Take a fresh look at your lifestyle.

‌గ్రీన్‌ ‌హైడ్రోజన్‌ ‌సూపర్‌ ‌పవర్‌గా భారతం…!

  విచక్షణారహితంగా శిలాజ ఇంధనాలను (ఫాజిల్‌ ‌ఫుయల్స్) ‌వినియోగంతో పర్యావరణంలో కార్బన్‌ ఉద్గారాలు పెరగడంతో భూతాపం, వాతావరణ ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రవాణా, స్టీల్‌, ‌సిమెంట్‌, ఎరువులు, పెట్రో కెమికల్స్ ‌లాంటి పరిశ్రమల్లో తరిగే శిలాజ ఇంధనాల వినియోగం అధికంగా కొనసాదుతోంది. శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా తరగని పునరుత్పాదక శక్తి వనరులను అభివృద్ధి చేయడం తక్షణావసరంగా భావించాలి. సౌర, పవన, అలల, హరిత హైడ్రోజన్‌ ‌లాంటి శిలాజేతర శక్తి వనరులను ప్రోత్సహిస్తూ క్రమంగా శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలి. ఇదే క్రమంలో భారతం పటిష్ట అడుగులు వేస్తూ 2030 నాటికి 50 మిలియన్‌ ‌మెట్రిక్‌ ‌టన్నుల (యంయంటీ) పునరుత్పాదక శక్తి ఉత్పత్తులు చేయడానికి మన దేశం ప్రణాళికలు రచిస్తున్నది.
2070 నాటికి ‘జీరో కార్బన్‌ ఉద్గార’ భారతం:
2070 నాటికి జీరో కార్బన్‌ ఎమిషన్‌ ‌కల సాకారం చేసుకునే ఇండియా ప్రయత్నాల్లో భాగంగా 2023 కేంద్ర బడ్జెట్‌లో రూ: 19,744 కోట్లు కేటాయించి ‘నేషనల్‌ ‌గ్రీన్‌ ‌హైడ్రోజన్‌ ‌మిషన్‌’‌ను ఏర్పాటు చేయడం, 17,490 కోట్లతో సైట్‌(‌స్ట్రాటజిక్‌ ఇం‌టర్వెన్షన్స్ ‌ఫర్‌ ‌గ్రీన్‌ ‌హైడ్రోజన్‌ ‌ట్రాన్‌సిషన్‌) ‌ప్రోగ్రామ్‌ ‌తీసుకురావడం, 1,466 కోట్లతో పైలెట్‌ ‌ప్రాజెక్టులు, 400 కోట్లతో ఆర్‌ అం‌డ్‌ ‌బి, 388 కోట్లతో ఇతర ప్రోత్సాహక నిధులు కేటాయించడం సముచితంగా ఉన్నది. భవిష్యత్తులోపరిశ్రమలు గ్రీన్‌ ‌హైడ్రోజన్‌ (‌హరిత ఉదజని) ఇంధనాన్ని వాడుతూ ప్రమాదకర కార్బన్‌ ఉద్గారాలను కట్టిడి చేయవల్సిన అగత్యం ఏర్పడింది. నీటి అణువును ఎలక్ట్రాలిసిస్‌ (‌విద్యుద్విశ్లేణ) ప్రక్రియ ద్వారా విచ్ఛిన్నం చేస్తూ హరిత హైడ్రోజన్‌ ఉత్పత్తి చేయడంలో వాణిజ్యపరమైన సఫలత సాధించిన నాడు ప్రపంచ పర్యావరణ ఆరోగ్యానికి శుభ పరిణామంగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు. మీథేన్‌ ‌వాయువు నుంచి కాలుష్య కారక కార్బన్‌ ‌డై ఆక్సైడ్‌ను విడుదల చేసే కోల్‌ను వాడుతూ ఉత్పత్తి చేసే ఉదజని ఇంధనాన్ని ‘గ్రే (బూడిద రంగు) లేదా బ్లూ లేదా బ్లాక్‌ ‌హైడ్రోజన్‌’‌గా పిలుస్తారు.
పారిశ్రామిక ఇంధనంగా హరిత ఉదజని :
