ఓయూలో కొనసాగుతున్న ఉద్రిక్తత

  • పోటాపోటీగా దిష్టిబొమ్మల దహనాలు
  • రాహుల్‌ను క్యాంపస్‌లో అడుగుపెట్టనివ్వం : టీఆరెఎస్వీ
  • ఏది ఏమైనా సభ నిర్వహించి తీరతాం : ఎన్‌ఎస్‌యూఐ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర : ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణ కొనసాగుతూనే ఉంది. వర్సిటీ వేదికగా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.  కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ వర్సిటీ సందర్శనను వ్యతిరేకిస్తూ అధికార టీఆర్‌ఎస్‌ ‌విద్యార్థి విభాగానికి చెందిన టీఆర్‌ఎస్వీ నేతలు రాహుల్‌ ‌దిష్టిబొమ్మను దహనం చేయగా అందుకు ప్రతిగా కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన ఎన్‌ఎస్‌యూఐ నేతలు కేసీఆర్‌ ‌దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ క్రమంలో వర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసుల రంగప్రవేశం చేసి పలువురు విద్యార్థులను అరెస్టు చేశారు. ముందుగా రాహుల్‌ ‌రాకను వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్వీ నేతలు కాంగ్రెస్‌ ‌పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. రాహుల్‌ ‌గాంధీని క్యాంపస్‌లో అడుగుపెట్టనివ్వబోమని స్పష్టం చేశారు. తెలంగాణ ఇవ్వకుండా వందలాది మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన కాంగ్రెస్‌ ‌నేతలకు క్యాంపస్‌లో అడుగుపెట్టే అర్హత లేదని స్పష్టం చేశారు.

దీంతో పోలీసులు టీఆర్‌ఎస్వీ నేతలను అరెస్టు చేసి పోలీస్‌ ‌స్టేషన్‌కు తరలించారు. ఆ తరువాత ఎన్‌ఎస్‌యూఐ నేతలు ర్యాలీగా బయల్దేరి ఆర్టస్ ‌కళాశాల వద్ద కేసీఆర్‌ ‌దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ ఉద్యమం పేరుతో విద్యార్థుల ఆత్మబలిదానాల కారణంగా గద్దెనెక్కిన సీఎం కేసీఆర్‌ అమరులనే మోసం చేశారని ఆరోపించారు. అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణలో అన్యాయానికి గురవుతున్న విద్యార్థులు, నిరుద్యోగులను పరామర్శించడానికి రాహుల్‌ ‌గాంధీ వొస్తుంటే అధికార పార్టీ ఎందుకు ఉలికి పడుతున్నదని ప్రశ్నించారు.

ఏది ఏమైనా విద్యార్థులతో రాహుల్‌ ‌ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించి తీరతామని స్పష్టం చేశారు. మరోవైపు, రాహుల్‌ ‌గాంధీ ఓయూ క్యాంపస్‌ ‌సందర్శన సందర్భంగా అధికార టీఆర్‌ఎస్‌ ‌విద్యార్థి విభాగం టీఆర్‌ఎస్వీ, కాంగ్రెస్‌ ‌పార్టీ అనుబంధ విభాగం ఎన్‌ఎస్‌యూఐ పోటాపోటీ కార్యక్రమాలతో ఉస్మానియా క్యాంపస్‌లో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page