- పంటల దిగుబడి తగ్గించే దిశగా చర్యలు బాధాకరం
- ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాష్ట్రంలో వ్యవసాయ రంగం బలోపేతం
- రైతాంగం సంక్షేమం కోసం పటిష్ట కార్యాచరణ
- కేంద్ర వ్యవసాయ విధానాలపై సీఎం కేసీఆర్ అసంతృప్తి
- వానాకాల వ్యవసాయ ముందస్తు ఏర్పాట్లపై సిఎం ఉన్నతస్థాయి సమీక్ష
ప్రజాతంత్ర, హైదరాబాద్ : వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్న మన దేశంలో వ్యవసాయాభివృద్ధికి పాటు పడాల్సిన కేంద్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా తిరోగమన విధానాలను అవలంబిస్తుండటం బాధాకరమని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో పంటల దిగుబడిని పెంచి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యతను పక్కనబెట్టి ఉత్పత్తిని తగ్గించే విధంగా అపసవ్య విధానాలను అనుసరిస్తున్నదని విచారం వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ రైతాంగ సంక్షేమం కోసం కార్యాచరణను మరింత పటిష్టంగా కొనసాగిస్తూనే ఉంటుందని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచడం, వానాకాలం వ్యవసాయ ముందస్తు ఏర్పాట్ల సన్నద్ధతపై మంగళవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మరికొద్ది నెలల్లో వానాకాలం రానున్న దృష్ట్యా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. పత్తి, మిర్చి, కంది వాటర్ మిలన్‌తో పాటు లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. అలాగే, రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభించిన వరి ధాన్యం కొనుగోళ్ల పురోగతిని సమీక్షించిన సీఎం కేసీఆర్ జిల్లా స్థాయి వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో మరింత విస్తృతంగా పర్యటించి నిరంతరం పంట పొలాల్లో రైతులకు తగిన సూచనలు ఇవ్వాలని సూచించారు. ఆ దిశగా అవగాహన పెంపొందించాలనీ, ఇందుకు ఏఈ అధికారులకు శిక్షణ తరగతులను నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వ్యవసాయ రంగం బలోపేతం చేస్తున్నదనీ, రాష్ట్రంలో వ్యవసాయానికి వాతావరణం అనుకూలంగా ఉందన్నారు. కల్తీ విత్తనాల తయారీ దారులపై కఠిన చర్యలు తీసుకవాలనీ ఎంతటి వారైనా బాధ్యులను వదిలిపెట్టవద్దని ఆదేశించారు. భవిష్యత్తులో తెలంగాణకు కరువు అన్నదే రాదనీ, స్పష్టం చేసిన సీఎం వ్యవసాయ రంగంలో వస్తున్న వేగాన్ని అధికారులు అందుకోవాలని సూచించారు.
వ్యవసాయ రంగం బలోపేతానికి జిల్లా వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలనీ, ఇందులో కలెక్టర్లు, ఆర్డీవోలను కూడా భాగస్వాములను చేయాలని ఆదేశించారు. ఎరువుల విచ్చలవిడి వాడకాన్ని తగ్గించాలనీ, శాస్త్రీయ పద్దతులు అవలంబిస్తూ మోతాదులో వాడేలా చూడాలని పేర్కొన్నారు. వరి పంటను విపరీతంగా వేయడం ద్వారా భూసారం తగ్గిపోయే అవకాశం ఉందనీ, లాభదాయక పంటలను ఎంచుకుని పంటల మార్పిడి దిశగా రైతుల్లో చైతన్యం తీసుకు రావాలన్నారు. కొరోనా అనంతర పరిస్థితుల్లో ప్రపంచ దేశాల్లో చైనా తదితర దేశాల పత్తి దిగుబడి పడిపోతున్న నేపథ్యంలో రాష్ట్రంలో పత్తికి దిగుబడి తగ్గిపోతున్నదనీ, ఈ విషయాన్ని గుర్తించి పత్తి దిగుబడిని మరింత ప్రోత్సహించాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.