గజ్వేల్‌ ఆర్‌టీసీ డిపోను తరలిస్తారా…?

  • ఎక్స్‌ప్రెస్‌ ‌సర్వీసులను ఇతర డిపోలకు కేటాయించడం దేనికి సంకేతం..?
  • ప్రజల్లో అయోమయం..ఆందోళన
  • సిఎం కేసీఆర్‌, ‌మంత్రి హరీష్‌రావులు చొరవ చూపాలని వినతి

సిద్ధిపేట, మార్చి 29(ప్రజాతంత్ర బ్యూరో) : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ ‌నియోజకవర్గ ప్రాంత ప్రజ(ప్రయాణికు)లు అయోమయంలోపడ్డారు. ఆందోళన చెందుతున్నారు. అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సిఎం కేసీఆర్‌, ‌మంత్రి హరీష్‌రావు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. అయితే,  కేసీఆర్‌ ‌హయాంలో గజ్వేల్‌ ఎం‌తో అభివృద్ధి చెందింది కదా…ప్రజలెందుకు అయోమయంలో పడ్డారు, ఎందుకు ఆందోళన  చెందుతున్నారు…అనుమానం వ్యక్తం చేస్తున్నారు, సిఎం కేసీఆర్‌, ‌మంత్రి హరీష్‌రావు చొరవ తీసుకోవాలని ఎందుకు కోరుతున్నారో తెలియాలంటే…ఈ వార్త పూర్తిగా చదవాల్సిందే. సరిగ్గా మూడు దశబ్దాల కిందట ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో అప్పటి మంత్రి డాక్టర్‌ ‌జెట్టి గీతారెడ్డి కృషి, ప్రజల పోరాటాల ఫలితంగా గజ్వేల్‌-‌ప్రజ్ఞాపూర్‌(‌జిపిపి) పేరుతో ఆర్టీసీ డిపో ఏర్పడింది. గత మూడు దశబ్దాలుగా గజ్వేల్‌-‌ప్రజ్ఞాపూర్‌ ఆర్టీసీ డిపో ఈ ప్రాంత ప్రజలకు రవాణాకు ఎంతో ఉపయోగకరంగా ఉంది.

ఇక్కడి నుంచి భువనగిరి, రామాయంపేట, చేగుంట, దుబ్బాక, జెబిఎస్‌, ‌కొమురవెల్లి, చేర్యాల, సంగారెడ్డి, యాదగిరిగుట్ట తదితర రూట్లలో పల్లె బస్సులను నడపడంతో పాటు, ముంబయి, కర్నూల్‌, ‌బిచ్కుంద, సిద్ధిపేట, జెబిఎస్‌ ‌తదితర రూట్లలో ఎక్స్‌ప్రెస్‌ ‌సర్వీసులను కూడా నడుపుతూ వొస్తున్న గజ్వేల్‌-‌ప్రజ్ఞాపూర్‌ ఆర్టీసీ డిపో నుంచి ఎక్స్‌ప్రెస్‌ ‌సర్వీసులను తొలగించి ఇతర ప్రాంతాల్లోని డిపోలకు కేటాయించడానికి సంబంధిత ఆర్టీసీ అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. 70 బస్సులతో ఉన్న ఈ డిపోలోని 12 ఎక్స్‌ప్రెస్‌ ‌సర్వీసులను మొదటి విడతలో ఇతర డిపోలకు తరలించిన అధికారులు మరికొన్ని ఎక్స్‌ప్రెస్‌ ‌సర్వీసులను కూడా ఇతర ప్రాంతాలకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఎన్నో ఏండ్లు పోరాడి సాధించుకున్న డిపోను విస్తరించాల్సింది పోయి డిపోలోని బస్సు సర్వీసులను రోజు రోజుకూ ఇతర డిపోలకు తరలించడంతో ఈ ప్రాంత ప్రజలను అయోమయానికి, ఆందోళనకు గురౌచేస్తోంది.

ఎక్స్‌ప్రెస్‌ ‌సర్వీసులను తరలింపుతోనే సరిపెడుతారా? పూర్తిగా డిపోనే ఇక్కడి నుంచి తరలిస్తారా? అనే అనుమానం అందరిలో కలుగుతుంది. వీరి అనుమానం, ఆందోళనకు కారణం లేకపోలేదు. సిఎం కేసీఆర్‌ ‌ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లోని మెయిన్‌ ‌రోడ్డుపైన ఉన్న ఆర్టీసీ బస్టాండ్‌ను కూల్చివేసి ఈ స్థలంలో కూరగాయల మార్కెట్‌ను నిర్మించారు. దీనిని నిర్మించి కూడా ఏండ్లవుతుంది. ఇప్పటి వరకు గజ్వేల్‌లో కానీ, ప్రజ్ఞాపూర్‌లో కానీ పూర్తిస్థాయిలో ఆర్టీసీ బస్టాండ్‌ ‌నిర్మాణం జరగలేదు. ఆర్టీసీ బస్టాండ్‌ ‌నిర్మాణం కోసం ప్రజ్ఞాపూర్‌లో మెయిన్‌ ‌రోడ్డును ఆనుకుని స్థలం ఉంది. దీనిని పట్టించుకునే వారే లేరు. గజ్వేల్‌లో తాత్కాలికంగా రేకులతో ఓ బస్టాండ్‌ ఉం‌ది. ప్రజ్ఞాపూర్‌లో ఆ మాత్రం కూడా లేదు. సిఎంగా  కేసీఆర్‌  ‌ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌-‌ప్రజ్ఞాపూర్‌లో బస్టాండ్‌ను నిర్మించకపోగా…డిపోలో ఉన్న పలు సర్వీసులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న తీరు చూస్తుంటే…నష్టాల పేరుతో జిపిపి బస్‌ ‌డిపోను కూడా పూర్తిగా లేకుండా చేస్తారా?అన్న అనుమానం అందరిలో కలగడం సర్వసాధారణంగా మారింది.

అయితే, ఎక్స్‌ప్రెస్‌ ‌సర్వీసుల తరలింపు పక్రియ సిఎం కేసీఆర్‌, ‌జిల్లాకు చెందిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావుకు ఆర్టీసీ అధికారులు చెప్పే చేస్తున్నారా? లేదంటే సంస్థాపరంగా తీసుకున్న నిర్ణయంతోనే తరలిస్తున్నారా? అనేది ఎవరికీ తెలియడం లేదు. ఇప్పటికైనా ఈ సర్వీసుల తరలింపు జరగకుండా సిఎం కేసీఆర్‌, ‌మంత్రి హరీష్‌రావు జోక్యం చేసుకోవడంతో పాటు గజ్వేల్‌-‌ప్రజ్ఞాపూర్‌లో అన్ని అధునాతన సౌకర్యాలతో బస్టాండ్‌ను నిర్మించాలని ఈప్రాంత ప్రజలు కోరుతున్నారు. ప్రజల కోరిక నెరవేరాలని కోరుకుందాం !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *