కేసీఆర్‌ ‌గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ఉండటం ఇక్కడి ప్రజల అదృష్టం

నియోజకవర్గానికి గీతారెడ్డి, నర్సారెడ్డి, విజయరామారావు చేసిందేమీ లేదు

కేసీఆర్‌ ‌వొచ్చాకనే అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న గజ్వేల్‌

‌త్వరలోనే సంగారెడ్డికి కెనాల్‌ ‌తెచ్చి కాలంతో పనిలేకుండా కాల్వలు, చెరువులు నింపుతాం

ములుగు, వర్గల్‌, ‌మర్కూక్‌ ‌పర్యటనలో మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేట,ప్రజాతంత్ర, మే 13 : గజ్వేల్‌ ‌నియోజకవర్గ ఎమ్మెల్యేగా సిఎం కేసీఆర్‌ ఉం‌డటం ఇక్కడి ప్రజల అదృష్టమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు. గతంలో గజ్వేల్‌ ‌నుంచి జెట్టి గీతారెడ్డి, తూంకుంట నర్సారెడ్డి, గుండె విజయరామారావు, సంజీవరావు తదితరులు ఎంతో మంది ఎమ్మెల్యేలుగా ఉన్నా…ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు.

అటు కరెంటు, ఇటు మంచినీటి సమస్య తీరలేదని, కేవలం సిఎం కేసీఆర్‌ ‌వొచ్చాక గజ్వేల్‌తో పాటు రాష్ట్రంలోనీ అన్ని ప్రాంతాలకు తాగునీరు, నిరంతర కరెంటు సరఫరా చేస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్‌ ‌సర్కారు అన్నారు. సిఎం కేసీఆర్‌ ‌వొచ్చాకనే గజ్వేల్‌ ‌నియోజకవర్గం అన్ని రంగాలలో దూసుకెళ్తుందన్నారు. శుక్రవారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ ‌నియోజకవర్గంలోని ములుగు, వర్గల్‌, ‌మర్కూక్‌ ‌మండల కేంద్రాలలో పలు అభివృద్ధి పనులకు మంత్రి హరీష్‌రావు శంఖుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ… దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ పేద ప్రజల మేలు కోసమే సిఎం కేసీఆర్‌ ‌చేశారని మంత్రి వెల్లడించారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ హయాంలో కరెంటు కోసం ఎదురుచూపులు ఉండేవనీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్‌ ‌సిఎం అయ్యాక అన్నీ అభివృద్ధి పథంలో మారి దూసుకుపోతున్నామన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంటింటికీ నీళ్లు ఇచ్చిన ఏకైక నాయకుడు సిఎం కేసీఆర్‌ అని, ప్రయివేటు హాస్పిటళ్ల కంటే గజ్వేల్‌ ‌జిల్లా హాస్పిటల్‌లో వైద్య సేవలు బాగున్నాయనీ, ప్రయివేటుకు పోయి డబ్బులు వృథా చేసుకోవద్దనీ, గజ్వేల్‌ ‌ప్రభుత్వ హాస్పిటల్‌కి వెళ్లాలని, ఆరోగ్య లక్ష్మీ పథకం సేవలు ప్రజలు వినియోగించుకోవాలని మంత్రి హరీష్‌రావు కోరారు.

ప్రజలందరికీ సేవలు సులువుగా అందాలన్నదే సిఎం కేసీఆర్‌ ‌సంకల్పమనీ, ఈ నేపథ్యంలోనే మర్కూక్‌లో రూ.5 కోట్లతో మండల కాంప్లెక్స్ ‌నిర్మాణ పనులు ప్రారంభించుకున్నామన్నారు. మండల కేంద్రమైన ములుగు అభివృద్ధి కై రూ.10 కోట్లు మంజూరు చేసుకున్నామనీ, ములుగులో మరో కోల్డ్ ‌స్టోరేజీ, పండ్ల మార్కెట్‌ ‌తేనున్నామన్నారు. ప్రజలకు ప్రభుత్వ ఆఫీసులలో ఏదైనా పని ఉంటే అన్నీ కార్యాలయాలు ఒకేచోట ఉండాలని, ప్రజలకు ప్రభుత్వ అధికారుల సేవలు సులభంగా అందాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమనీ, ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాన్నీ ఒకేచోట అందుబాటులో ఉండాలన్నదే సిఎం కేసీఆర్‌ ‌సంకల్పమన్నారు. 70ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయని పనిని టిఆర్‌ఎస్‌ ‌సిఎం కేసీఆర్‌ ‌ప్రభుత్వం చేస్తుందనీ, సిఎం కేసీఆర్‌ ‌మానవతావాదిగా ప్రభుత్వ హాస్పిటళ్లలో వొచ్చే రోగి బంధువులకు మూడు పూటలా భోజనం పెట్టిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు 99 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యం పండితే, తెలంగాణ రాష్ట్రం వచ్చాక 2 కోట్ల 59 మెట్రిక్‌ ‌టన్నులు ధాన్యం పండిందని మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. మన ఊరు-మన బడి కింద 7300 కోట్లు వెచ్చించి ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీషు మీడియంలో తరగతులు ప్రారంభిస్తున్నామన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరం నీళ్లు పారలేదని బిజెపి పార్టీ నేతలు తొండి మాటలు చెప్పే నాయకులు.. సిద్ధిపేట, దుబ్బాక, గజ్వేల్‌ ‌నియోజకవర్గాలకు రండి. ఎక్కడెక్కడ నీళ్లు పారాయో.. చెరువులు, కుంటలు నిండాయో.. రుజువులు చూపిస్తామన్నారు. త్వరలోనే సంగారెడ్డికి కెనాల్‌ ‌తెచ్చి కాలంతో పనిలేకుండా కాల్వలు, చెరువులు నింపుతామన్నారు. పేద ప్రజల కోసం పని చేసేది టిఆర్‌ఎస్‌ ‌కేసీఆర్‌ ‌ప్రభుత్వం అని, సొంత ఇంటి అడుగు జాగలో ఇళ్లు నిర్మించుకునే వారికి రూ.3 లక్షలు త్వరలోనే మంజూరు చేస్తామనీ, పామాయిల్‌ ‌తోటలకై సిఎం కేసీఆర్‌ ‌వెయ్యి కోట్లు సబ్సిడీ పెట్టారనీ, రైతులు విరివిగా సాగు చేసేందుకు ముందుకు రావాలని మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌రోజాశర్మ, ఎఫ్‌డిసి ఛైర్మన్‌ ‌వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్‌ ‌వంటేరు యాదవరెడ్డి, అదనపు కలెక్టర్‌ ‌శ్రీనివాస్‌రెడ్డి, డిసిసిబి ఛైర్మన్‌ ‌దేవేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ ‌లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, ములుగు డివిజన్‌ ఆత్మ కమిటీ ఛైర్మన్‌ ‌గూండా రంగారెడ్డి, జడ్పిటిసి సభ్యుడు సత్తయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్‌ఎస్‌ ‌నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *