‘‘ఏప్రిల్ 14 చరిత్రపుటల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని ప్రజల గుండెల్లో నిలిచిపోయిన, నిలిచిపోతున్న రోజు. ఇద్దరి ఆశయాలు సమాజంలోని సమానత కోసమే, అంతరాలు లేని మానవీయ సమాజం కోసమే, ఇద్దరూ ప్రపంచ స్థాయి మేధావులే. ప్రజల బాగోగుల కోసం, సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచించిన ఆలోచన పరులే. సమాజ హితం కోసం అడుగు అడుగున పోరాడిన వీర యోధులే.. ప్రతి సంవత్సరం ఈరోజు నాకు ఒక సంఘర్షణను రేపుతోంది. ఒక సామాజిక విప్లవకారునీ జననం, మరొక విప్లవకారుడు నేలకొరిగిన రోజు. ఒకరిదిపుట్టుక, ఒకరిది చావు… ఇద్దరినీ ఒకే రోజు స్మరించుకోవడం సంఘర్షణ కాదా? సమీకరించు, బోధించు ,పోరాడు అన్న నినాదంతో చైతన్యం కోసం పాటుపడిన వారు ఒకరు,జీనా హైతో మర్ నా సీఖో కదం కదం పర్ లడ్నా సీఖో అనే నినాదం ఇచ్చి విప్లవ ఆదర్శాలను అందించిన సాహసోపేతమైన శక్తి ఒకరు…’’
ఒక ధ్రువతార వికసించిన రోజు, ఒక అరుణతార రాలిపోయిన రోజు..
భారతదేశ చరిత్రలో ఏప్రిల్ 14 ఒక మైలు రాయి వంటిది. సమాజ మార్పు కోసం, సమాజ అభివృద్ధి కోసం పనిచేసిన, వారిజీవితాలను త్యాగం చేసిన ఎందరో మహనీయులు మహాత్మ జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే,భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ బాబు జగ్జీవన్ రామ్ వంటి వారికి నిలయమైన భరత భూమిలో, ఆ కోవకే చెందిన సమాజంలోని కుల వివక్షత, అంటరానితనం మనిషిని మనిషిగా చూడని హీన స్థితి మెరుగుపడాలని అహోరాత్రులు శ్రమించి బడుగు బలహీన వర్గాలకు సమన్యాయం జరిగేందుకు హక్కులు కల్పించి భరోసాను అందించే విధంగా ప్రపంచ దేశాల రాజ్యాంగాలను చదివి పరిశీలించి ఉత్తమమైన వాటిని భారత రాజ్యాంగంలో పొందుపరిచి అత్యున్నతమైన రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం .. కాగా స్వతంత్ర భారతంలో రాజ్యాంగ మౌలిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వకుండా పాలకులు ఇష్టానుసారం పాలన కొనసాగిస్తూ అసమానతలు అంతరాలను పెంచి పోషిస్తూ సామాన్య ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రాలు అందకుండా అన్యాయం అక్రమం పేట్రేగి పోతున్న సమయంలో, సమాజంలోని అపసవ్య దోరణలు అధ్యయనం చేస్తూ ప్రపంచ దేశాల విప్లవాలను ఆలకిస్తూ లాటిన్ అమెరికా దేశాల విప్లవ వీరుడు చేగువేరా స్పూర్తిగా యూనివర్సిటీలలోనే సమాజ మార్పుకు నాంది పడాలని అసమానతల అంతరాల దొంతరలకు వ్యతిరేకంగా స్టడీ సర్కిల్ ద్వారా విద్యార్థులను చైతన్య పరుస్తూ అన్యాయ అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడాలని బోధిస్తూ తన ఆచరణ ద్వారా చూపిస్తూ మతోన్మాద గుండాల చేతిలో బలి అయిన ఉస్మానియా అరుణతార, ఇండియన్ చేగువేరా, ప్రగతిశీల ప్రజాస్వామిక విద్యార్థి సంఘం స్థాపక కారకులుజార్జి రెడ్డి అమరుడైన రోజు…. కాకతాళీయంగా సామాజిక వివక్షతను రూపుమాపి సామాజిక న్యాయము కోసం పరితపించిన రాజ్యాంగ నిర్మాత జన్మదినం, సమసమాజ స్థాపన కోసం అదే సామాజిక న్యాయం కోసం పోరాడిన విప్లవ వీరుడు జార్జి రెడ్డి వర్ధంతి కూడ ఏప్రిల్ 14. ఒక ధ్రువతార వికసించిన రోజు, ఒక అరుణతార రాలిపోయిన రోజు అందుకే ఏప్రిల్ 14 చరిత్రపుటల్లోఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని ప్రజల గుండెల్లో నిలిచిపోయిన, నిలిచిపోతున్న రోజు. ఇద్దరి ఆశయాలు సమాజంలోని సమానత కోసమే, అంతరాలు లేని మానవీయ సమాజం కోసమే, ఇద్దరూ ప్రపంచ స్థాయి మేధావులే.
ప్రజల బాగోగుల కోసం, సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచించిన ఆలోచన పరులే. సమాజ హితం కోసం అడుగు అడుగున పోరాడిన వీర యోధులే.. ప్రతి సంవత్సరం ఈరోజు నాకు ఒక సంఘర్షణను రేపుతోంది. ఒక సామాజిక విప్లవకారునీ జననం, మరొక విప్లవకారుడు నేలకొరిగిన రోజు. ఒకరిదిపుట్టుక, ఒకరిది చావు… ఇద్దరినీ ఒకే రోజు స్మరించుకోవడం సంఘర్షణ కాదా? సమీకరించు, బోధించు ,పోరాడు అన్న నినాదంతో చైతన్యం కోసం పాటుపడిన వారు ఒకరు,జీనా హైతో మర్ నా సీఖో కదం కదం పర్ లడ్నా సీఖో అనే నినాదం ఇచ్చి విప్లవ ఆదర్శాలను అందించిన సాహసోపేతమైన శక్తి ఒకరు… పుట్టిన వారు మరణించక తప్పదు అని తెలిసినను ఒకింత బాధ కలుగుతూనే ఉంటుంది. అమరత్వం రమ్యమైనది. తన కోసమే పుట్టి తన కోసమే మరణించడం సహజం. కానీ సమాజం కోసం, సమాజంలోని దోపిడి పీడన బాధితుల తరుపున గళమెత్తి కలంమెత్తి పోరాడి పరుల కోసం మరణించడం రమ్యమైనది కాకా ఏమవుతుంది? ఈ ఇద్దరు మహనీయులు కూడా అత్యంత ఉన్నత చదువులను చదివి ప్రతిక్షణం పేద వారి గురించి ఆలోచించి,తమ స్వార్థం గురించి ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా తమ అమూల్యమైన జీవితాలను ప్రజల కోసం త్యాగం చేశారు.
ఇరువురి దారులు వేరైనా అంతిమ లక్ష్యం ఒక్కటే.. మతోన్మాద మత మనువాద సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడిన వారే.. మతములన్నియు మాసిపోవును, జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును అని గురజాడ గారన్నట్లు జ్ఞానము ద్వారానే జీవితానికి వెలుగు అని నమ్మిన వారే.. విద్య ద్వారానే అసమానతలు అంతరాలు తొలగించబడతాయి అని శాస్త్రీయ విద్యా విధానం కోసం ఒకరు పోరాడితే, రిజర్వేషన్ ఫలాలు అందించి అణగారిన వర్గాలు విద్యా గంధానికి నోచుకోవాలి అని కృషి చేసిన వారు మరొకరు…కులం అణచివేతలు, కుల దురహంకార పీడనలు లేని ఆత్మగౌరవ సమాజం కోసం పోరాడిన సాంఘీక విప్లవకారుడు అంబేద్కర్ జీవితం… ,దోపిడీ, పీడన లేని సమ సమాజాన్ని కలలుగన్న విప్లవ స్వాప్నిక కార్యశీలి జార్జ్ రెడ్డి జీవితం ప్రస్తుత సమాజానికి ఆదర్శప్రాయం, అనుసరణీయం.. ఒకరు బాధిత కులంలో పుట్టి అన్యాయ అక్రమ అవమానాలను భరించి, కుల ఆధిపత్యానికి, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడడానికి తమ జాతిని, బాధితులను మరియు పీడితులను చైతన్య పరిస్తే .. మధ్యతరగతి వర్గంలో జన్మించి, పెద్దగా ఎటువంటి ఇబ్బందులులేని జీవితాన్ని గడిపే అవకాశం ఉన్నను, పేదల, శ్రామికవర్గ గ్రామీణ కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థుల బాధలను అవగాహన పరుచుకునేందుకు వారి స్థాయికి దిగి సాధారణ జీవితాన్ని అనుభవించిన విద్యార్థి అమరవీరుడు…. 1972లో కామ్రేడ్ జార్జి రెడ్డిని మతోన్మాద సంఘ్ పరివార్ హిందుత్వ శక్తులు హత్య చేసిన పరిస్థితులు రోజురోజుకు మరింత దిగజారుతున్నాయి. నేటి కాలంలో కూడా మత మౌఢ్యాన్ని, మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తూ ప్రజాస్వామిక భావాలను పెంపొందింప చేయడానికి, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన ప్రజాస్వామిక వాదులను కాల్చి చంపిన సందర్భాలు , యూనివర్సిటీలలో అనగారిన వర్గాల విద్యార్థులు ఉన్నతంగా పరిశోధనలు చేయకుండా మానసిక క్షోభకు గురిచేసి బలవన్మరణంనకు పాల్పడే విధంగా చేయడం జరుగుతుంది.
