అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ప్రతి సంవత్సరం మే 15న విశ్వ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. సాంకేతిక రంగంలో అభివృద్ధి చెందుచున్నప్పటికి, సమాజంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న విషయాన్ని గుర్తించి, కుటుంబాల విలువలను తెలియజేయడం కోసం,ఉమ్మడి కుటుంబాల అవసరము గురించి వివరించడం కొరకు ఈ రోజును ప్రత్యేకంగా కేటాయించారు. పూర్వకాలంలో మాదిరిగా ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు ఉండడంలేదు. ఒంటరితనం పెరిగిపోయి వ్యసనాలకు బానిసలు కావడం, పట్టించుకునేవారు లేకపోవడంతో విచ్చల విడిగా బ్రతకడం,పిల్లలకు సంస్కృతి సాంప్ర దాయం తెలియ చేసే తాతలు, అమ్మలు లేకపోవడం, క్షణికావేశములో నేరస్తులుకావడం, వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. కుటుంబ వ్యవస్థ బలహీనమవ్వడం మూలంగా సమాజంలో జరిగే నష్టాలను మరియు తీవ్ర పరిణామాలను గ్రహించిన ఐక్యరాజ్య సమితి కుటుంబ వ్యవస్థను పటిష్టం చేయడంకోసం 1993, మే 15న అంతర్జాతీయ కుంటుంబ దినోత్సవం జరుపుకోవలెనని నిర్ణయించింది.
కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడం అనే అంశాన్ని వివరిస్తూ ప్రజా చైతన్యంకోసం ప్రపంచవ్యాప్తంగా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించి కుటుంబ వ్యవస్థ యొక్క ప్రాధాన్యతను వివరించడమే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. విచ్ఛిన్నమవుతున్న కుటుంబాల మధ్య తిరిగి ప్రేమానురాగాలు పెంపొందించాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ కుటుంబ దినోత్సవంను జరుపు కోవడానికి నిర్ణయించింది. కుటుంబ సమైక్యత గురించి ప్రజలందరికీ అవగాహన కలిగించడం, కుటుంబ పెద్దల నైపుణ్యాన్నీ మరియు అనుభవాలను పంచుకుంటూ కుటుంబ సమస్యల విషయంలో సరైన సహకారాన్ని అందించడం, కుటుంబాలలో నెలకొన్న విభేదాలను తొలగించి ఆయా కుటుంబాలలో సుఖశాంతులు నెలకొల్పడం వంటి లక్ష్యాలతో ఈ రోజును జరుపు కుంటున్నాము. కుటుంబ వ్యవస్థ మన సమాజం మనకు ఇచ్చిన ఒక గొప్ప అరుదైన కానుకగా భావించవచ్చు.కుటుంబం అనేది సమాజంలో ఒక ముఖ్యమైన భాగం.ఈ ప్రత్యేకత కారణంగా, కుటుంబం వ్యక్తిని జాతికి అనుసంధానం చేస్తూ వసుధైక కుటంబము అనే దిశలో ప్రయాణానికి తోడ్పడుతున్నది. సామాజిక, ఆర్థిక భద్రతకు ఒక సంపూర్ణ వ్యవస్థ కావడంతో పాటు, కొత్త తరానికి సంస్కారాలు, విలువలు నేర్చే ముఖ్యమైన మాధ్యమంగా కూడా కుటుంబం వ్యవహరిస్తుంది.కుటుంబ వ్యవస్థ వల్ల సమాజానికి మనం ఇచ్చే సందేశం ఎంతో గొప్పది.ప్రపంచదేశాల్లో భారతదేశ కుటుంబ వ్యవస్థలా మరెక్కడా లేకపోవడం అనేది మన ధర్మం యొక్క గొప్పతనంగా భావించవచ్చు.
