న్యూ దిల్లీ/హైదరాబాద్, మార్చి 29 : దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు వ్యతిరేకిస్తూ…కార్మిక సంఘాలు రెండు రోజుల సమ్మె చేపట్టారు. సమ్మెకు మిశ్రమ స్పందన లభించింది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో సమ్మె ప్రభావం కనిపించింది. బ్యాంకింగ్, ప్రజారవాణా వ్యవస్థలు నిలిచిపోయాయి. సింగరేణిలో బొగ్గు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో కార్మికులు రోడ్లపైకి వొచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు యథావిథిగా కొనసాగాయి. అత్యవసర సేవలకు ఎలాంటి విఘాతం కలగలేదు. సమ్మెలో ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ. ఎస్‌ఈడబ్ల్యూ ఏ, ఎల్ పీఎఫ్, యూటీయూసీ జాతీయ కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటైజేషన్ తక్షణమే విరమించుకోవాలని, జాతీయ ఉపాధి హావి• పథకం కింద పనిచేసే కూలీలకు వేతనాలు పెంచాలని, కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ కార్మిక సంఘాలు చేస్తున్నాయి.
సింగరేణిలో రెండోరోజూ కొనసాగిన సమ్మె..నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా దేశ వ్యాప్తంగా కార్మికుల నిరసనలో భాగంగా సింగరేణిలో నాలుగు బొగ్గు బ్లాకుల వేలం వేసే పక్రియను నిరసిస్తూ బిఎంఎస్ మినహా నాలుగు జాతీయ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సంపూర్ణ మద్దతు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా సింగరేణిలో కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు.
రామగుండం రీజియన్‌లో 6 భూగర్భ గనులు, 4 ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో సింగరేణిలో 4 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. భూపాలపల్లిలోనూ కార్మికులు తమ విధులకు హాజరు కాలేదు. అత్యవసర సిబ్బంది మాత్రమే విధులకు హాజరయ్యారు.