సమాజాన్ని విచ్చిన్నం చేసే కుట్రలు పెరిగిపోతున్నాయి. విద్యను కాషాయీకరణ, వ్యాపారీకరణ చేసేందుకు ప్రభుత్వాలు ఆత్రుతను కనబరుస్తున్నాయి. అందుకే ఆగమేఘాల మీద జాతీయ విద్యా విధానము ప్రవేశపెట్టి ప్రైవేటీకరణ విధానాలను ప్రోత్సహి ంచేందుకు చర్యలు చేపట్టడం, ఆవిధానాలను సవరించాలని విద్యావేత్తలు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు కోరినప్పటికీ వాటిని పెడచెవిన పెట్టి ఏకపక్షంగా బలవంతంగా అశాస్త్రీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని ప్రయత్నించడం వల్ల బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు విద్యకు దూరమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కానీ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మరియు విద్యార్థి అమరవీరుడు జార్జిరెడ్డి ఆశించినట్టుగా ప్రజాస్వామిక ప్రజాతంత్ర శాస్త్రీయ విద్యా విధానం అమలు కావడం లేదు, అమలు చేసే పరిస్థితులు కూడా లేవు. అది అమలు చేయాలని అడిగే విద్యార్థిలోకం కూడా బలంగా లేదు. కానీ ప్రజాస్వామిక విలువలు, మానవీయ విలువలు పెంపొందించబడి ఆదర్శవంతమైన సమాజమూ రూపుదిద్దుకోవాలంటే అంబేద్కర్ జార్జి రెడ్డి ల ఆశయాలు నెరవేర్చ బడాలి. అందుకు వారి ఆలోచన విధానం అనుసరణీయం. చదివే ఆయుధంగా తీసుకొని ప్రపంచ మేధావి గా గుర్తించబడి తనవారి బాగోగుల కోసం అహోరాత్రులు అవిరళ కృషిచేసిన అంబేద్కర్ జీవితాన్ని , అన్యాయాలకు అక్రమానికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేసే స్వభావం, తప్పు లేనప్పుడు ఎవరినైనా ఎదిరించే సత్తా, తోటి వారి కోసం తన ప్రాణాలను సైతం అర్పించే త్యాగ గుణం, సమ సమాజం కోసం పరితపించే మనస్తత్వం కల , ఆందోళన ,పోరాటంలతో పాటు నిరంతర అధ్యయనశీలి, పాతికేళ్ల జీవితంలో ప్రపంచ విప్లవాలను పట్టుదలతో పరిశీలించి విప్లవ మార్గాన్ని అనుసరించిన ఆల్బర్ట్ ఐనిస్టయిన్ వంటి ప్రజ్ఞ కలిగిన అపర మేధావి భౌతిక శాస్త్రంలో గోల్డ్మెడల్ సాధించి స్కాలర్ గా ఉన్న జార్జి రెడ్డి జీవితం స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత సామాజిక ప్రజా సమస్యల పట్ల అవగాహన పెంచుకుని శాస్త్రీయ విద్యా విధానం కోసం, ప్రజాతంత్ర విద్య కోసం పోరాడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.
తండ సదానందం
టి పి టి ఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్
మహబూబాబాద్.