- సభకు అనుమతి నిరాకరణ
- వైస్ చాన్స్‌లర్ రమేష్‌పై విద్యార్థి సంఘాల ఆగ్రహం
- ప్రధాన పరిపాలన భవనం ముందు పెద్ద ఎత్తున నిరసన
- విసి ఛాంబర్‌లోకి వెళ్లేందుకు విద్యార్థుల యత్నం
- అడ్డుకున్న పోలీసులు…విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట
- అరెస్టు చేసేందుకు యత్నించిన పోలీసులు
- కోపోద్రిక్తులైన పలువురు విద్యార్థులు…పూలకుండీలు ధ్వంసం
- విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీ, అరెస్టు
- క్యాంపస్‌లో ఉద్రిక్తత
- తమ సమస్యలను చర్చించేందుకే సభ తలపెట్టామని వెల్లడి
కెయు క్యాంపస్(వరంగల్), ప్రజాతంత్ర, మార్చ్ 29 : రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న సమస్యలు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల జాయింట్ యాక్షన్ కమిటి ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన విద్యార్థి సంఘర్షణ సభకు వైస్ చాన్స్‌లర్ రమేష్ అనుమతి నిరాకరించడంతో విద్యార్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రధాన పరిపాలన భవనానికి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో బుధవారం ఉదయం 11గంటల తర్వాత విద్యార్థులు ర్యాలీగా వొచ్చారు. ప్రధాన పరిపాలన కార్యాలయం ముందు విద్యార్థులు బైటాయించారు. విద్యార్థులు, నిరుద్యోగుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తాము నిర్వహించతలపెట్టిన సంఘర్షణ సభకు ఈ నెల 25న ఇచ్చిన అనుమతిని ఎందుకు రద్దు చేశారని విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నించారు. వెంటనే సభ నిర్వహణకు అనుమతిని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు పెద్దఎత్తున చేసిన నినాదాలకు క్యాంపస్ మారుమ్రోగింది. విసి, అధికారులు వొచ్చి అనుమతి ఇవ్వాలని విద్యార్థులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు.
దాదాపు గంట పాటు శాంతియుతంగా విద్యార్థుల నిరసన కొనసాగింది. అయినప్పటికీ విసి, రిజిస్ట్రార్‌లు ఎవరు కూడా పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహం చెందిన విద్యార్థులు ప్రధాన పరిపాలన కార్యాలయంలోని విసి ఛాంబర్‌కు వెళ్లేందుకు కొంతమంది విద్యార్థులు ప్రయత్నించారు. మరికొంత మంది భవనమెక్కి కిందికి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పెద్దఎత్తున మోహరించిన పోలీసు బలగాలు విద్యార్థులను అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు బలవంతంగా ప్రయత్నాలు చేశారు. దీంతో విద్యార్థులు, సంఘాల నేతలు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పోలీసులు అరెస్టు చేయకుండా విద్యార్థులు బైటాయించారు. దీంతో లాఠీచార్జీ చేసి విద్యార్థులను, సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేసి వ్యాన్‌లోకి ఎక్కించి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ…గత ఎనిమిదేళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీల్లో, వందలాది అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని, బోధన కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేగాకుండా హాస్టళ్లలో అనేక సమస్యలు నెలకొన్నాయని అన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.
ఏళ్ల తరబడి నోటిఫికేషన్ జారీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిందన్నారు. ఎట్టకేలకు గత ఏడాది నిర్వహించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ ప్రిలిమినరీ ప్రశ్నా పత్రాలను లీక్ చేశారని పేర్కొన్నారు. ఇటువంటి అనేక సమస్యలను చర్చించేందుకు, విద్యార్థుల, నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను తీర్చాలని కోరుతూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన సభకు విసి రమేష్ అనుమతి ఇచ్చి ఆ తర్వాత నిరాకరించారని తెలిపారు. విసి రమేష్ బిఆర్‌ఎస్ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు దుయ్యబట్టారు. శాంతియుత వాతావరణంలో సభ నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నామని పేర్కొన్నారు. అటు పోలీసులు, ఇటు కెయు విసి రమేష్ సభ అనుమతి విషయంలో ద్వంద్వ వైఖరిని అవలంభించారని ఆరోపించారు.
ఉమ్మడి రాష్ట్ర పాలకుల కాలంలో సభలు నిర్వహించుకున్నామని, ఏ విసి కూడా అనుమతి నిరాకరించలేదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించామని గుర్తుచేశారు. ఆనాడు టిఆర్‌ఎస్ నేతలు, కెసిఆర్‌తో పాటు అనేక పార్టీల నాయకులు ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తుచేశారు. విద్యార్థుల పోరాట ఫలితంగా ఏర్పడిన తెలంగాణ స్వరాష్ట్రంలో విద్యార్థుల సభపై నిషేధం ఎందుకని ప్రశ్నించారు. సభ అనుమతి కోసం న్యాయపరమైన పోరాటం చేస్తామని విద్యార్థి సంఘాల నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నేతలు ఇ.తిరుపతి (టిజివిపి), జి.రాజేష్‌నాయక్ (గిరిజన శక్తి), ఇ.విజయ్‌కన్నా (పిడిఎస్‌యు), ఎం.రంజిత్‌కుమార్ (టిజివిపి), రాజేందర్ (బిఎస్‌ఎఫ్)లతో పాటు ఎన్‌ఎస్‌యువై తదితర విద్యార్థి సంఘాల నాయకులు, పెద్దసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.