హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : రాష్ట్ర జనాభాలో రెండో అతి పెద్ద కులం, సుమారు 8 నుంచి 10 శాతం(40 లక్షల జనాభా) ఉన్న కురుమలకు అన్ని రాజకీయ పార్టీలు పది సీట్లు కేటాయించాలని కురుమ సంఘం రాష్ట్ర నాయకులు విజ్ఞప్తి చేశారు. అదేవిదంగా రూ.10 వేల కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కురుమ సంఘం నాయకులు దేవర శ్రీనివాస్, మాదారం కృష్ణ, దొడ్డి శ్రీనాధ్ కురుమలు మాట్లాడుతూ కురుమలకు గొర్లు, బర్లు కాదు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కుడా కురుమలకు కేటాయించపోవడం దారుణం అన్నారు. పెండింగ్ లో ఉన్న గోషామహల్ నియోజకవర్గం బిఆర్ఎస్ సీటును బేజిని శ్రీనివాస్ కే కేటాయించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ కేటాయించిన రెండు సీట్లు సరిపోవన్నారు. ఇంకో రెండు సీట్లు కలిపి మొత్తం నాలుగు సీట్లు కేటాయించాలని కోరారు. ఇటీవల బిజెపి విడుదల చేసిన మొదటి జాబితాలో ఒక్క కురుమ లేకపోవడం బాధాకరం అన్నారు. బిజెపి నాంపల్లి దేవర శ్రీనివాస్ కు, సనత్ నగర్ చీర శ్రీకాంత్, జనగాం బేజాడి బీరప్పకు, వేములవాడ తుల ఉమకు, ముషీరాబాద్ బండారు విజయలక్ష్మికి, అలాగే రాజేంద్రనగర్ సీటును కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అర్ధ సంచార జాతులమైన కురుమలను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. 50 ఏళ్ళు నిండిన కురుమలకు, ఒగ్గు కళాకారులకు ప్రతి నెల రూ.5 వేల పెన్షన్ ఇవ్వాలని కోరారు. జివో.559 ప్రకారం ప్రతీ కుటుంబానికి ఐదు ఎకరాల భూమి కేటాయించాలన్నారు. బీరప్ప, మల్లప్ప స్వాముల దీప, ధూప, నైవేద్యాలకు ప్రతీ నెల రూ.10 వేలు ఇవ్వాలని కోరారు. రోగాలతో, రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్నాయని వాటికి ఇన్సూరెన్స్ చేయించాలన్నారు. ప్రతీసారి యాదవులకు ఇస్తున్న షీప్ ఫెడరేషన్ ను కురుమలకే కేటాయించాలని కోరారు. ఈ సమావేశంలో బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ, కురుమ సంఘం నాయకులు చీలంపల్లి పెంటప్ప, సురేష్, విద్యారణ్, అర్పణ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.