ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రోడ్ షో కు భారీ స్పందన
భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు.. కాలనీల వాసులు..
ప్రజా సంక్షేమమే పరమావధిగా పరిపాలన
-ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 19: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమీన్ పూర్ మండలం ఐలాపూర్, ఐలాపూర్ తాండా, పటేల్ గూడ, కిష్టారెడ్డిపేట గ్రామాల పరిధిలోని వివిధ కాలనీలలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్న రోడ్ షోకు అద్భుతమైన స్పందన లభించింది. దారి పొడవునా తమ అభిమాన నేతకు ఆత్మీయ స్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని తెలిపారు. ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలను జోడెత్తుల పరిగెత్తిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుపుతున్నారని తెలిపారు. రాజ్యాంగబద్ధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్రం కేటాయించకుండా తీవ్ర వివక్షత చూపుతోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం సహకరించుకున్న సీఎం కేసీఆర్ ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు.తెలంగాణ ఇచ్చామన్న కాంగ్రెస్ పార్టీ 1200 మంది అమరుల త్యాగాలను బలి తీసుకుందని విమర్శించారు. మాయ మాటలు కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేటి వరకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజల నుండి చిత్కారాలు ఎదుర్కొంటుందని విమర్శించారు.తెలంగాణ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఆవిర్భవించిన టిఆర్ఎస్ పార్టీని ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి మరో మారు అభివృద్ధికి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు.
అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో..
అసెంబ్లీ ఎన్నికల ప్రచారం లో భాగంగా అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని మధురానగర్, శ్రీ సాయిరాం నగర్ తదితర కాలనీలలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శక పాలన అందిస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఎమ్మెల్యే జిఎంఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమాల్లో అమీన్ పూర్ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, సర్పంచులు కృష్ణ, నితీశా శ్రీకాంత్, మల్లేష్, రవి, ప్రజా ప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, కో-ఆప్షన్ సభ్యుడు బషీర్ ఖురేషి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు.