Take a fresh look at your lifestyle.

గుడిసెలోకి దూసుకెళ్లిన లారీ

  • నిద్రలోనే ముగ్గురు ప్రాణాలు మాయం
  •  లారీ డ్రైవర్‌ ‌నిర్లక్ష్యంతోనే కొల్లూరు ఘటన
  •  ఘటన స్థలాన్ని సందర్శించిన  మియాపూర్‌ ఏసీపీ నర్సింహారావు

పటాన్‌ ‌చెరు, ప్రజాతంత్ర, మార్చి 2: బ్రతుకుదేరువు కోసం వచ్చిన కుటుంబానికి లారీ రూపంలో మృత్యువు కబలించింది. తెల్లవారుజామునే లారీ డ్రైవర్‌ ‌నిర్లక్ష్యంతో గుడిసెలో నిద్రిస్తున్న ముగ్గురిపైకి లారీ దూసుకెల్లడంతో నిద్రలోని ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు గ్రామంలో చోటు చేసుకుంది. తెల్లాపూర్‌ ‌మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ (2 )‌వద్ద గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో రింగ్‌ ‌రోడ్డుపై నుండి కింద పడి సర్వీస్‌ ‌రోడ్డు పక్కన ఉన్న గుడిసెలపై లారీ దూసుకెళ్లింది. గుడిసెలో నిద్రిస్తున్న ఒకే కుటుంబంకు చెందిన భార్యాభర్తలు, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. కర్ణాటక రాష్ట్రం జినితేంద్ర తాండ నుండి బతుకుదెరువు కోసం రెండు నెలల క్రితం కొల్లూరు వచ్చి గార్డెన్‌ ‌వద్ద పనిచేసుకుంటూ భార్యాభర్తలు, కుమారుడు జీవనం సాగిస్తున్నారు.

గుడిసెలోకి లారీ దూసుకు రావడంతో బాబు రాథోడ్‌(48), ‌కమలి బాయి(43), బసప్ప రాథోడ్‌(23) ‌ముగ్గురు నిద్రలోనే అక్కడికక్కడ మృతి చెందారు. మృతులు బాబు రాథోడ్‌, ‌కావాలిబాయ్‌ ‌కి మొత్తం ఐదుగురు సంతానం. అందులో నలుగురు కుమారులు, ఒక కుమార్తె, కుమార్తె వివాహం జరిగింది. చిన్న కుమారుడు బసప్ప రాథోడ్‌ ‌తో బతుకుదెరువు కోసం కొల్లూరు కు వచ్చారు. మిగతా ముగ్గురు కుమారులు ముంబైలో పని చేసుకుంటూ అక్కడే ఉంటున్నారు.

మృతుడు బాబు రాథోడ్‌ ‌సోదరి పునీబాయ్‌ ‌వివరాలను తెలిపారు. మృతదేహాలను కర్ణాటక తీసుకెళ్లి అక్కడనే అంతక్రియలు నిర్వహిస్తామని, మిగతా ముగ్గురు కుమారులు ముంబైలో ఉన్న వారికి సమాచారం ఇచ్చామని ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా ఘటన స్థలానికి మియాపూర్‌ ఏసిపి నర్సింహారావు, రామచంద్రాపురం సీఐ సంజయ్‌ ‌కుమార్‌ ‌లు సందర్శించే పరిస్థితిని సమీక్షించారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌ ‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply