కేంద్రం గెజిట్‌తో రాష్ట్రానికి అన్యాయంపై ఎందుకు మాట్లాడరు ?
టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్
హైదరాబాద్, ప్రజాతంత్ర : కేంద్రం గెజిట్‌తో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ ప్రశ్నించారు. గెజిట్ అమలైతే కొత్త ప్రాజెక్టులు పూర్తి చేసే అవకాశం ఉండదనీ, జలాల హక్కుల కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని పేర్కొన్నారు. బుధవారం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణా నదీ జలాల పరిరక్షణ పాదయాత్ర ఉదయసముద్రం పానగల్ నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
గెజిట్‌లో ప్రాజెక్టులపై సంపూర్ణ అధికారం ఉంటుందనీ, దీంతో నదీ జలాలపై రాష్ట్ర హక్కులు పోతాయన్నారు. ఇప్పటికే మనం సరైన వాటా వినియోగించుకోవడం లేదనీ, రాష్ట్రంలో తలపెట్టిన అన్ని ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయనీ, గెజిట్ అమలైతే కొత్త ప్రాజెక్టులు పూర్తి చేసే అవకాశం ఉండదనీ, శాశ్వతంగా కృష్ణా జలాలపై హక్కులను కోల్పోయే ప్రమాదం ఉందని కోదండరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం, ప్రగతి భవన్, సచివాలయం పనులు పూర్తయ్యాయనీ, నల్లగొండ, పాలమూరు ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కావని ప్రశ్నించారు. కృష్ణా ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనీ,,కమీషన్లు రావనే ఆ ప్రాజెక్టులను పక్కనబెట్టారని ఆరోపించారు. వడ్ల కోసం దిల్లీలో ధర్నా చేసిన మీరు కృస్ణా జలాల విషయంలో ఎందుకు చొరవ తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో నల్గొండ, మహబూబ్‌నగర్ ఎడారిగా మారతాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే గెజిట్‌ను ఉపసంహరించుకోవాలనీ ఈ సందర్భంగా కోదండరామ్ డిమాండ్ చేశారు.