ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 26 : కల్వకుర్తి నియోజకవర్గంలో రాజకీయాలు రోజురోజుకు కొత్త మలుపు తిరుగుతున్నాయి. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టి పెట్టడంతో రాజకీయం రసవత్తరంగా మారుతున్నాయి. కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలను సమసి పోయే విధంగా కృషి చేస్తూ.. అలక వహించిన వారిని ఏదో రకంగా బుజ్జగిస్తూ రేవంత్ రెడ్డి సఫలీకృతమయ్యారు. గురువారం ఆమనగల్లు పట్టణంలో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి లు సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ అధిష్టానం నిర్ణయం మేరకు కసిరెడ్డి నారాయణరెడ్డి గెలిపించుకునేందుకు అన్ని విధాలా సహకరిస్తానని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న కల్వకుర్తిలో కలిసికట్టుగా పనిచేసి నారాయణరెడ్డిని గెలిపించుకుంటామని తెలిపారు. గత నలభైఏళ్లుగా నాకు మా కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉందని నేను కాంగ్రెస్ వాదినని, కాంగ్రెస్ గెలుపే నా గెలుపుగా భావిస్తూ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని సుంకిరెడ్డి కోరారు. అధిష్టానం ప్రకటించిన కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి గెలుపుకు కల్వకుర్తి లో కాంగ్రెస్ జెండా ఎగరడమే లక్ష్యంగా వర్గాలకు తావు లేకుండా ముందుకు సాగుదామని తెలిపారు. నియోజకవర్గంతో పాటు రాష్ట్రం, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు.కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సి కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం రాఘవేందర్ రెడ్డి తీసుకున్న గొప్ప నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి కార్యకర్తను కాపాడుకుంటూ ఎలాంటి వర్గాలకు తావులేకుండా సమన్వయంతో ముందుకు వెళ్తామని సూచించారు.తన గెలుపుకోసం కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం కలిసిపని చేయడానికి సిద్ధమైన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డికి ప్రత్యేకంగా అభినందించారు. ఈరోజు నుంచి ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకమై కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఆరు గ్యారెంటీ పథకాలను వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం కసిరెడ్డిని గెలిపించుకుందాం
