- హన్మకొండ వేదికగా కాంగ్రెస్ సమర శంఖం
- పార్టీలో విభేదాలు తాత్కాలికమే
- కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబు
- పని తక్కువ ప్రచారం ఎక్కువ : కెసిఆర్ తీరుపై మండిపడ్డ ఎంఎల్‌ఏ జగ్గారెడ్డి
హైదరాబాద్,ప్రజాతంత్ర, మే 3 : తెలంగాణ సమాజానికి తెరాస ప్రమాదకరంగా మారిందని, ఈ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన సమయం వొచ్చిందని కాంగ్రెస సీనియన్ నేత శ్రీధర్ బాబు అన్నారు. వరంగల్ రైతు సంఘర్షణ సభ ద్వారా అన్నదాతలకు కాంగ్రెస్ ఏమి చేయబోతుందో చెప్పడంతో పాటు వ్యవసాయ విధానాన్ని ప్రకటిస్తారని ఆయన వెల్లడించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రాహుల్ వెళ్లి తీరతారని స్పష్టం చేశారు. ఎప్పుడు ఎన్నికలు వొచ్చినా…బరిలో దిగేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ ఏర్పాటు వల్ల బాగుపడ్డది ఒక్క కెసిఆర్ కుటుంబమే అని ప్రజలకు కూడా తెలిసిపోయిందని అన్నారు. రైతుల్ని ఆత్మగౌరవంతో బతికేలా చేయాల్సిన ప్రభుత్వం దాన్ని విస్మరించి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులను కల్పిస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో 70 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధార పడ్డారు. అది ప్రమాదం అంచున ఉంది. వ్యవసాయాన్ని కాపాడుకోవడం ద్వారా తెలంగాణ సమాజాన్ని కాపాడాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. రైతు ఆత్మగౌరవంతో బతికేందుకు కావాల్సిన అన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటామన్నారు. రుణమాఫీ, గిట్టుబాటు ధర, పంటలకు బీమాపై టిఆర్‌ఎస్ అసత్య ప్రచారాలతో కాలం గడుపుతుందని అన్నారు. పంటకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తే రైతులు ఆత్మగౌరవంతో బతుకుతారని,కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని విస్మరించాయని అన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలంతా కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వారి సమస్యలను కాంగ్రెస్ మాత్రమే పరిష్కరిస్తుందిన అన్నారు. తెరాస ప్రభుత్వ నిర్లక్ష్యానికి వేలమంది రైతులు, విద్యార్థులు బలయ్యారని అన్నారు. తెరాస, భాజపా మధ్య అవగాహన ఉందని శ్రీధర్ బాబు అన్నారు. దీనిని కూడా నిలదీస్తామని అన్నారు.
పని తక్కువ ప్రచారం ఎక్కువ : కెసిఆర్ తీరుపై మండిపడ్డ ఎంఎల్‌ఏ జగ్గారెడ్డి
గతంలో మేము ఉచిత విద్యుత్ ఇచ్చి రూపాయి ప్రచారం చేసుకున్నాం. కానీ కేసీఆర్ ఇచ్చే విద్యుత్‌కి అయ్యేంత ఖర్చు పబ్లిసిటీకి పెడుతున్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. లక్ష రూపాయలు మాఫీ మేము చేశాం? కేసీఆర్ చేయకపోయినా చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. పది పైసల పనికి వంద రూపాయల ప్రచారం సాగుతుందని, టీఆర్‌ఎస్ ది గ్రాఫిక్స్ పాలన అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. కెసిఆర్ పాలన రజినీకాంత్ స్టైల్‌లో ఉందన్నారు.
హన్మకొండ సభ ద్వారా రుణమాఫీ ఏమైందని అడుగుతారు. గిట్టు బాటు ధర ఏది అని అడుగుతారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కోసమే రాహుల్ వొస్తున్నారు. ఉస్మానియా యూనివర్శిటీ పర్యటన సహా వరుసగా మూడు రోజుల కార్యాచరణ ఉంటుందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. రైతులను ముంచడంలో కేసీఆర్.. మోడి అన్నదమ్ములుగా పోటీపడుతున్నారని జగ్గారెడ్డి దుయ్యబట్టారు. ఈ నెల 6న జరిగే రైతు సంఘర్షణ సభకు రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. వరంగల్ సభలో రైతు సమస్యలు, కాంగ్రెస్ ప్రభుత్వం వొచ్చాక చేసే అభివృద్ధి పథకాలపై రాహుల్ గాంధీ మాట్లాడుతారన్నారు. రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులపై ప్రభుత్వాన్ని రాహుల్ నిలదిస్తారని అన్నారు. ధరణి సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. అసైన్డ్ భూములను రైతుల దగ్గర నుండి ప్రభుత్వం లాక్కుందని ఆరోపించారు. స్వతంత్ర సమరయోధులు, ఎక్స్ సర్వీస్ మెన్‌లకు ఇచ్చిన భూములను కూడా రాష్ట్ర ప్రభుత్వం లాక్కుంటోందన్నారు. నెహ్రూ కాలం నుండి కాంగ్రెస్ పార్టీ రైతులకు పెద్దపీట వేస్తూ వొస్తుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ దేశానికి ఏం చేసిందనేవారు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని హితవుపలికారు. ఉచిత విద్యుత్ పథకం ప్రవేశపెట్టినదే కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొచ్చారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని అన్నారు.
ఒకేసారి లక్ష రూపాయల రుణమాఫీ అని ఎన్నికల హావి• ఇచ్చి నేటికి రుణమాఫీ చేయని దద్దమ్మ ప్రభుత్వం టీఆర్‌ఎస్ అని విరుచుకుపడ్డారు. టీఆర్‌ఎస్ పాలన మొత్తం గ్రాఫిక్స్ మయమన్నారు. అభివృద్ధి తక్కువ, ప్రచారం ఎక్కువ చేసుకునే ప్రభుత్వం టీఆర్‌ఎస్ ప్రభుత్వమని మండిపడ్డారు. రైతులకు న్యాయం జరగాలంటే కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ నోరు తెరిస్తే ఫ్రీ కరెంట్, రైతు సంక్షేమం అంటూ డబ్బా కొట్టుకుంటున్నారని… అసలు కేసీఆర్ వొచ్చాకే కరెంట్ పుట్టినట్లు, రైతులు వ్యవసాయం చేసినట్లు టీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రాహుల్ పర్యటనను అడ్డుకోవడానికి కేసీఆర్ అడ్డంకులు సృష్టిస్తున్నారని, ఎవరెన్ని కుట్రలు పన్నినా రాహుల్ ఓయూ పర్యటన, వరంగల్ సభను విజయవంతంగా నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాల్సిని అవసరం ఉందని చెప్పారు.