- ఉద్యోగాలివ్వలేక… ఇంత దారుణాలకు ఒడిగడతారా?
- నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడతారా?
- టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యులందరినీ రద్దు చేయాలి
- లీకేజీ పై న్యాయ విచారణ జరపాల్సిందే
- కేసీఆర్ సర్కార్ తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 14 : కేసీఆర్ పాలనలో టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షలకు సంబంధించి ప్రశ్నాపత్రాలన్నీ లీక్ అయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. గతేడాది నిర్వహించిన గ్రూప్-1 పరీక్షా పత్రం సైతం లీక్ అయ్యిందని చెప్పారు. టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ ఈ ప్రశ్నాపత్రాన్ని లీక్ చేయడంతోపాటు తానే స్వయంగా పరీక్ష రాశారని పేర్కొన్నారు. అత్యధికంగా ప్రవీణ్‌కు 103 మార్కులొచ్చాయని, అందుకు సంబంధించిన ఓఎంఆర్ షీట్‌ను బండి సంజయ్ ప్రస్తావించారు. ప్రవీణ్ కోసం పరీక్షా సమయాన్ని సైతం మార్చారని, అభ్యర్థులందరికీ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పరీక్ష నిర్వహిస్తే…ప్రవీణ్ పరీక్ష రాసే కాలేజీకి మాత్రం మధ్యాహ్నం తరువాత నిర్వహించారని పేర్కొన్నారు. దీనిపై ఓ పత్రికలో వార్త వచ్చేంతవరకు టీఎస్పీఎస్సీ స్పందించలేదని చెప్పారు. దీనివెనుక పెద్ద మతలబు ఉందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు టీఎస్పీఎస్పీ పెద్దల పాత్ర లేనిదే ఇలాంటి ఘటన జరగడం అంత సులువు కాదని అన్నారు. కేసీఆర్ హయాంలో హయాంలో జరిగిన పరీక్షలకు సంబంధించి ప్రశ్నాపత్రాలన్నీ లీకేజీ అయ్యాయనే అనుమానం కలుగుతుందన్నారు. రాబోయే రెండు నెలల్లో జరగబోయే పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలకు సంబంధించిన సమాచారం సైతం కేసీఆర్ టీమ్ వద్ద ఉందనే సమాచారం తమవద్ద ఉందన్నారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తక్షణమే సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు ఆదేశించడంతోపాటు గవర్నర్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై గవర్నర్ జోక్యం చేసుకుని తెలంగాణలోని నిరుద్యోగులకు న్యాయం చేయాలని, వారికి అభయం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని బండి సంజయ్ తెలిపారు.