కాంగ్రెస్‌ పార్టీ కి అండగా విద్యావంతులు,పౌర సంఘాలు

యువతను, వోటర్లను చైతన్యపరిచే తీవ్ర ప్రయత్నం
వారి కృషి ఫలొంచేనా..?
సర్వత్రా నెలకొన్న ఆసక్తి

కాళోజీ జంక్షన్‌(హన్మకొండ), ప్రజాతంత్ర, నవంబరు 29 : తెలంగాణ రాష్ట్ర సాధారణ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. గత రెండు నెలలుగా తెలంగాణ సమాజంలో రాజకీయ వేడితో అట్టుడికిపోయింది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రజా సంఘాలు, మేధావులు  ఈసారి తమ వ్యుహాల రచన, ప్రచారంలో విజయం సాధించినట్లుగానే భావిస్తున్నారు. 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత తెలంగాణ రాష్ట్ర సమితి తిరుగులేని నాయకత్వంతో తీసుకున్న నిర్ణయాలను యథేచ్చగా అమలు చేసింది. దీంతో విపక్షాలు సైతం ఒక దశలో చేష్టలుడిగిపోయాయి. తెలంగాణలో మూడోసారి పరిపాలన పగ్గాలు చేపట్టడానికి ఎన్నికల ప్రచారంలో నాయకత్వం ఒంటిచేత్తో తీవ్రమైన చెమటోడ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా రాజకీయంగా పార్టీ పేరును మార్పిడి చేసి జాతీయ రాజకీయాల్లో ఒక చర్చకు దారితీసి మహారాష్ట్రలో చేరికలతో హాడావిడి అందరినీ ఆర్షించింది. తెలంగాణ ప్రజానీకంలో మూడోసారి తిరుగులేదన్న ఆలోచనలు గులాబీ శ్రేణులు రేకెత్తించాయి. భారాస ఈ వ్యూహాత్మక  ప్రచారాలు, రాజకీయ ఎత్తుగడలు అట్టడుగు గ్రామీణ ప్రజల్ని చేరకముందే కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటన విడుదల చేయడంతో భారత రాష్ట్ర సమితి వ్యూహాలు  ప్రజల్లోకి చేరకుండానే స్తబ్దతకు చేరింది. మరోవైపు తెలంగాణ పౌర సమాజంలో మార్పుకు కృషి చేస్తున్న వివిధ ప్రజాసంఘాలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు  ఏకతాటిపైకి రాకపోయినప్పటికీ ఏక సూత్రాభిప్రాయంతో ఎన్నికల ప్రచారంలో తమ పంథాను కొనసాగించారు. భారాసకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ పార్టీయే సరైనదనే ప్రచారాన్ని ఈసారి మేధావులు  ప్రజలను చైతన్యం చేయడంలో కీలమైన పాత్రను పోషించాయి. గత పదేళ్లలో తెలంగాణ సమాజంలో ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికపుడు పట్టుకుని ఎత్తిచూపడంలో ప్రొఫెసర్‌ కోదండరామ్‌ తనదైన బాధ్యతను నిర్వహించారు.

