సన్యాసి కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కంటే ఏమీ ఎక్కువ అభివృద్ధి చేశాడో సమాధానం చెప్పాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సవాల్ విసిరారు. కేంద్రం పత్తి ప్యాకెట్లపై 43 రూపాయలు పెంచిందని, ఎందుకు పెంచిందో కేంద్ర మంత్రి సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. గత 6 నెలల నుంచి కేంద్రంతో వరి పంచాయితీ నడిచిందనీ, దీంతో దేశంలో కేంద్ర ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉన్నదో తెలిసిందన్నారు. కేంద్ర మొండి వైఖరితో రైతులు నష్టపోతారని రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తదని సిఎం కేసీఆర్ వెల్లడించారన్నారు. రాబోయే రోజుల్లో భారత ప్రభుత్వమే తెలంగాణ రైతుల కాళ్లు మొక్కి మన పంటను తీసుకుంటుందనీ, ముందు చూపు లేని కేంద్రాన్ని నమ్ముకుని రైతులు ఇబ్బంది పడొద్దు. దార్శనికత కలిగిన సిఎం కేసీఆర్‌నే నమ్మాలన్నారు.
బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడ కూడా సాగునీరు ఇవ్వడం లేదనీ, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కుటుంబంపై నిందలు తప్ప మీరేమీ చేయలేరన్నారు. సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పామ్ తోటలు పెట్టడం, ఇక్కడే రూ.300కోట్లతో కర్మాగారం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందనీ, రాష్ట్రంలో ఏ కార్యక్రమం, ఏ పని కొత్తగా ప్రారంభించిన సిద్దిపేట నుంచే ప్రారంభమవుతుందన్నారు. దేశంలోనే అనేక అన్ని రంగాలలో సిద్దిపేట ముందంజలో ఆదర్శంగా నిలిచిందనీ, దీనికి సిఎం కేసీఆర్ వ్యూహకర్త అయితే మంత్రి హరీష్‌రావు అమలు చేస్తాడన్నారు. మా మెడపై కత్తి పెట్టి ఈ ఆయిల్‌పామ్ కర్మాగారంను ఇక్కడ ఏర్పాటు చేయించేలా మంత్రి హరీష్‌రావు చొరవ చూపారన్నారు.
గత ప్రభుత్వాల పాలకులు అనేక రకాల దుష్ప్రచారం చేసి ఇతర పంటల వేయకుండా రైతులను మోసగించారనీ, పథకం ప్రకారమే కేంద్రం వరి పంటను తగ్గిస్తుందనీ, ఆయిల్‌పామ్ పంట నాలుగేళ్ల తరవాత ప్రారంభమవుతుందనీ, ఆయిల్ పామ్ రైతులకు ప్రభుత్వ ఉద్యోగుల కంటే స్థిరమైన ఆదాయం వొస్తుందనీ, ఈ పంటకు మిగతా పంటలతో పోలిస్తే కోతుల బెడద, పందుల బెడద, పంట, చీడ,పీడ, రోగాల బాధ లేదన్నారు. ఆయిల్‌పామ్ తోటలు వేయడం ద్వారా తెలంగాణ రైతు బతుకుల్లో కొత్త వెలుగులు వస్తాయనీ, తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అవుతుందని, దీర్ఘ కాలిక పంటలలో ఆయిల్ పామ్ చాలా శ్రేష్ఠమైందన్నారు.
రైతులు ఆయిల్ పామ్, మల్బరీ తోటలపై ఆసక్తి చూపాలనీ, మూడేళ్లలో 10లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగుచేయాలన్నారు. వ్యవసాయ రంగంపై రాష్ట్ర ప్రభుత్వం 60 వేల కోట్లు ఖర్చు పెడుతుందనీ, పంట మార్పిడిపై రాష్ట్ర రైతాంగం చొరవ చూపాలని మంత్రి నిరంజన్‌రెడ్డి కోరారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ చిత్రపటానికి మంత్రులు హరీష్‌రావు, నిరంజన్‌రెడ్డి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, ఎఫ్‌డిసి ఛైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, డిసిసిబి ఛైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, జడ్పిటిసి సభ్యురాలు తడిసిన ఉమా వెంకట్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు, సంబంధిత అధికారులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.