Take a fresh look at your lifestyle.

కొంటే గుంజుకుంటం..ఆక్రమిస్తే రెగ్యులరైజ్‌ ‌చేస్తం..

వక్ఫ్ ‌చట్టం..ఈ పేరు పలువురికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది..పైసా పైసా కూడబెట్టి భవిష్యత్తు అవసరాల కోసం పట్టా భూమిలో ప్లాట్లు కొనుగోలు చేసి అన్ని అనుమతులతో ఇండ్లు కటుకున్నదే పాపమయ్యింది. మేడ్చల్‌ ‌జిల్లా బోడుప్పల్‌లో  దశాబ్దాల క్రితం వెలసిన గ్రామ పంచాయతీ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ఇళ్ళు కట్టుకున్నదే నేరమైనట్లు ఉన్నది సర్కార్‌ ‌తీరు. సదరు భూమి వక్ఫ్ ‌బోర్డుకు చెందినదంటూ నోటీసులు ఇవ్వడం పలువురిని కలచివేస్తుంది. ఎన్నో ఆశలతో నగరంలో ఇళ్లు కట్టుకుంటే ఉన్న ఫలంగా వెళ్లిపోవాలంటూ హూంకరించడం పట్ల బాధితులు హాహాకారాలు చేస్తున్నారు. నాడు పట్టా భూములంటూ గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలు ఇంటి నిర్మాణ అనుమతులు ఇచ్చినా…నేడు నిషేధిత జాబితాలో ఉన్నాయంటూ రిజిస్ట్రేషన్లు, క్రయ, విక్రయాలు బంద్‌ ‌చేయడంతో బాధితుల అరిగోస చెప్పనలవి కాదు. ఏళ్ల నుంచి లేని వక్ఫ్ ‌భూములు ఇప్పుడెలా పుట్టుకొచ్చాయని పలువురి వాదన..ఈ అంశంపై ‘ప్రజాతంత్ర’ కథనం..

  • సర్కార్‌ ‌ద్వంద్వ నీతి
  • వక్ఫ్ ‌సమస్యతో బోడుప్పల్‌లో ఆగమాగం
  • ఇండ్లుగట్టుకున్నంక గివేమి తిప్పలు..
  • న్యాయం కోసం రోడ్డెక్కిన బాధితులు

ప్రజాతంత్ర, మేడిపల్లి : ఆ భూములు కొనుగోలు చేసి ఇల్లు కట్టుకోవడమే నేరమైంది.. దశాబ్దాల క్రితం ప్లాట్లు కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకుని నివసిస్తున్న  స్థలాలు వక్ప్ •భూములంటూ నిషేదిత జాబితాలో చేర్చడం బాధితుల గుండెలపై గుదిబండ మోపినట్లయ్యింది.. గ్రామ పంచాయతీ, మున్సిపల్‌ ‌శాఖల నుంచి అనుమతులు పొంది ఇల్లు కట్టుకున్నా నేడవి సక్రమం కాదంటూ…నిషేధిత జాబితాలో ఉన్న భూములంటూ సర్కార్‌ ‌చావు కబురు చల్లగా చెప్పడం పలువురిని కలచివేస్తుంది. హైదరాబాద్‌ ‌మహా నగరాన్ని అనుకుని ఉన్న మేడ్చల్‌-‌మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్‌లోని సమారు 350 ఎకరాల భూములు వక్ఫ్ ‌బోర్డుకు చెందినదంటూ నిషేధిత జాబితాలో చేర్చి రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం పలువురిని తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తుంది. ఎక్కడ నలుగురు గుమిగూడినా ఇదే టాపిక్‌పై చర్చ కొనసాగుతుంది.

బోడుప్పల్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌పరిధిలోని సర్వే నంబర్లు.. 20, 21, 22, 45, 46, 47, 48, 49, 50, 52, 60, 61, 62, 66, 67, 68, 69, 91, 92, 93, 94, 102, 103, 104, 105, 106, 111, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 128, 129, 130, 150లలో గల సుమారు 350 ఎకరాల భుములకు సంబంధించి గత 50 సంవత్సరాలకు ముందే భూ యజమానులకు పట్టదారు పాసు బుక్కులు, యాజమాన్య హక్కు పత్రాలు కలిగి ఉన్నారు. రెవెన్యూ రికార్డుల్లో కూడా వారి పేర్లు పట్టాదారులుగా నమోదై ఉన్నాయి. ఆ భూముల ఆధారంగానే ఎన్నో సంవత్సరాల పాటు వ్యవసాయాన్ని తమ జీవనోపాధిగా చేసుకుని కుటుంబాన్ని పోషించుకున్నారు. ఆ తరువాత రైతులు వారి వారి అవసరాల నిమిత్తం 1976వ సంవత్సరం నుంచి మొదలుకుని 1982వ సంవత్సరం మధ్య కాలం వరకు పట్టణీకరణ ప్రభావంతో  అప్పటి పంచాయితీ ఆఫీసు నుంచి లేఅవుటు అనుమతులు తీసుకుని ప్లాట్లుగా మార్చి పలువురికి విక్రయించారు. ఆ ప్లాట్లను వేతన జీవులు, మధ్య తరగతి ప్రజలు, సాధారణ ఉద్యోగులు వేలాది మంది బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఇతర అనేక మార్గాల్లో అప్పులు చేసి కొనుగోలు చేసి ఇండ్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు.

ఈ విధంగా సదరు భూములలో వేలాదిగా వెలసిన ఇండ్లలో దాదాపు ఏడు వేల కుటుంబాలు నివాసం ఉంటున్నారు. చాలా మంది పిల్లల పెళ్ళిళ్ళు, ఉన్నత చదువులతో పాటు ఇతరత్రా భవిష్యత్తు అవసరాల కోసం కొనుగోలు చేసినవారే. ఈ విధంగా బయటి ప్రాంతాల నుంచి వొచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారితో బోడుప్పల్‌ ‌మేజర్‌ ‌గ్రామ పంచాయతీగా కొనసాగి.. అనతి కాలంలోనే మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌స్థాయికి ఎదిగింది. బోడుప్పల్‌ ‌బల్దియాలో దాదాపు అన్ని కాలనీలకు సీసీ రోడ్లు, మురికి నీటి నాలాలు, నల్లా కనెక్షన్లు, కరెంటు స్తంభాలు, వీధి దీపాలు, సహా కనీస అవసరాలు కల్పించబడ్డాయి. అప్పటి నుంచి గత 5 సంవత్సరాల క్రితం  వరకు బోడుప్పల్‌ ఎలాంటి ఇబ్బందులు, ఒడిదుడుకులు లేకుండా ఉండేది. ఇల్లు కట్టుకునే వారికి పంచాయతీ/మున్సిపాలిటీ పర్మిషన్లు ఇవ్వడం, బ్యాంకులు లోన్లు ఇవ్వడం సవ్యంగానే జరిగిపోయాయి. అయినా ఆకస్మికంగా వక్ఫ్ ‌బోర్డు భూములంటూ బాంబు పేల్చడం అనేక మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఆరుగాలం కష్టించి సంపాదించిన సొమ్ముతో ప్లాట్లు కొంటే వక్ఫ్ ‌బోర్డనే సాకు చూపి లాక్కుంటామంటే ఊరుకోభోమని హ్చెరించారు.

బాధితుల నెత్తిన భస్మాసుర హస్తం..!
ఎన్నో ఆశలు పెట్టుకుని నగరంలో ఇండ్లు కట్టుకుని జీవిస్తుంటే వక్ఫ్ ‌భూములంటూ పిడుగుపాటు వార్త చెవిన వేయడం, సదరు భూములను నిషేధిత జాబితాలో పొందుపరచడంతో క్రయ, విక్రయాలు నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్లు చేయకపోవడంతో బాధితులు రోదిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి స్థానిక సబ్‌ ‌రిజిస్ట్రార్‌ ‌సదరు భూమి వక్ఫ్ ‌బోర్డు పరిధిలో ఉందని, క్రయ, విక్రయాలు చెల్లవని, రిజిస్ట్రేషన్లు చేయమని చావు కబురు చల్లగా చెప్పి ఆ భూములను నిషేధిత జాబితాలో(ప్రోహిబీటెడ్‌ ‌ల్యాండ్‌) ‌నమోదు చేశారు. ఓ వ్యక్తి ఇచ్చిన నామమాత్రపు ఫిర్యాదుతో వక్ఫ్ ‌బోర్డు పరిధిలో సదరు భూములు ఉన్నాయనడం విడ్డూరంగా ఉందంటూ బాధితులు మూకుమ్మడిగా మండిపడుతున్నారు. అప్పటి నుండి ప్లాట్లు, ఇండ్లు అవసరాల కోసం అమ్ముకోలేక, కొనలేక అనేక మంది ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇప్పటికే ఇల్లు గ్రౌండ్‌ ‌ఫ్లోర్‌ ఉం‌డి దానిపైన అదనంగా మొదటి, రెండవ అంతస్తుల నిర్మాణం చేసుకోవాలన్నా మున్సిపాటిటీ అనుమతులు ఇవ్వడం లేదంటూ పలువురు వాపోతున్నారు.

న్యాయం కోసం రోడ్డెక్కిన బాధితులు..
పైసా పైసా కూడబెట్టుకొని సంపాదించిన ఆస్తి మీది కాదు…వక్ఫ్ ‌బోర్డుది అంటుండడంతో సొంతదారుల మనోవేదన చెప్పనలవి కాదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి తమ గోడు వినిపించేందుకు ఐక్య కార్యాచరణ సమితి(జేఏసీగా) ఏర్పాటయ్యింది. నిరసన కార్యక్రమాల్లో భాగంగా  రోడ్లపైకి పిల్లాపాపలతో సహా వొచ్చి వంటావార్పు కార్యక్రమం నిర్వహించడంతో ప్రారంభించి గత కొన్ని రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. మంత్రి మల్లారెడ్డి న్యాయ నిపుణులతో సంప్రదించి న్యాయ పోరాటనికి సిద్ధమవుత్నుట్లు జేఏసీ నాయకులు తెలిపారు. ఈ అంశాన్ని  సీఎం కేసీఆర్‌ ‌మానవత దృక్పథంతో పరిశీలించి ఈ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి గతంలో మాదిరిగానే క్రయ, విక్రయాలు, కొనసాగేలా చేయాలని, రిజిష్ట్రేషన్లు పునరుద్ధరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలివ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం వెలువరించిన గెజిట్‌ను డీనోటిఫై చేయాలని డిమాండ్‌ ‌చేస్తున్నారు.

ప్రభుత్వ భూమి రెగ్యులరైజ్‌ ‌చేసి…పట్టా భూమి కొంటే గుంజుకుంటరా.?
ప్రభుత్వ, సీలింగ్‌ ‌భూములలో ఇండ్లు కట్టుకున్న వారికి సాంత్వన చేకూర్చే క్రమంలో ప్రభుత్వం జీవోలు 59, 118 జీవోలు తీసుకువచ్చి నామమాత్రపు ధరల•కు క్రమబద్ధీకరణ చేస్తుండగా.. మరో వైపు పట్టా భూమిలో మార్కెట్‌ ‌ధరకు ప్లాట్లు కొనుగోలు చేసి న్యాయ బద్ధంగా అన్ని అనుమతులతో ఇండ్లు నిర్మించుకుంటే దశాబ్దాల తరువాత వక్ఫ్ ‌భోర్డు భూములని వాటిని స్వాధీనం చేసుకుంటామంటూ ఒత్తిడి చేయడం పట్ల పలువురు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ద్వంద్వ నీతిని ప్రదర్శించడం పట్ల బోడుప్పల్‌ ‌వక్ఫ్ ‌భూముల బాధితులు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు.

ఈ సర్కార్‌ ‌పాలనలో కొన్నోడి కంటే ఆక్రమించుకున్నోడికే మంచి పేరుందని ఎద్దేవా చేస్తున్నారు. న్యాయబద్ధ్దంగా కొనుగోలు చేసిన భూములపై లేనిపోని వివాదాలు రాజేసి ఏ హక్కులూ సక్రమంగా లేని వారికి రెగ్యులరైజ్‌ ‌చేస్తుండడం విచిత్రంగా ఉందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అన్ని అనుమతులు, యాజమాన్య హక్కులూ ఉన్న తమ భూములపై లేనిపోని గొడవలు పెట్టొద్దని పలువురు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తమ సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించకుండా కాలయాపన చేయడంపై సైతం బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బాధితులకు బాసటగా విపక్షాలు..
సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని బాధితులు గత  కొంత కాలంగా వివిధ రూపాలలో జేఏసీ చేస్తున్న ప్రత్యక్ష ఆందోళనకు విపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌, ‌టీజేఎస్‌, ఇతరత్రా రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. ఇప్పటికే దుబ్బాక శాసనసభ్యుడు రఘునందర్‌ ‌రావు అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని కోరారు. ఇదే క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ‌టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి, టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ ‌తదితరులు ఇప్పటికే రిలే నిరాహార దీక్షలలో పాల్గొని సంఘీభావం ప్రకటించి ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు.

ప్రజల ఆస్తులపై లేనిపోని వివాదాలు సృష్టించి దోచుకోవాలనే ధోరణితో రాష్ట్ర సర్కార్‌ ‌వ్యవహరిస్తుందంటూ మండిపడ్డారు. వీరితో పాటు బోడుప్పల్‌ ‌కాలనీల సంక్షేమ సంఘాల సమాఖ్య సైతం పూర్తి మద్దతు ప్రకటించి సమస్య వెంటనే పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తులు చేసింది. ఏదేమైనా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని బాధితులు ముక్తకంఠంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. రావణ కాష్టంలా రాజుకోనివ్వకుండా బాధితుల సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపి తక్షణం ముగింపు పలకాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. 

Leave a Reply