image.pngimage.pngimage.pngimage.png

2018 ఎన్నికల్లో ప్రొఫెసర్‌ కోదండరామ్‌ తెలంగాణ జనసమితి పార్టీ కాంగ్రెస్‌తో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయింది. గత చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గత ఎన్నికల పరిస్థితి పునరావృతం కాకుండా కాంగ్రెస్‌ పార్టీని తెలంగాణలో బలమైన శక్తిగా నిలపడంలో…గత పదేళ్లలో భారాస వైఫల్యాలను సూటిగా ఎత్తిపట్టడంలో ప్రొఫెసర్‌ కోదండరామ్‌  విజయం సాధించారు. తెలంగాణ జనసమితి అభ్యర్థులను సూర్యాపేట, నర్సంపేట నియోజకవర్గాల్లో పోటీలో దించడానికి కాంగ్రెస్‌ పార్టీని రెండు స్థానాలు అడిగినప్పటికీ కాంగ్రెస్‌ నాయకత్వం బుజ్జగించడంతో ప్రొఫెసర్‌ కోదండరామ్‌ శాంతించారు. భారాస పట్ల తెలంగాణ సమాజంలో ఉన్న వ్యతిరేక వోటు బ్యాంకును పోలరైజ్‌ చేయడానికి ప్రొఫెసర్‌ కోదండరామ్‌ను స్టార్‌ క్యాంపెయినర్‌ బాధ్యతలు అప్పగించింది. దీంతో ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ఉత్తర తెలంగాణలోని వరంగల్‌, కరీంగనగర్‌, సింగరేణి కోల్‌బెల్టు ఏరియాలతోపాటు, ఆదిలాబాద్‌ జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి తెలంగాణ ఉద్యమకాలం నాటి శ్రేణులను మరోసారి భారాస సర్కార్‌ను దించడంలో ముందుండాలని ఆయా నియోజకవర్గాల్లో కార్నర్‌ మీటింగులు, మీడియా సమావేశాలు, ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాలతో మమేకమై రాజకీయ మార్పు కోసం పిలుపునిచ్చారు. నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌, మహబూబ్‌నగర జిల్లాల్లో కూడా కోదండరామ్‌ తెలంగాణ పొలిటికల్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ పాత మిత్రులందరినీ సంప్రదించి కేసీయార్‌ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలని వ్యక్తిగతంగా కలుస్తూనే, సామూహిక సమావేశాల్లో వివిధ సంఘాలను దిశానిర్దేశం చేయడానికి వ్యూహాలు  అమలు చేశారు.
తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక సభ్యుడు, తెలంగాణ ఆవశ్యకతను కేసీఆర్‌కు చాటిచెప్పిన గాదె ఇన్నారెడ్డి ఈ సారి భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీలను లక్ష్యంగా చేసుకొని తన ప్రచారాన్ని గత ఏడాదిగా తీవ్రంగా సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా బీజేపీ అనుసరిస్తున్న బ్రాహ్మణీయ హిందుత్వ పాలనను వ్యతిరేకిస్తూ ‘భారత్‌ బచావో’ సంస్థను స్థాపించి దేశవ్యాప్తంగా మోదీ విధానాలను దుయ్యబట్టారు. అంతే ధీటుగా కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమం నుంచి గత పదేళ్ల ప్రభుత్వ పరిపాలన వరకు ప్రతీ అంశాన్ని సోషల్‌ మీడియాతోపాటు తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా కేసీఆర్‌ను గద్దెదించాలని కోరుతూ విస్తృతంగా పర్యటించారు. భారత్‌ బచావో ఉద్యమంలో గాదె ఇన్నయ్యకు తోడుగా ప్రముఖ కార్డియాలజిస్టు, తెరాస మాజీ నేత, భారత్‌ బచావ్‌ కోన్వీనర్‌ ఎం.ఎఫ్‌ గోపీనాథ్‌ కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారాస, భాజాపా బ్రాహ్మణియ ఆధిపత్య రాజకీయాలకు ప్రత్యామ్నాయ సాంస్కృతిక రాజకీయాలను ప్రజల్లో భావజాల వ్యాప్తికి కృషి చేశారు. తెలంగాణలో కుటుంబ దోపిడీ పాలనకు స్వస్తి పలకాలని కోరారు. తాజాగా ఈనెల 18న గాదె ఇన్నయ్య, ఎం.ఎఫ్‌ గోపినాథ్‌ మరో ఇద్దరు వ్యక్తులపై సిరిసిల్ల జిల్లా పోలీసులు ‘ఉపా’ కేసులు నమోదు చేసినట్లు బయటకు పొక్కడంతో తెలంగాణ పౌరసమాజంలోని విద్యావంతులు, మేధావులు , కవులు, రచయితల్లో అక్రమ కేసులు నమోదు చేయడం పట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉపా కేసుల నమోదుతో అధికార భారాస పార్టీ అనుసరిస్తున్న అణచివేత ధోరణిపట్ల తెలంగాణ వోటర్ల మీద మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.
