Take a fresh look at your lifestyle.

చారిత్రక మహా పురుషుడు… శ్రీరామ చంద్రుడు

భారతావని ప్రసవించిన మహా పురుషులలో అవతార పురుషుడు శ్రీరామచంద్రుడు అత్యంత ప్రాచీన చారిత్రక పురుష నాయకుడు. శ్రీరామచంద్రుని చారిత్రక పురుషు నిగా పాశ్చాత్య పరిశోధకులు కూడా నిర్ధారించారు. భారతీయ కాలమాన ప్రకారం రాముడు జన్మించినది వైవస్వత మన్వంతరమున పంచమ త్రేతాయుగ నాలుగవ భాగ మున ఎనభై వేల సంవత్సరానికి సరియగు విళంబి సంవత్సర చైత్ర శుద్ధ నవమి బుధవారం అని శ్రీమాన్‌ ‌కోయిల్‌ ‌కందాడై వెంకట సుందరాచార్య స్వామి వచించారు. పురాణాల ఆధారంగా మహాభారత యుద్ధం నాటికి శ్రీరాముడు అతి ప్రాచీనుడు. మను చక్రవర్తి వంశావళిలో రాముడు 65వ పురుషుడని, ఆయన వంశస్తుడు శ్రీకృష్ణునికి సమకాలికుడైన బృహద్బలుడు మను వంశమున 94వ వాడని సుప్రసిద్ధ పాశ్చాత్య చారిత్రిక పరిశోధకుడు పరిటేరు నిర్ణయించాడు. వాల్మీకి రామాయణమును అనుసరించి రాముని జనన కాలం క్రీ.పూ.2055వ సంవత్సరంగా ఎల్‌.‌డి.స్వామికన్ను పిళ్ళె నిర్ధారించగా, ఎం.ఆర్‌. ‌సంపత్కు మార సమర్ధించారు. పాశ్చాత్య చరిత్రకారులైన డబ్ల్యు.డబ్ల్యు.హంటర్‌, ‌కానింగ్‌ ఆర్నాల్డ్ ‌వంటి వారు, రామాయణ చరిత్ర క్రీ.పూ.1000 సంవత్సరాల ప్రాంత మని పేర్కొన్నారు.
ప్రాచీన రుగ్వేద మంత్రమున (ం.93.14) శ్రీరామ పవిత్ర నామం స్మరించ బడింది. మహా విష్ణువు ఎత్తిన 10 అవతారాలలో ఏడవది రామావ తారం. శ్రీరాముడు కోసలాధీశుడైన దశరథునికి, కౌసల్య గర్భమున చైత్ర శుద్ధ నవమి పునర్వసు 4వ పాదమున కర్కాటక లగ్నంలో మద్యాహ్న సమయాన జన్మించాడు. అందుకే చైత్ర శుద్ధ నవమి శ్రీరామ జయంతి దినమైంది. ఇది వసంత నవరాత్రులకు చివరిదినం. రాముడు పుట్టి నది నవమికాగా, అంతకు ముందు అనగా రాముడు గర్భంలో ఉన్న చివరి తొమ్మిది దినాలు చేసే మత విధులు, పూజాదికాలు గర్భ నవరాత్రులుగా ఆరాధ నీయం, ఆచరణీయంగా ఉన్నాయి. ఆగస్త్య సంహితలో అష్టమి గురుపూజ, నవమి ప్రతిమా కల్పన, దశమి ప్రతిమా దానంగా మూడునాళ్ళ పండగగా చెప్పబడింది. నవమి ఉపవాసం, రాత్రి పురాణ శ్రవణం, జాగరణ, మరు నాడు సంతర్పణ చేయాలని ఉంది. పునర్వసు నక్షత్ర యుక్త నవమి పుణ్యకాలమని భావిస్తారు. అష్టమితో కూడిన నవమిని రామపూజ కూడదని విష్ణుభక్తులకు అగస్త్య సంహిత సూచిస్తున్నది.
అందుకే మిగులు నవమి నాడు వైష్ణవులు రామ జయంతిని జరపడం పాటిస్తారు. శ్రీరామ నవమి నాటి కార్యకలాపాలు మద్యాహ్నం 12గంటలకు చేయాలని వ్రత గ్రంథాలు సూచిస్తున్నాయి. రామ జననం, కల్యాణం జరిపే రామ నవమి కాకుండా రామ సంబంధ పండగలలో ఒకటి రామలక్ష్మణ ద్వాదశిగా జరుపుకునే జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి, రెండవది జానకీ జయం తిగా జరుపుకునే ఫాల్గుణ శుద్ధ అష్టమి. జనకునికి యజ్ఞ శాలకై భూమిని దున్నతుండగా నాగటి చాలుకు తగిలిన బంగారు పెట్టెలో భూజాత దొరికినది ఫాల్గుణ శుక్ల అష్ట మిగా భావిస్తారు. శ్రీకృష్ణునిలా కాక, రాముని జన్మదినో త్సవం కన్నా కళ్యాణోత్సవానికి విశిష్టత ఉంది. రామ జన్మకు కారణమైన రావణవధ ద్వారా లోకకళ్యాణం. సీతాదే వితో కూడిన రాముని వల్లే లోక కళ్యాణం సాధ్యమైంది. రాముని ఆంధ్రుల దౌహిత్రునిగా భావిస్తారు. కోసలాదేశ రాజు కూతురు కౌసల్య. దక్షిణ కోసల అంటే పూర్వాంధ్ర దేశ ఉత్తర భాగం. కౌసల్య ఆంధ్రుల ఆడపడచు అనీ, వన వాసాన్ని రాముడు తల్లి పుట్టింటి దేశపుటడవులలో గడిపా రని వాదం ఉంది. వనవాస రాఘవునికి ఆతిథ్యమిచ్చిన తెలుగు నేలపై ఆయన జన్మదినమైన శ్రీరామనవమి, కళ్యాణ దినంగా ఘనంగా జరుపుకోవడం సనాతన సాంప్రదాయంగా వస్తున్నది.
శ్రీరాముని జన్మసమయం గురించి పరిశోధన చేసేందుకు పుష్కర్‌ ‌భట్నాగర్‌, అమెరికా నుంచి ‘ప్లానెటోరియం’ అనే సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసి,  ఈ సాఫ్ట్‌వేర్‌ ‌సాయంతో ఏ రోజున గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు. శ్రీరాముడు పుట్టిన సమయంలో గ్రహాల స్థితి  వాల్మీకి బాలకాండలో వర్ణించారు. ఈ సమాచారాన్నంతా సాఫ్ట్‌వేర్‌ ‌సాయంతో క్రోడీకరించిన పుష్కర్‌ ‌భట్నాగర్‌కు సదరు జన్మ సంవత్సరం తేలింది.  చాంద్రమానం ప్రకారం ఆ రోజు చైత్రశుద్ధ నవమి అని తేలడంతో, ఆయన వాదనకు బలం చేకూరి, రామాయణంలో ఉట్టంకించిన గ్రహస్థితులను బట్టి… రాములవారు అరణ్యావాసం చేసిన సమయం (5089 బి.సి), హనుమంతుడు సీతను లంకలో కలుసుకున్న సంవత్సరం (5076 బి.సి) తదితర కాలాలను కూడా నిర్ణయించామన్నారు భట్నాగర్‌.
‌పురాణాలను, జ్యోతిష్యాన్ని, ఖగోళ శాస్త్రాలను అనుసంధాన పరుస్తూ, కొందరు పరిశోధన చేసి, శ్రీరాముడు పుట్టింది క్రీ.పూ 5114 సంవత్సరం, జనవరి 10 మధ్యాహ్నం 12:05 గంటలు అని తేల్చారు. ఏది ఏమైనా, వాస్తవాలు ఏవైనా, శ్రీరామ చంద్రుడు చారిత్రక పురుషునిగా భావించబడుతూ, పితృ వాక్య ఆచరణాసక్తునిగా,  ఆదర్శ చక్రవర్తిగా, రామరాజ్య స్థాపకునిగా, ప్రజారంజక పాలకునిగా, ఈ నాటికీ పూజింప  బడుతుండడం, ఆ మహా పురుషుని నవరాత్రులు, జన్మ, కళ్యాణోత్సవాలు, ఈ నాటికీ నిర్వహించ బడుతుండడం  విశేషం.

– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

Leave a Reply