నీకేమైనా అనిపించిందా…ఇవ్వాళ…
పోయిన కాలం వస్తుందని!
నీకేమైనా తోస్తుందా…
గడిచిన రోజులు పుడతాయని..!
నీకేమైనా తడుతుందా…
విరిగిన బతుకులు అతుకుతాయని..!
అనిపిస్తుందా…ఏమైనా వినిపిస్తుందా..!
అన్ని తత్వాలు మానవత్వం చెట్టుకొమ్మలేనని!
దేనిని పట్టుకుని ఊగినా
సన్నిహితము లేదా విపరీతము కదా…
పరిస్థితులు కల్పించాయి కదా
కసాయి మూకలను!
పరిస్థితులనేమో పునాది!!
ఇక్కడికి పంచడానికి వచ్చాం
ఏ మతము అతీతం కాదు
అన్నీ చెప్పాయి-
ఆచరణలను…ఆనందాన్ని..!
మరి దేహంలో ఇరికిస్తే…
బుర్రలో తోస్తే…
మనకంటూ మనం మిగిలాలి కదా..!
మనం ఎవరం కాము…
తెల్ల కాగితంలా పుట్టిన వాళ్ళమే..!
మన చుట్టూ తుఫాను
కొన్ని రాళ్ళను రప్పలను
కంపలను చెట్లను తోసింది…
చుట్టేసింది!
మళ్ళా సర్దుకోవాలి…
తొలగించుకోవాలి తప్పదు!
కూల్చడం సులభం పేర్చడం దుర్భరం
ఒక్కొక్కటిగా ఒక్కో ఈక…ఆకు అల్లిక..!
పుట్టిందే అందుకు- కూర్చడానికి
శుభ్రపరచడానికి ఊడవడానికి
నడవడానికి సాగు చేయడానికి…
శ్రమ సుఖం ప్రేమ నిద్ర పని
వెల్లువా వెలితి ఆలోచన మరి
ధ్యాస ధ్యానం జ్ఞానం…అన్నీ…
బాటలో ఒక రోజు అతిథివి నువ్వు!
కనిపిస్తోందా చలివేంద్రం దూరంగా నీకు
ఇప్పటికైనా వినిపిస్తోందా…
ఏమైనా అనిపిస్తోందా..!!!
-వగ్గు రఘువీర్
ఒక రోజు అతిథి