image.png
సోషల్‌ డెమోక్రటిక్‌ ఫోరం కన్వీనర్‌, మాజీ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి నేతృత్వంలో ‘జాగో తెలంగాణ యాత్ర’ మధ్యతరగతి, అట్టడుగు రైతాంగం, కార్మికులు, మహిళలను చైతన్యం చేయడంలో సఫలీకృతమైనట్లు సమాచారం. ఉత్తర తెలంగాణలోని పాత జిల్లా కేంద్రాలతోపాటు భారాస బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా మీడియా సమావేశాలు, చిన్న సభలు ఏర్పాటు చేసిన కేసీఆర్‌ పాలనపట్ల ప్రజలను కళ్లు తెరిపించడానికి శాయాశక్తుల పనిచేశారు. వీరి సమావేశాలకు ఉస్మానియ విశ్వవిద్యాలయం జర్నలిజం ప్రొఫెసర్‌ పద్మజా షా, కేయూ ప్రొఫెసర్‌ వినాయక్‌ రెడ్డి, ప్రొఫెసర్‌ కూరపాటి వెంకటనారాయణ వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాలో ప్రత్యేకంగా ఉద్యోగులు, విద్యార్థులు, యువతను కదిలించారు. సోషల్‌ డెమోక్రటిక్‌ ఫోరం ఆధ్వర్యంలో సాధిక్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌, అడ్వకేట్‌ ఎం.డి.సాదిక్‌ అలీ తొలిదశలో ఎన్నికల ప్రకటనకు ముందుగానే ధరణి వెబ్‌సైట్‌తో రైతులు పడుతున్న కష్టనష్టాలను ప్రజలకు వివరించారు. ధరణీ వెబ్‌సైట్‌ వొచ్చిన తరువాత పెరిగిన రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, రైతుల ఇక్కట్లు, ప్రైవేటు సంస్థకు ధరణీ సైటును అప్పగించడాన్ని వ్యతిరేకించారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి నిరుద్యోగ విద్యార్థుల జాక్‌ ప్రజా చైతన్య బస్సు యాత్ర తెలంగాణ సమాజాన్ని నిద్ర నుంచి మేల్కొలిపింది. రిటైర్డు ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌ నేతృత్వంలో తెలంగాణ పీపుల్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటి ఆవిర్భవించింది. గత పదేళ్లలో కేసీఆర్‌ నియంతృత్వ పాలనా వైఖరులను తప్పుపడుతూ విద్యార్థులు, ఉద్యోగస్తులు, యువతను మేల్కోలిపింది. మళ్లీ భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వొస్తే మాత్రం ప్రశ్నించే మేధావులు , ఉద్యోగులను జైలులో పెట్టిస్తాడని ఆందోళన వ్యక్తం చేశారు. వీరితోపాటు టిపిజేఏసి నాయకులుగా తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు అంబటి నాగయ్య, రైతు స్వరాజ్య వేదిక అధ్యక్షుడు కన్నెగంటి రవి కూడా తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు కారణాలను విశ్లేషించి ప్రజలను చైతన్యం చేయడంతో రాజకీయ వాతావరణంలో క్రమంగా కొత్తగాలి వీయడం జరుగుతుందని అనుకుంటున్నారు. రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితి,ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలోని ఇబ్బందులను, ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు సర్కార్‌ మద్దతుగా నిలవడంపై వొచ్చిన విమర్శలను ప్రజల ముందు పెట్టడంతో ప్రొఫెసర్‌ హరగోపాల్‌ విజయం సాధించారు.
