పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 30: స్వతహాగా క్రీడాకారుడైన తాను క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధికి ఎల్లప్పుడూ తోడ్పాటును అందిస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే, మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్రస్థాయి పదవ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మలిదశ వయసులో క్రీడలపై ఆసక్తి పెంపొందించుకొని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ క్రీడాంశాల్లో ప్రతిభను కనపరచడం సంతోషకరమన్నారు. 40 సంవత్సరాల వయసు నుండి 90 సంవత్సరాల వయస్సు గల క్రీడాకారులు వీటిలో పాల్గొంటున్నారని తెలిపారు. అనంతరం వివిధ క్రీడాంశాల్లో ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు, మర్రి లక్ష్మణ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రభు కుమార్ గౌడ్, ఉపాధ్యక్షులు ఇక్బాల్, కోశాధికారి లక్ష్మి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
క్రీడాకారులకు ఎల్లవేళలా సంపూర్ణ సహకారం





