గ్రహణం రోజు శ్రీవారి ఆలయం మూసివేత
- 24, 25, 8న బ్రేక్ దర్శనాల రద్దు
- తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబరు 24న దీపావళి ఆస్థానం, అక్టోబరు 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చందగ్రహణం కారణంగా ఈ మూడు రోజుల్లో బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అక్టోబర్ 24న దీపావళి ఆస్థానం కారణంగా బ్రేక్ దర్శనం రద్దు చేసినందున అక్టోబర్ 23న సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ అధికారులు వెల్లడించారు. అక్టోబరు 25న సూర్యగ్రహణం కారణంగా ఉదయం 8 నుంచి రాత్రి 7.30 గంటల వరకు దాదాపు 12 గంటలు శ్రీవారి ఆలయ తలుపులు మూసి వేయబడుతాయని, ఈ కారణంగా బ్రేక్ దర్శనం రద్దు చేసినట్లు వెల్లడించారు. 24న సిఫార్సు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేశారు. నవంబరు 8న చందగ్రహణం కారణంగా ఉదయం 8.30 నుంచి రాత్రి దాదాపు 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతామని, బ్రేక్ దర్శనం రద్దు చేసినందున నవంబరు 7న సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని తెలిపారు. అక్టోబరు 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చందగ్రహణం రోజుల్లో శ్రీవాణి, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కూడా రద్దు చేసినట్లు తెలిపారు.
భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతుంది. స్వామి వారి దర్శనానికి 20 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారని వీరికి దర్శనం 8 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 73,420 మంది భక్తులు దర్శించుకోగా 27,621 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.28 కోట్లు వచ్చిందని తెలిపారు. సూర్యగ్రహణం కారణంగా అక్టోబరు 25న ఉదయం 8 నుంచి రాత్రి 7 వరకు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతామని వివరించారు.
అనంతరం ఆలయ తలుపులు తెరిచి, శుద్ధి, పుణ్యహవచనం, కైంకర్యాలు చేపడతారని తెలిపారు. నవంబరు 8న మధ్యాహ్నం 2.39 గంటల నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చందగ్రహణం కారణంగా ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటలకు అమ్మవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారని పేర్కొన్నారు. ఈ రెండు గ్రహణాల కారణంగా సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, బ్రేక్ దర్శనాలతోపాటు అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసిందన్నారు.