- వంద కోట్లిస్తే బూతులు తిట్టొచ్చా?
- కెటిఆర్‌కు డేటా ఎలా వొచ్చింది
- మంత్రి చెప్పిందే సిట్ అధికారులు చేస్తున్నారు
- లీక్ కేసును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
- పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్
- ఈడి అధికారులకు ఫిర్యాదు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31 : వంద కోట్లిస్తే కేటీఆర్‌ను బూతులు తిట్టొచ్చా? అని రేవంత్ ప్రశ్నించారు. అసలు మంత్రి కేటీఆర్‌కు పరువు ఉందా? కేటీఆర్ పరువు 100 కోట్లని ఆయన ఎలా నిర్ణయించుకున్నాడని రేవంత్ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఐటీ మంత్రి కేటీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిమ్మ దిరిగే కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్‌కు నిజంగా పరువుంటే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసును సీబీఐకి అప్పగించాలని లేకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని లేఖ రాయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీక్ కేసు వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ బృందం శుక్రవారం ఈడీ అధికారులకు ఫిర్యాదు చేసింది. తర్వాత రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…పేపర్ లీక్ కేసులో నిందితులకు కేటీఆర్‌కు సంబంధమేంటని..అసలు కేటీఆర్‌కు ఎగ్జామ్ డేటా ఎలా వొచ్చిందని ప్రశ్నించారు. అధికారులు ఇవ్వలేదనీ చెబుతున్నారు..మరి దొంగలు ఇచ్చారా? ఆ దొంగలకు కేటీఆర్‌కు సంబంధం ఏంటి? అని నిలదీశారు.
కేటీఆర్‌కు డేటా ఎవరిచ్చారో ఈడీ విచారణ జరపాలని రేవంత్ డిమాండ్ చేశారు. కమిషన్ వెల్లడించుకుండా, పబ్లిక్ డోమైన్లో లేకుండా కటాఫ్ మార్కులు ఎంతో కేటీఆర్‌కు ఎలా తెలిసిందని రేవంత్ ప్రశ్నించారు . 415 మంది జగిత్యాల నుంచి గ్రూప్ 1 పరీక్ష రాశారని కేటీఆర్ ఎలా చెప్పారని ప్రశ్నించారు రేవంత్. విచారణను మంత్రి కేటీఆర్ నియంత్రిస్తున్నారని, మంత్రి చెప్పిందే సిట్ అధికారులు చేస్తున్నారని విమర్శించారు. దీనిపై విచారణ జరపాలని ఈడీని కోరామన్నారు. రాష్ట్రంలో విద్యార్థులు చనిపోతున్నా కల్వకుంట్ల కుటుంబానికి చీమ కుట్టినట్లు కూడా లేదని, ఆధారాలు బయట పెడితే తిరిగి తమ మీదే కేసులు పెడుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. శంకర్ లక్ష్మి నుంచి నేరం మొదలైతే ఆమెను సాక్షిగా పెట్టారన్నారు. పేపర్ లీక్ కేసులో ఏ1 గా శంకర లక్ష్మిని, ఏ2గా చైర్మన్, సెక్రటరీలను చేర్చాలని డిమాండ్ చేశారు. శంకర్ లక్ష్మీకి తెలియకుండా ఏం జరగదన్నారు. ఈ కేసులో ప్రభుత్వ పెద్దలకు సంబంధాలు ఉన్నాయని..దాన్ని కప్పి పెట్టడానికే సిట్‌ను నియమించారని విమర్శించారు. పేపర్ లీక్ కేసులో కావాల్సిన వాళ్లను కాపాడేందుకే సిట్ ఏర్పాటు చేశారని రేవంత్ ఆరోపించారు.
గతంలో ఇలాగే సిట్ ఏర్పాటు చేసిన కేసులన్నీ తప్పుదోవపట్టించారని విమర్శించారు. ప్రభుత్వం ఇరుకున పడ్డప్పుడల్లా సిట్‌ను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఈ కేసులో కావల్సిన వారిని కాపాడి దిగువ స్థాయి ఉద్యోగులను బలి పశువులు చేస్తున్నారన్నారు. ఈ కేసులో కోట్ల రూపాయల లావాదేవీలు నగదు రూపంలో జరిగాయని, ఇందులో విదేశాల్లో ఉన్నవారితో హవాలా రూపంలో నగదు చేతులు మారాయని ఆరోపించారు. సిట్ కొద్దిమందిని విచారించి కొందరిని వదిలేస్తుందని, అందరినీ విచారించాలని ఈడీకి ఫిర్యాదు చేశామన్నారు. ఆర్థిక పరమైన నేరారోపణలున్నప్పుడు కేసును ఈడీతో విచారణ జరిపించాలన్నారు. ఈ కేసులో సిట్ ఇప్పటి వరకు సీజ్ చేసిన వాటిని ఈడీ తీసుకోవాలన్నారు. టీఎస్పీఎస్సీ దొంగలు, దోపిడీ దారులకు అడ్డాగా మారిందని, అనర్హులను సభ్యులుగా నియమించారని రేవంత్ రెడ్డి అన్నారు.
టీఎస్పీఎస్సీ ఘటనపై ప్రభుత్వం కోర్టులో విచారణ ఎదుర్కుంటుందన్నారు. ఈ అంశంపై తాము ఇప్పటికే కోర్టును ఆశ్రయించాంమని, కోర్టులో కేసు విచారణ జరుగుతుందని, పరీక్షా పత్రాలను అమ్ముకుంటుంటే ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వ పెద్దలను అమర వీరుల స్తూపం వద్ద ఉరి తీసినా తప్పు లేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 2 వేల మంది విద్యార్థులు మరణించారన్నారు. లక్షల మంది నిరుద్యోగులతో చెలగాటమాడవొద్దని రేవంత్ కోరారు. ఇంత జరిగినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదన్నారు రేవంత్. కేసీఆర్, కేటీఆర్ నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పేపర్ లీక్‌పై సీఎం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. విద్యార్థులు, నిరుద్యోగుల ఉసురు తీయొద్దని..వాళ్ల ఉసురు తగిలితే సర్వనాశనం అయిపోతారని, ఆధారాలు బయటపెట్టిన ప్రతిపక్షాలకు సిట్ నోటీసులివ్వడమేంటని ప్రశ్నించారు. ఆందోళన చేస్తే అరెస్ట్ చేస్తున్నారని చెప్పారు. పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.