సభ్యుల చేత ప్రోటెమ్ స్పీకర్ అక్బరుద్దీన్ ప్రమాణం
ప్రమాణ స్వీకారం చేసిన 101 మంది ఎంఎల్‌ఎలు
ప్రోటెమ్ స్పీకర్‌గా అక్బరుద్దీన్ నియామమానికి నిరసనగా బిజెపి సభ్యుల గైర్హాజరు
కెసిఆర్ కాలికి గాయం కారణంగా హాజరు కాని కెసిఆర్, కెటిఆర్
ఈ నెల 14కు శాసన సభ వాయిదా
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 9 : రాష్ట్ర 3వ శాసన సభ శనివారం కొలువు దీరింది. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ప్రోటెమ్ స్పీకర్ అక్బరుద్దీన్ అధ్యక్ష స్థానంలో ఆసీనులయి ఒక్కరొక్కరిగా సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా సిఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా అనంతరం భట్టి విక్రమార్క, మంత్రులు, హరీష్ రావు, ఇతర కాంగ్రెస్, బిఆర్‌ఎస్, ఎంఐఎం సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక కాలికి గాయం కారణంగా హాసిపటల్‌లో చికిత్స పొందుతున్న బిఆర్‌ఎస్ అధినేత, తాజా మాజీ ముఖ్యమంత్రి, శనివారం ఉదయం బిఆర్‌ఎస్ శాసన సభ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయిన కెసిఆర్ సభకు హాజరు కాలేదు. ఇక తాను హాస్పిటల్‌లో ఆయన వెంట ఉన్న కారణంగా సభకు హాజరు కాలేక పోయానని, మరొక రోజు ప్రమాణం చేస్తానని విజ్ఞప్తి చేస్తూ కెటిఆర్ అసెంబ్లీ సెక్రటరీకి సమాచారం పంపించారు. కాంగ్రెస్ మంత్రులు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌లు కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇక ప్రోటెమ్ స్పీకర్‌గా అక్బరుద్ధీన్ నియామకానికి నిరసనగా బిజెపి సభ్యులు సభకు గైర్హాజరయ్యారు. ప్రొటెమ్ స్పీకర్‌గా అక్బరుద్దీన్ చేత తాము ప్రమాణ స్వీకారం చేసేది లేదని వారు అంతకు ముందు స్పష్టం చేశారు. శాసన సభ సమావేశాల మొదటి రోజు మొత్తంగా 101 మంది శాసన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయగా ఇంకా 18 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. ఇక అనంతరం ప్రోటెమ్ స్పీకర్ సభను ఈ నెల 14 గురువారానికి వాయిదా వేశారు. కాగా స్పీకర్ ఎన్నిక నోటిఫకేషన్ వెలువడనుంది. శుక్రవారం రోజున స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. ఆ మరుసటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. తర్వాతి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చిస్తారు. ఆ తర్వాత సభ ఎన్ని రోజులు నిర్వహించాలనేది స్పీకర్ ఎన్నిక అనంతరం జరిగే బీఏసీలో నిర్ణయించనున్నారు. కాగా ఈ సారి 51 మంది ఎమ్మెల్యేలు మొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికైన ప్రతీ ఎమ్మెల్యే గెలిచిన పత్రం రెండు కాపీల జిరాక్స్, రెండు ఫోటోలు తేవాలని అసెంబ్లీ సెక్రెటరీ ఇంతకు ముందే ఆదేశాలు జారీ చేశారు.
ప్రోటెమ్ స్పీకర్‌గా అక్బరుద్దీన్ నియామకం పై గవర్నర్‌కు బిజెపి ఎంఎల్‌ఎలు ఫిర్యాదు
శనివారం గవర్నర్ సెక్రటరీ సురేంద్ర మోహన్‌తో బీజేపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో వారు రాజ్‌భవన్‌లో గవర్నర్ సెక్రెటరీని కలిశారు. ఈ సందర్భంగా ప్రొటెమ్ స్పీకర్ నియమాకంపై గవర్నర్ సెక్రెటరీకి వారు ఫిర్యాదు చేశారు. సీనియర్‌ను కాకుండా ప్రొటెమ్ స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ను నియమించటాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎంఐఎం రజాకార్ల పార్టీ అని తెలంగాణలో రజాకారులు చేసిన ఆకృత్యాలను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రోటైం స్పీకర్ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఉండటంతో వారు సభకు గైర్హాజరయ్యారు. ఆయన స్పీకర్ చైర్‌లో ఉండగా తాము ప్రమాణ స్వీకారం చేసేది లేదని వారు ఈ సందర్భంగా తేల్చి చెప్పారు.
ప్రమాణస్వీకారం చేసిన 99 మంది ఎంఎల్‌ఎలు
తెలంగాణ మూడో అసెంబ్లీ కొలువుదీరిన మొదటి రోజు శనివారం మొదట సీఎం రేవంత్ రెడ్డి, ఆ తర్వాత మంత్రులు భట్టి విక్రమార్క, సీతక్క, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు ప్రమాణం చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు టసఱ్ణఞవ ప్రమాణస్వీకారం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 60 మంది, బీఆర్‌ఎస్ నుంచి 32 మంది, ఎంఐఎం నుంచి ఆరుగురు, సీపీఐ నుంచి ఒకరు ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ప్రమాణం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు…రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, సీతక్క, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు, చిట్టెం పర్ణికా రెడ్డి, మట్టా రాగమయి, పద్మావతి రెడ్డి, యశస్విని రెడ్డి, ఆది శ్రీనివాస్, ఆది నారాయణ, ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్, అనిరుధ్ రెడ్డి, మనోహర్ రెడ్డి, బాలు నాయక్ నేనావత్, చిక్కుడు వంశీకృష్ణ, విజయ రమణారావు, దొంతి మాధవరెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార్, గడ్డం వినోద్, గండ్ర సత్యనారాయణ రావు, మధుసూదన్ రెడ్డి, బీర్ల ఐలయ్య, రామ్‌చందర్ నాయక్, కేఆర్ నాగరాజు, కే శంకరయ్య, కసిరెడ్డి నారాయణరెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, ప్రేమ్ సాగర్ రావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోరం కనకయ్య, రాజేశ్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జయవీర్ రెడ్డి, లక్ష్మీకాంతారావు, మదన్ మోహన్ రావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మల్ రెడ్డి రంగారెడ్డి, మందుల సామేల్, మేడిపల్లి సత్యం, తుడి మేఘారెడ్డి, మురళీ నాయక్ భుక్యా, మైనంపల్లి రోహిత్, నాయిని రాజేందర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, పటోళ్ల సంజీవ్ రెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, రాందాస్ మాలోత్, రేవూరి ప్రకాశ్ రెడ్డి, రేకులపల్లి భూపతి రెడ్డి, టీ రామ్మోహన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, వెడ్మ బొజ్జు, వేముల వీరేశం, గడ్డం వివేక్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి. ఇక బీఆర్‌ఎస్ నుంచి ప్రమాణం చేసిన ఎంఎల్‌ఏలు…కోవా లక్ష్మి, లాస్య నందిత, పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, అనిల్ జాదవ్, అరికెపూడి గాంధీ, బండారి లక్ష్మారెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, చింతా ప్రభాకర్, దానం నాగేందర్, సుధీర్ రెడ్డి, గంగుల కమలాకర్, గూడెం మహిపాల్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, కేపీ వివేకానంద, కాలే యాదయ్య, కాలేరు వెంకటేశ్, కల్వకుంట్ల సంజయ్, మాణిక్ రావు, మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, మర్రి రాజశేఖర్ రెడ్డి, ముఠా గోపాల్, ప్రశాంత్ రెడ్డి, డాక్టర్ సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, తెల్లం వెంకట్రావ్, హరీశ్‌రావు, విజయుడు. ఎంఐఎం నుంచి ప్రమాణం చేసిన ఎంఎల్‌ఏలు…అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, జాఫర్ హుస్సేన్, కౌసర్ మెయినుద్దీన్, జుల్ఫీకర్ అలీ, మహ్మద్ మాజీద్ హుస్సేన్, మహ్మద్ మోబిన్. సీఐపీ నుంచి కూనంనేని సాంబశివరావు ప్రమాణం చేశారు.
ప్రమాణస్వీకారం చేయని 18 మంది ఎంఎల్‌ఎలు
తెలంగాణ మూడో అసెంబ్లీ కొలువుదీరిన మొదటి రోజు శనివారం 119 మంది ఎమ్మెల్యేలకు గానూ 99 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. మరో 18 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయలేదు. ప్రమాణస్వీకారం చేయని వారిలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేసీఆర్, మహేశ్వర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ, కడియం శ్రీహరి, కేటీఆర్, వెంకట రమాణారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, పద్మారావు, పైడి రాకేశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాల్వాయి హరీశ్ బాబు, పాయల్ శంకర్, రామారావు పవార్, రాజాసింగ్ ఉన్నారు.
ప్రోటెమ్ స్పీకర్‌గా అక్బరుద్దీన్
రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించిన గవర్నర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 9 : రాష్ట్ర అసెంబ్లీ ప్రోటెమ్ స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఓవైసీ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం రాజ్‌భవన్‌లో అక్బురుద్దీన్‌తో గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.