భారతీయ సంస్కృతిసంప్రదాయాలకు, నాగరికత అభివృద్ధి కి మూలమైనది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ.పూర్వకాలం నుండి మనదేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉందని చరిత్ర ద్వార మనకు తెలిసిందే. మనదేశంలో ఉమ్మడి కుటుంబాల వారు ఆనందంగా ఉన్నారని మన చరిత్ర ద్వారా మనం తెలుసుకున్న నిజం. ఒక కుటుంబంలో తాత,అమ్మ మొదలు వారి పిల్లలు వారి పిల్లలు ఇలా మూడు నుంచి నాలుగు తరాలు ఉమ్మడి కుటుంబంలో ఉండేవి.ఇంటి లోని పెద్దకు అందరూ గౌరవం ఇస్తూ, ఆయన మాటే వినేవారు.ఆ కుటుంబా లలో పెద్దల సంరక్షణలో పిల్లలు ఆనందంగా ఉండేవారు. కష్ట సుఖాలు సమానంగా పంచుకునే ఆత్మీయులు, ఆపదలో ఆదుకునే బంధుమిత్రులతో ఒంటరితనము అనే భావన లేకుండా ఆనందంగా గడిపిన కుటుంబాలెన్నో ఉన్నాయి.కానీ నేడు చూస్తే, ఉమ్మడి కుటుంబాలుగా ఉన్న ఎన్నో కుటుంబాలు ఆధునిక ప్రపంచంలో చిన్నకుటుంబాలుగా మారాయి. ఆధునికత పెరగడం, నాగరికత పురోభివృద్ధి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి కలసి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ను దెబ్బతీసింది.నేటి ఆధునిక ప్రపంచంలో రెండు కుటుంబాలు కాదు కదా రెండు మనసులు కూడా కలసి జీవించ లేని పరిస్థితి నెలకొంది.డబ్బు సంపాదన కోసం కనీసం భార్యభర్తలు కూడా ఒక చోట కూర్చుని ఒకరినొకరు పలకరించుకునే సమయం లేదంటే మనకుటుంబ వ్యవస్థ ఎంత బలహీన పడిరదో అర్థం చేసుకోవచ్చు.
ఆడవారు, మగవారు వేరు వేరు పనులు పంచుకొని జీవనాన్ని సాగిస్తూ శ్రమ విభజనకు ఒక ఉదాహరణగా ఉంటుంది. ఆధునిక యుగంలో ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఒకరినొకరు పలుకరించుకునే సమయం చిక్కని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కేవలం ఫోన్లోనో, మొబైల్లోనో యోగక్షేమాలు కనుక్కునే కుటుంబాలు కూడా ఉన్నాయంటే విచారకరం. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలకు మనదేశం పుట్టిల్లు. ఇప్పుడు అలాంటి ఉమ్మడి కుటుంబాలున్న వారిని వెతికినా దొరకడం లేదు. అనేక కుటుంబాలు వ్యక్తిగత, చిన్న చిన్న కారణాలతో విచ్ఛిన్నం కావడం మనం చూస్తున్నాం, అలాంటి తగాదాలను కుటుంబ పెద్దలుంటే సర్దిచెప్పి ఒకరిపై ఒకరికి నమ్మకం కలిగించేవారు.సమన్వయం లోపించడం వల్ల విడాకులు తీసుకున్న వ్యక్తులు ఎందరో ఉన్నారు.కాబట్టి ఉమ్మడి కుటుంబ ప్రాధాన్యతను గుర్తించి వీలైనంత ఎక్కువ సమయాన్ని మనవలు మనవరాండ్రతో గడిపే అవకాశం మీ తల్లిదండ్రులకిస్తూ నీతి కథలు,పౌరాణిక కథలు చెప్పే అవకాశం ఇస్తూ కలిసి మెలసి ఉండి ఉమ్మడి కుటుంబ వ్యవస్థను బలపరిచేలా చేద్దాం. గౌరవం,త్యాగం, సంయమనం, ప్రేమ, ఆత్మీయత, ఓర్పు,ఒకరికొకరు సహకరించు కోడం, సంతోషకరమైన ఉమ్మడి కుటుంబానికి మార్గాలుగా భావించి ఈ లక్షణాలను కుటుంబ సభ్యులందరు కలిగివుండేలా కృషిచేస్తే ఆనంద జీవనం అందించవచ్చు. సమాజానికి విలువలు నేర్పడంలో ‘‘ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా’’ మంచి సాధనాలు.కుటుంబ వ్యవస్థ గురించి మంచి కథనాలు ప్రచురించడం, అలాగే స్ఫూర్తిదాయకంగా చిత్రాలు తీయడం,ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించడం,చట్టాల రూపకల్పన చేసేటప్పుడు ప్రభుత్వాలు కుటుంబ వ్యవస్థ పటిష్టపరిచే విధంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంతైనా మార్పు వస్తుందని భావిద్దాం. ి
గడప రఘుపతిరావు
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ
అవార్డు గ్రహీత.
9963499282





