కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు
హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి09: గోద్రెజ్ అగ్రోవెట్ కంపెనీ ప్రతినిధి బృందంరాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డితో భేటీ అయింది.మంగళవారం సెక్రెటేరియట్లో గోద్రెజ్ అగ్రోవెట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం సింగ్ యాదవ్ తో పాటు కంపెనీ ప్రతినిధులు రాష్ట్రముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డితో చర్చలు జరిపారు. తెలంగాణలో ఇప్పటికే ఈ కంపెనీ పలు వ్యాపారాలు నిర్వహిస్తోంది. వంట నూనెలు, డెయిరీ, అగ్రో, వెటర్నరీ సర్వీసెస్, అగ్రో కెమికల్స్, పశువుల దాణా, వెటర్నరీ సర్వీసెస్ రంగాల్లో బిజినెస్ కొనసాగిస్తోంది.మలేషియాకు చెందిన సిమ్ డార్బీ కంపెనీతో కలిసి ఖమ్మం జిల్లాలో ఇంటిగ్రేటేడ్ ఆయిల్పామ్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్ ను ఈ కంపెనీ ఏర్పాటు చేస్తోంది.తెలంగాణలో రియల్ ఎస్టేట్, ఫర్నీచర్, కన్సూమర్ గూడ్స్ రంగాల్లోఉన్న అపారమైన అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి కంపెనీ ప్రతినిధులకు సూచించారు.
ఇప్పటికే కంపెనీ చేపట్టిన ఆయిల్ పామ్, డెయిరీ బిజినెస్ ను మరింతవిస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా స్కిల్ డెవలప్‌మెంట్ ను ప్రోత్సహించాలనికంపెనీ ప్రతినిధులకు ఆయన సూచించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు సంబంధిత శాఖఅధికారులు పాల్గొన్నారు.
మంత్రి కొండా సురేఖతో కోకాకోలా ప్రతినిధుల భేటీ తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధిలో పాలు పంచుకునేందుకు ప్రముఖ కూల్ డ్రిరక్స్ తయారీ కంపెనీ హిందుస్థాన్ కోకాకోలా బెవెరేజెస్ ముందుకొచ్చింది.. అటవీ , పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తో కంపెనీ ప్రతినిధుల బృందం మంగళవారం భేటీ అయ్యింది.
నీరు ఘన వ్యర్థాల నిర్వహణ లో సామర్థ్యం పెంపు, వ్యర్థ జలాల పునర్వినియోగం, యువత కు ఉపాధి అవకాశాలు. నైపుణ్యాభివృద్ధి కి ప్రాధాన్యం ఇస్తామని, ఉద్యోగ అవకాశాలలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని మంత్రికి చెప్పారు.. కోకా కోలా రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు రూ.3వేల కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టింది అని మంత్రి కి కోకాకోలా ప్రతినిధులు చెప్పారు. సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్‌లో గ్రీన్ ఫీల్డ్ బాట్లింగ్ ప్లాంట్ నిర్మాణంలో ఉంది, రాష్ట్రంలో పెట్టుబడులతో పాటు సామాజిక అభివృద్ధిలో తమ కంపెనీ భాగస్వామ్యమవుతుందని, అందుకు తగిన విధంగా ప్రాజెక్టులను విస్తరిస్తామని ప్రతినిధులు పేర్కొన్నారు.ఉమ్మడి వరంగల్ జిల్లా లోని మారుమూల గ్రామాల్లో త్రాగు నీరు ట్యాంక్ లు, స్కూల్స్ లో మొబైల్ టాయిలెట్స్, అంగన్ వాడి బిల్డింగ్స్ నిర్మించి .. వ్యర్థాల నిర్వహణ మీద అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని మంత్రి కి ప్రతినిధులు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో కోకాకోలా బెవరేజేస్ పబ్లిక్ అఫైర్స్ చీఫ్ హిమన్సు, క్లస్టర్ హెడ్ ముకుందు త్రివేది, బాపూయే , ఓఎస్డీ సుమంత్ తదితరులు పాల్గొన్నారు.





