ఖమ్మంలో నీ అడ్రస్‌ ‌గల్లంతవుతది కొడుకా..

  • మంత్రి పువ్వాడపై ఈటల ఫైర్‌
  • ఆత్మహత్యకు పాల్పడ్డ బిజెపి కార్యకర్త కుటుంబానికి పరామర్శ

ఖమ్మం, ఏప్రిల్‌ 20 : అధికార దర్పంతో ప్రవర్తించిన ఎందరో కాలగర్భంలో కలిసిపోయారని మంత్రి పువ్వాడ అజయ్‌పై మాజీ మంత్రి, బిజెపి ఎంఎల్‌ఏ ఆటల రాజేందర్‌ ‌మండిపడ్డారు. ఖమ్మం జిల్లా బీజేపీ కార్యకర్త సాయి గణేష్‌ ఆత్మహత్య వ్యవహారం తీవ్ర కలకలం రేపుతుందని, టీఆర్‌ఎస్‌ ‌నేతలు అక్రమ కేసులు పెట్టించి హింసించడంతోనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాబినెట్‌ ‌మాజీ సహచరుడు మంత్రి పువ్వాడ అజయ్‌ ‌కుమార్‌పై ఈటల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం ఈటల రాజేందర్‌ ‌బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…మంత్రి పువ్వాడ అజయ్‌ అధికార దర్పంతో దారుణాలకు పాల్పడుతున్నారని.. బీజేపీ కార్యకర్తలను హింసిస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారం శాశ్వతం కాదని..

2023లో ఖమ్మంలో నీ అడ్రస్‌ ‌గల్లంతవుతది కొడుకా.. మీ తాత జాగీరా ఇది? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంతో మంది కాలగర్భంతో కలిసిపోయారని.. చరిత్ర హీనులుగా మిగిలిపోతారని ఆయన పువ్వాడను హెచ్చరించారు. తన మరణానికి మంత్రి పువ్వాడ అజయ్‌, ‌పోలీసులే కారణమని మరణ వాంగ్మూలం ఇచ్చినా కనీసం కేసులు నమోదు చేయకపోవడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని ఆత్మహత్యలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని కేంద్రానికి ఈటల విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉన్నట్టు సీఎం భావించడం లేదని.. వారసత్వం, నిజాం సర్కార్‌కి వారసుడిగా భావిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన ప్రత్యర్థి పార్టీలను వేధించడం.. అక్రమ కేసులు బనాయించడం.. ఆర్థికంగా దెబ్బతీసి దారికి తెచ్చుకోవడమే నైజంగా మారిందని మండిపడ్డారు.బీజేపీ కార్యకర్తల మీద దాడులు చేయండి.. వారిని ఊళ్లలో తిరగకుండా చేయమని ఆదేశాలిచ్చారని.. ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశాలిస్తే పోలీసులు ఎలా ప్రవర్తిస్తారో అర్థం చేసుకోవచ్చని అన్నారు. శిశుపాలుడు తప్పు చేసినట్టు కేసీఆర్‌ ‌తప్పులు చేస్తున్నారు. 101 తప్పులు అయ్యాయి. ఆయన్ను ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెట్టాము. ఈ ప్రభుత్వానికి పతనం తప్పదని ఈటల అన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page