- టీఆర్‌ఎస్‌తో తెగదెంపులకే కేసీఆర్‌తో సమావేశం : రేవంత్ ట్వీట్
- శత్రువును నమ్మొద్దంటూ పీకేను ఉద్దేశించి మాణిక్కం టాగూర్
- అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా సమ్మతమే : భట్టి
ప్రజాతంత్ర, హైదరాబాద్ : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐ ప్యాక్ సేవలను కొనసాగించాలని టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించడం రాష్ట్ర కాంగ్రెస్‌లో ప్రకంపనలు పుట్టిస్తోంది. కాంగ్రెస్‌లో పీకే చేరనున్నారనే ప్రచారం నేపథ్యంలో ఆయనతో కేసీఆర్ రెండు రోజులు భేటీ కావడం చర్చనీయాంశమైంది. •ప్రశాంత్ కిషోర్ సీఎం కేసీఆర్‌తో రహాస్య చర్చలు జరపడం మరోవైపు, దిల్లీలో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో గత వారం పలుమార్లు సమావేశమై ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడం వంటి పరిణామాలు కాంగ్రెస్ నేతలను అయోమయంలో పడేశాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్, పీకే భేటీపై పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు.
టీఆర్‌ఎస్‌తో తెగదెంపుల కోసమే పీకే కేసీఆర్‌ను కలిశారని సోమవారం ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ప్రశాంత్ కిషోర్‌కు టీఆర్‌ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరాక రాష్ట్రానికి వస్తారనీ, ఇటవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఇదే విషయాన్ని తనతో చెప్పారని పేర్కొన్నారు. తనతో కలసి పీకే ప్రెస్ మీట్ పెట్టే రోజు త్వరలోనే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ను ఓడించాలని పీకే చెప్పడం ప్రజలు వింటారనీ, పీకే కాంగ్రెస్‌లో చేరిన తరువాత అధిష్టానం మాటే ఫైనల్ అవుతుందని పేర్కొన్నారు. మరోవైపు, పీకే అంశంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా స్పందించారు. నివేదిక తరువాత కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు.
అధిష్టానం ఏ నిర్నయం తీసుకున్నా సమ్మతమేనని భట్టి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌పై కావాలని కొందరు పనిగట్టుకుని ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే, వీరిద్దరికి భిన్నంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ శత్రువును నమ్మొద్దు అంటూ పీకేను ఉద్దేశించి చేసిన ట్వీట్ కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. దీనిని భట్టి సమర్థించారు. మాణిక్కం ఠాగూర్ ట్వీట్‌లో తప్పేముందనీ, శత్రువును నమ్మొద్దని ఠాగూర్ అన్నారు కానీ శత్రువు ఎవరో చెప్పారా అని భట్టి వ్యాఖ్యానించారు.