- సబ్ సెంటర్ నుంచి టీచింగ్ హాస్పిటల్ వరకూ నివేదిక
- ఇకపై ప్రతీ నెలా అన్ని విభాగాలపై సమీక్షలు
- వైద్య ఆరోగ్య శాఖలో మంత్రి హరీష్ రావు తనదైన ముద్ర
ప్రజాతంత్ర , హైదరాబాద్ : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు ఆ శాఖపై తనదైన ముద్ర వేస్తున్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావుపై ఉన్న నమ్మకంతో సీఎం కేసీఆర్ ఆయనకు కీలకమైన వైద్య,ఆరోగ్య శాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి ప్రభుత్వ దవాఖానాలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే వైద్య, ఆరోగ్య శాఖలోని ప్రతీ విభాగంపై వరుస సమీక్షలు నిర్వహిస్తూ వైద్యులు, సిబ్బందిని ఎప్పటికప్పుడు ప్రజలకు వైద్య సేవలు అందేలా సన్నద్ధం చేస్తున్నారు. తాజాగా, హెల్త్ పోగ్రెస్ రిపోర్ట్ అనే కార్యక్రమానికి రూపకల్పన చేశారు. వచ్చే ఏప్రిల్ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని సబ్ సెంటర్ నుంచి టీచింగ్ హాస్పిటల్ వరకూ పనితీరును మంత్రి హరీష్ రావు స్వయంగా పర్యవేక్షించనున్నారు.
ప్రతీ సబ్ సెంటర్ నుంచి టీచింగ్ హాస్పిటల్ వరకు ఆ నెలలో ఎంత మంది రోగులు వచ్చారు ? ఏ వైద్యం కోసం వచ్చారు ? వారికి వైద్యులు, సిబ్బంది ఏ విధమైన వైద్య చికిత్సలు అందజేశారు ? ఎవరైనా వైద్యం కోసం ప్రైవేటు హాస్పిటల్స్‌కు వెళ్లారా ? అనే వివరాలను అధికారులు నెల చివరిలోగా వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు నివేదిక రూపంలో అందజేయాల్సి ఉంటుంది.ఈ నివేదిక ఆధారంగా మంత్రి హరీష్ రావుతో పాటు వైద్య,ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించి ఆ తరువాతి నెల చర్యలు తీసుకుంటారు. కాగా, ప్రభుత్వ దవాఖానాలలో శస్త్ర చికిత్సలు కచ్చితంగా పెరగాల్సిన అవసరం ఉందని మంత్రి హరీష్ రావు ఆ శాఖ అధికారులకు స్పష్టం చేస్తున్నారు. పేదలు, సామాన్యులకు భారంగా మారుతున్న డయాగ్నస్టిక్స్ సేవలు, స్పెషలైజేషన్ విభాగంలో శస్త్ర చికిత్సలపై మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ఇందులో భాగంగా గత వారం ఆర్థోపెడిక్ వైద్యులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌లోని ప్రధాన దవాఖానాల వరకు ఆయా విభాగాల్లో స్పెషలిస్టు వైద్యులకు కొరత లేకున్నప్పటికీ ప్రభత్వ దవాఖానాలలో శస్త్ర చికిత్సలు తక్కువ సంఖ్యలో జరగడాన్ని ఆయన ప్రధానంగా సమీక్షలో ప్రస్తావించారు. ప్రభుత్వ దవాఖానాలలో శస్త్ర చికిత్సల సంఖ్య ఇంకా ఎక్కువగా పెరగాల్సి ఉందనీ, ఆ దిశగా వైద్యులు కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. అలాగే, ఇకపై ప్రతీ విభాగంపై ప్రతీ నెలా సమీక్షలు నిర్వహించి ఆయా విభాగాలలో ఉన్న లోపాలను సవరించేందుకు మంత్రి హరీష్ రావు చర్యలు చేపడుతున్నారు.