నాలుగు దశాబ్దాలుగా పార్టీ కోసం పని చేస్తున్నా…
నాకన్నా 4 ఏళ్ళ తర్వాత జానారెడ్డి పార్టీలో చేరారు
మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15 : ‘నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేశాను.. , బీఆర్‌ఎస్ హయాంలో 10 ఏళ్ళు ఒంటరి పోరాటం చేశాను.. ఇప్పుడు పార్టీలో నా స్థానం, నా సీనియారిటీ ఏంటి అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాలలో మంగళవారం జీవన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ పార్టీలో నా సీనియారిటీకి స్థానం ఏమిటనే భావన నాలో ఉందన్నారు. ఒక దశలో జీవన్ రెడ్డి బావోధ్వగానికి లోనయ్యారు. కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్ అని అంటారని ఆయన పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నా, దశాబ్దకాలం పోరాటం చేశానని చెప్పుకొచ్చారు. ఏమాత్రం తోనకకుండా, కాంప్రమైజ్ కాకుండా 10 ఏళ్ళు ఒంటరి పోరాటం చేశానని జీవన్ రెడ్డి చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి, సీఎల్పి నేతగా భట్టి విక్రమార్క ఎంత పోరాడరో శాసన మండలిలో ఏకైక సభ్యుడిగా నేను అంతే పోరాటం చేశానని నేనేమి తక్కువ కాదని తేల్చి చెప్పారు. 2014 లో బీఆర్‌ఎస్ ప్రభంజనంలో తట్టుకుని జగిత్యాల నుంచి ఎమ్మెల్యే గా గెలువడమే కాకుండా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి 3 జిల్లాలో ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసి పార్టీ పటిష్టతకు పాటుపడ్డనని జీవన్ రెడ్డి అన్నారు. 2019 లో మార్చి వరకు 6 ఏళ్ళు శాసన మండలిలో ఏకైక కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా బీఆర్‌ఎస్ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేశాననీ జీవన్ రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలో నాకన్న సీనియర్ ఎవరూ లేరని, ఇప్పుడు ఉన్న వారిలో వి.హన్మంత రావు ఒక్కరే నాకన్న సీనియర్ అని పేర్కొన్నారు. జానారెడ్డి కూడా నా తర్వాత 4 సంవత్సరాలకు కాంగ్రెస్ పార్టీలో చేరారనీ చెప్పారు. పార్టీకి ఎప్పుడు నేను వ్యతిరేకంగా మాట్లాడలేదనీ, పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తున్నానని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోందని విలేకరుల ప్రశ్నకు 40 ఏళ్లుగా పార్టీకోసం పని చేస్తున్న నా స్థానం ఏంటిదని అడుగుతున్న అంతే కానీ.. నేనెందుకు పార్టీ మారుతానని ఎదురు ప్రశ్న వేశారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బండ శంకర్, కొత్త మోహన్, గాజుల రాజేందర్, మసర్తి రమేష్, ధర రమేష్, బీరం రాజేష్, రజినీకాంత్, మహిపాల్, పిప్పరి అనిత, వల్లెపు మొగిలి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.