకి పేపర్‌ ‌లీక్‌ ‌చేసిన ప్రవీణ్‌.. ‌నమ్మకమైన వారికే అమ్మాలని సూచించాడు. రూ.10 లక్షలకు రేణుకతో బేరం చేసుకున్నాక..అడ్వాన్స్‌గా రూ.5 లక్షలు ప్రవీణ్‌ ‌తీసుకున్నాడు.

ఈ విషయాన్ని సవి•ప బంధువు రాజేశ్వర్‌కి రేణుక భర్త డాఖ్యా నాయక్‌ ‌చెప్పాడు. దీంతో మధ్యవర్తులు గోపాల్‌, ‌నీలేష్‌, ‌ప్రశాంత్‌, ‌రాజేంద్ర కుమార్‌లకు రూ.40 లక్షలకు విక్రయించిన రాజేశ్వర్‌.. అడ్వాన్స్‌గా తీసుకున్న రూ.23 లక్షల్లో రూ.10 లక్షలు డాఖ్యా నాయక్‌కు ఇచ్చినట్లు తెలిసింది. కాగా, టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం మొత్తం ఆ కార్యాలయంలోని కాన్ఫిడెన్షియల్‌ ‌సెక్షన్‌ ‌చుట్టూనే తిరుగుతుంది. అత్యంత విశ్వసనీయంగా ఉండాల్సిన ఆ సెక్షన్‌లో నిఘా వైఫల్యం ఉన్నట్లు వెల్లడి కావడంతో.. సిట్‌ అధికారులు ప్రస్తుతం అదే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కాన్ఫిడెన్షియల్‌ ‌సెక్షన్‌ ఆఫీసర్‌ ‌శంకరలక్ష్మిని 10 దఫాలుగా సుమారు 20 గంటలు విచారించారు. ప్రశ్నపత్రాల భద్రత, యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ను నిందితుడు ప్రవీణ్‌ ఎలా తెలుసుకున్నాడు..అనే విషయాలపై వివరాలు సేకరించారు.

ఆ తర్వాత టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్‌ను విచారించారు. వారి నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. కాన్ఫిడెన్షియల్‌ ‌సెక్షన్‌ ‌భద్రత, పర్యవేక్షణలో చైర్మన్‌, ‌సెక్రటరీ, సెక్షన్‌ ఆఫీసర్‌ ‌మధ్య పూర్తిగా సమన్వయ లోపం ఉన్నట్లు సిట్‌ అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తుంది. అదే అవకాశంగా భావించిన సెక్రటరీ పీఏ ప్రవీణ్‌, ‌నెట్‌వర్క్ అడ్మిన్‌ ‌రాజశేఖర్‌రెడ్డి ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాన్ఫిడెన్షియల్‌ ‌సెక్షన్‌పై పూర్తి బాధ్యత, అత్యున్నత అధికారాలు ఉన్న చైర్మన్‌ ‌జనార్దన్‌రెడ్డి నుంచి ఇందుకు సంబంధించి వివరణ కోరడానికి సిట్‌ ‌సిద్ధమైంది. ఆయన వెల్లడించే సమాచారం కీలకంగా మారనుంది. మొత్తం విచారణను పూర్తి చేసి రిపోర్టును సీల్డ్ ‌కవర్‌లో ఈ నెల 11 వరకు న్యాయస్థానానికి అందజేయాల్సి ఉండటంతో సిట్‌ అధికారులు దూకుడు పెంచారు.

Leave a Reply