హరిత ఉదజని వినియోగంలో రవాణా, భారీ పరిశ్రమలు, ఏవియేషన్‌, ‌పవర్‌ ‌స్టోరేజ్‌ ‌రంగాలు సఫలత సాధించిన నాడు కాలుష్య ప్రమాదాలు దూరం అవుతాయి. హరిత హైడ్రోజన్‌ ఉత్పత్తి, వినియోగాలను పెంచడానికి ప్రభుత్వాలు, పరిశ్రమలు కలిసి పని చేయాల్సి ఉంటుంది. హరిత ఉదజని వాడకాన్ని దేశీయంగా పెంచిన తరువాతనే అంతర్జాతీయ మార్కెట్‌ ‌గూర్చి ఆలోచించాలి. ప్రపంచంలోనే 2వ అతి పెద్ద స్టీల్‌ ఉత్పత్తి కేంద్రంగా పేరు తెచ్చుకున్న ఇండియాలో హరిత హైడ్రోజన్‌ ‌వినియోగంలో స్టీల్‌ ‌పరిశ్రమలు సఫలం కావాలి. ఇతర దేశాలతో పోల్చితే భారతంలో హరిత హైడ్రోజన్‌ ఉత్పత్తి, వినియోగం చాలా తక్కువగా ఉంది. హైడ్రోజన్‌ ‌వాయువు రవాణా ఖరీదైనదే కాకుండా కష్టంగా కూడా ఉంటుందని తెలుసుకోవాలి. హైడ్రోజన్‌ ఉత్పత్తి ఖర్చు తగ్గించడానికి, రవాణా సులభంగా జరగడానికి అంతర్జాతీయంగా దేశాల మధ్య పూర్తి అవగాహన కల్పించాలి. జీ-20 దేశాల సమూహానికి అధ్యక్ష బాధ్యతలో ఉన్న భారతం హరిత హైడ్రోజన్‌ ‌విషయంలో ప్రముఖ పాత్ర వహించాల్సి ఉంది.
హరిత హైడ్రోజన్‌ ‌సూపర్‌ ‌పవర్‌గా ఇండియా :
21వ శతాబ్దపు పారిశ్రామిక పునరుత్పాదక శక్తి వనరుగా హరిత హైడ్రోజన్‌ ‌ప్రధాన భూమికను నిర్వహించనుందని నమ్మాలి. ఇండియాలో సాలీనా 5 యంయంటీల హరిత హైడ్రోజన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి దాదాపు 8 లక్షల కోట్లను వెచ్చిస్తూ 6 లక్షల ఉద్యోగాలను కల్పించనున్నారు. నేడు ప్రపంచ మార్కెట్లో ఎలక్ట్రాలిసిస్‌ ‌ద్వారా ఉత్పత్తి చేస్తున్న ఖరీదైన గ్రీన్‌ ‌హైడ్రోజన్‌ ‌మార్కెట్‌ ‌ధర 4.10 – 7.00 డాలర్స్/‌కేజీ పలుకుతున్నది. గ్రీన్‌ ‌హైడ్రోజన్‌తో పోల్చితే గ్రే లేదా బ్లూ హైడ్రోజన్‌ ‌మార్కెట్‌ ‌ధర తక్కువగా ఉన్నది. భారత్‌లో ఉత్పత్తి అవుతున్న గ్రీన్‌ ‌హైడ్రోజన్‌ ‌చవకగా కేజీకి ఒక డాలర్‌ ‌పలకడం శుభపరిణామంగా గమనించాలి. హరిత హైడ్రోజన్‌ను చవకగా (కాస్ట్ – ఎఫెక్టివ్‌) ‌తయారు చేస్తున్న దేశంగా ఇండియాకు మంచి పేరుండడం హర్షదాయకం. కార్బన్‌ ఉద్గారాలకు ఆస్కారమే లేని హరిత హైడ్రోజన్‌ ‌వినియోగంతో పర్యవరణ పరిరక్షణకు మార్గం సుగమం అవుతుందని తెలుసుకుందాం. రాబోయే రోజుల్లో ‘కాస్ట్-ఎఫెక్టివ్‌ ‌గ్రీన్‌ ‌హైడ్రోజన్‌’ ఉత్పత్తి చేయడంలో ప్రపంచ దేశాలకు ఇండియా దారి దీపం కావాలని, హరిత హైడ్రోజన్‌ ‌సూపర్‌ ‌పవర్‌గా భారతం ఖ్యాతి గడించాలని కోరుకుందాం.

image.png

డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
కరీంనగర్‌ – 9949700037

Leave a Reply