పౌరహక్కుల అణచివేత, మేథావులు, రచయితలపై అక్రమకేసుల బనాయింపు తదితరమైన అంశాలను టిపిజేఏసీ పెద్ద ఎత్తున ప్రచారంలో పెట్టింది. తెలంగాణ ప్రభుత్వంలో ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌గా పనిచేసిన పిడమర్తి రవి, బీసీ కమిషన్‌ ఛైర్మన్‌గా పనిచేసిన బి.ఎస్‌.రాములు, తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మెన్‌గా పనిచేసిన కేయూ ప్రొఫెసర్‌ తుమ్మ పాపిరెడ్డి ప్రధానంగా కేసీఆర్‌ నియంత వ్యవహార శైలీపై ప్రజల్లో ఫోకస్‌ పెంచడానికి సోషల్‌ మీడియా వేదికగా కీలకంగా పనిచేసి సర్కార్‌ పనితీరుపై ప్రజల్లో అసంతృప్తిని మూటగట్టడంలో ఒకరంగా సఫలమయ్యారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ ముస్లిం ఆర్గనైజేషన్స్‌ జేఏసీ కన్వీనర్‌ సలీంపాషా, కోకన్వీనర్‌ కవి, జర్నలిస్టు స్కైబాబా, యూనస్‌ ఫర్వేజ్‌, కోర్‌ కమిటీ సభ్యులు ఫారూక్‌, హానిప్‌ షేక్‌, జీనత్‌ అజ్మీ, సయ్యద్‌ ఖలీదా పర్వీన్‌, ప్రొఫెసర్‌ మహ్మాద్‌ అన్సారీ కలిసి గత రెండేళ్లుగా విస్తృతంగా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. ముస్లింలకు ‘ఇప్తార్‌ నహీ, రోజ్‌గార్‌ చాహియే’ నినాదంతో ముస్లిం వర్గాల్లో ఆలోచింప చేశారు. ముస్లింలకు కేసీయార్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు పన్నెండుశాతం రిజర్వేషన్లు అమలు వైఫల్యాలను ఆ వర్గాల ముందు ఉంచారు. భారాస, భాజపా రాజకీయ మిత్రవైఖరిని అట్టడుగు ముస్లిం వర్గాలకు తమ అవాజ్‌ను వినిపించడానికి ఆయా నియోజకవర్గాల్లో విస్తృతమైన పర్యటనలు, సమావేశాలు జరిపినట్లు తెలియజేస్తుంది. అదే విధంగా తెలంగాణ ప్రజాసంఘాల సమాఖ్య కన్వీనర్‌ సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరి, సుప్రీమ్‌ కోర్టు సీనియర్‌ అడ్వకేట్‌ నిరూప్‌రెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు, ప్రజాసంఘాలు, తటస్తులను కదిలించడంలో ప్రధాన భూమికను పోషించారు. తెలంగాణ సమాజంలో ప్రజాపక్షంగా గత పదిహేనుళ్లుగా వివిధ రంగాల్లో మేథావులు, నిబద్ధత కలిగిన జర్నలిస్టులు, విద్యావంతుల భావజాలం ప్రజల్ని ఆలోచింపచేయడంలో ఎంతో ప్రాధాన్యత కలిగివుండటం వల్లనే మార్పుగాలి వీయడానికి కారణమైందని విశ్లేషకుల భావన.
తెలంగాణ పౌరసమాజాన్ని ప్రత్యామ్నాయ రాజకీయ మార్పు కోసం కృషి చేయడంలో మేధావులు, ప్రజాసంఘాలు, విద్యార్థుల జేఏసీలు, మేధావులు వైయుక్తిక కృషి ఏమేరకు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చేయూతనిస్తుందనేది పరిశీలకులకు చాలా ఆసక్తికరంగా మారిందని పలువురు భావిస్తున్నారు. పౌర సమాజం కృషి పోలింగ్‌ కేంద్రాల్లో ఎంతమేరకు వర్కవుట్‌ అవుతుందనేది కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అధికార పార్టీ మాత్రమే చివరి 24 గంటల్లో చేసే వోటు మేనేజ్‌మెంట్‌పై ప్రధానంగా దృష్టి సారించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో కూడా విపక్ష పార్టీలు అంతే ధీటుగా ఎదుర్కునడానికి సిద్ధంగా ఉండాలని తమ శ్రేణులకు ఇప్పటికే పిలుపునిచ్చి వోటు యుద్ధానికి సన్నద్ధం చేసి ఉంచాయి. దీనికితోడు రెండు రోజుల క్రితం మంత్రి హరీష్‌రావు ఎన్నికల ప్రసంగ వ్యాఖ్యలతో రైతు బంధుకు బ్రేక్‌ పడటంతో భారాస సెల్ఫ్‌గోల్‌ చేసుకున్నట్లయిందని పలువురు చర్చించుకుంటున్నారు. ఏదీఏమైనప్పటికీ మరోవారం రోజుల్లో వీచినగాలి సరికొత్త ఫలితాలనే మోసుకు వొస్తుందని రాజకీయ నిపుణులు, పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అంచనాలు ఏమేరకు వాస్తవాలు, అవాస్తవాలు అవుతాయనే విషయాలు తేటతెల్లం కావడానికి మరోవారం రోజులు వేచి చూడాల్సిందేనని రాజకీయ పక్షాలు భావిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *