- సైబర్ నేరస్థుల ముఠాను పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు
- డేటాతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠా
- జస్ట్ డయల్‌కు నోటీసులు జారీ
- వివరాలు వెల్లడించిన సిపి స్టీఫెన్ రవీంద్ర
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23 : భారతీయుల వ్యక్తిగత డేటాను చోరీ చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. డేటా చోరీ చేస్తున్న ఆరుగురు నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఆధార్, పాన్ కార్డ్, బ్యాంకు వివరాలను కొట్టేసిన ముఠా నేరాలకు పాల్పడుతుంది. అంతేకాదు ఆ డేటాను సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఠాను పట్టుకున్న అనంతరం సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వి•డియాతో మాట్లాడుతూ…దేశవ్యాప్తంగా కోట్ల మందికి సంబంధించిన వ్యక్తి గత డేటాను ఈ ముఠా చోరీ చేసిందన్నారు. ఆధార్, పాన్ కార్డ్, బ్యాంకు అకౌంట్‌లకు సంబంధించిన పూర్తి డేటాను ఈ ముఠా దొంగిలించిందని, పలు ఆన్ లైన్ వెబ్ సైట్ల నుంచి డేటాను చోరీ చేస్తున్నట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు.
దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల డేటాతో పాటు పలు బ్యాంక్‌ల క్రెడిట్ కార్డుల డేటా, పాన్ కార్డ్, పాలసీ బజార్ వంటి పేరున్న ఆర్గనైజేషన్ల నుంచి డేటాను చోరీ చేశారని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. మొత్తం చోరీ చేసిన డేటాను ఈ ముఠా అధిక మొత్తంలో డబ్బుకు అమ్ముకుంటుందన్నారు. దేశ వ్యాప్తంగా చోరీకి పాల్పడ్డ నిందితులను గుర్తించామన్నారు. సైబరాబాద్ పరిధిలో ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్లు చెప్పారు. ప్రముఖంగా నాగపూర్, దిల్లీ, ముంబైకి చెందిన ముఠాగా గుర్తించామన్నారు. ఇకపోతే చోరీ కేసు సిట్‌కు బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కేసును చేధించేందుకు ఐపీఎస్ అధికారితో సిట్ ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. కేసులో కీలకంగా ఉన్న జస్ట్ డయల్‌కు నోటీసులు ఇచ్చి విచారిస్తామని, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్‌బీఐ డేటా దొరికిందని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. పలు ఆన్‌లైన్ వెబ్‌సైట్ల నుంచి డేటా చోరీ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. కొంతమంది ఉద్యోగుల నుంచే వ్యక్తిగత డేటా లీక్ అవుతుందని తెలిపారు. 16.8 కోట్ల మంది దేశ పౌరుల డేటా చోరీకి గురైందని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. డిఫెన్స్, ఆర్మీ ఉద్యోగులకు చెందిన సెన్సిటీవ్ డేటాను సయితం అమ్మకానికి పెట్టారన్నారు.
ఈ డేటా అంతా సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్నారని స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. నిందితులు పబ్లిక్‌కు ఫోన్ చేసి.. బిల్ పే చేయలేదని, ఆప్ డేట్ చేయాలని ఫోన్లు, మెసేజ్‌లు చేస్తుంటారని గుర్తించారు. దీంట్లో ప్రముఖంగా ఉమెన్ డేటా కూడా చోరీకి గురైందని గుర్తించారు. వివిధ కంపెనీలు, బ్యాంకుల్లో ఇన్సూరెన్స్, లోన్ల కోసం అప్లై చేసుకున్న దాదాపు 4 లక్షల మంది డేటా చోరీకి గురైందని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. ఫేస్ బుక్, ట్విట్టర్ వాడే7 లక్షల మంది వ్యక్తిగత డేటా, వారి ఐడీలు, పాస్ వర్డులను సైబర్ నేరగాళ్లు చోరీ చేసినట్లు గుర్తించారు. మొత్తంగా దేశంలోని 16 కోట్ల 80 లక్షల మంది డేటాను సైబర్ నేరగాళ్లకు నిందితులు అమ్మకానికి పెట్టారని గుర్తించారు. ఈ కేసులో మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు.